లఖ్‌నవూపై పంజా
ABN , Publish Date - Apr 02 , 2025 | 04:55 AM
ఛేదనలో పంజాబ్ ఆది నుంచే దూసుకెళ్లింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ లఖ్‌నవూ బౌలర్లను ఆడేసుకున్నాడు. ఎలాంటి బంతినైనా ఎడాపెడా బాదేస్తూ బౌండరీల వరద పారించాడు. శ్రేయాస్, నేహల్ వధేరా సైతం బ్యాట్లు ...

ఐపీఎల్‌లో నేడు
వేదిక బెంగళూరు, రా.7.30
బెంగళూరు X గుజరాత్
చెలరేగిన ప్రభ్‌సిమ్రన్, శ్రేయాస్
అర్ష్‌దీ్‌పనకు మూడు వికెట్లు
కింగ్స్ చేతిలో పంత్‌సేన ఓటమి
లఖ్‌నవూ: ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ అదరగొడుతోంది. బౌలింగ్, బ్యాటింగ్‌లో తిరుగులేని ప్రదర్శన కనబర్చుతూ ప్రత్యర్థులకు సవాల్ విసురుతోంది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (34 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 69), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 52 నాటౌట్) మెరుపు అర్ధసెంచరీలతో మంగళవారం లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. పంజాబ్‌కిది వరుసగా రెండో విజయం. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 44), ఆయుష్ బదోని (33 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 41), మార్‌క్రమ్ (18 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 28), అబ్దుల్ సమద్ (12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 27) రాణించారు. ఛేదనలో పంజాబ్ 16.2 ఓవర్లలో 2 వికెట్లకు 177 పరుగులు చేసి గెలిచింది. నేహల్ వధేరా (25 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 43 నాటౌట్) చెలరేగాడు. స్పిన్నర్ దిగ్వే్‌షకు రెండు వికెట్లు దక్కాయి. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా ప్రభ్‌సిమ్రన్ నిలిచాడు.
బ్యాటర్ల దూకుడు: ఛేదనలో పంజాబ్ ఆది నుంచే దూసుకెళ్లింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ లఖ్‌నవూ బౌలర్లను ఆడేసుకున్నాడు. ఎలాంటి బంతినైనా ఎడాపెడా బాదేస్తూ బౌండరీల వరద పారించాడు. శ్రేయాస్, నేహల్ వధేరా సైతం బ్యాట్లు ఝుళిపించడంతో మరో 22 బంతులుండగానే పంజాబ్ గెలుపు సంబరాలు చేసుకుంది. తొలి ఓవర్‌లోనే సిమ్రన్ 4,6తో పరుగులకు తెర లేపాడు. మరో ఓపెనర్ ప్రియాన్ష్ (8)ను మూడో ఓవర్‌లో స్పిన్నర్ దిగ్వేష్ అవుట్ చేసినా సిమ్రన్ జోరు ఆగలేదు. బిష్ణోయ్ ఓవర్‌లో అతను వరుసగా 4,4,6 బాదగా జట్టు పవర్‌ప్లేలో 62/1 పరుగులు సాధించింది. మరో ఎండ్‌లో శ్రేయాస్ చక్కటి సహకారం అందిస్తూ ఎక్కువగా ప్రభ్‌సిమ్రన్‌కే స్ట్రయికింగ్ వచ్చేలా చూశాడు. ఈక్రమంలో ప్రభు 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ మైదానంలో ఎవరికైనా ఇదే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కావడం విశేషం.అయితే చక్కటి షాట్లతో దూసుకెళుతున్న అతడిని 11వ ఓవర్‌లో దిగ్వేష్ దెబ్బతీశాడు. ఆ ఓవర్ తొలి బంతికి సిమ్రన్ ఆడిన స్లాగ్ స్వీప్ సిక్సర్ ఖాయమనిపించినా.. బదోని బంతిని లోనికి విసిరి రోప్ దాటాడు. అంతలోనే బిష్ణోయ్ ఆ బాల్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత కూడా పంజాబ్ జోరు తగ్గలేదు. శ్రేయా్‌సతో పాటు నేహల్ ఎదురుదాడికి దిగాడు. 14వ ఓవర్‌లో వధేరా 6,4,6తో బిష్ణోయ్ 16 రన్స్ సమర్పించుకున్నాడు. అటు శ్రేయాస్ తర్వాతి ఓవర్‌లోనే 4,6 బాదడంతో పంజాబ్ ఛేదన సులువైంది. ఇక 30 బంతుల్లో 17 రన్స్ కావాల్సిన వేళ వధేరా 16వ ఓవర్‌లోనే 6,6,4తో 16 రన్స్ రాబట్టగా.. శ్రేయాస్ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. అలాగే 30 బంతుల్లోనే అజేయ హాఫ్ సెంచరీని కూడా పూర్తి చేశాడు.
ఆదుకున్న పూరన్-బదోని: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ ఇన్నింగ్స్ పేలవంగా ఆరంభమైంది. పంజాబ్ బౌలర్ల పకడ్బందీ బంతులకు 35 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. అయితే నికోలస్ పూరన్, ఆయుష్ బదోని అండగా నిలిచే ప్రయత్నం చేయడంతో జట్టు స్కోరు ఫర్వాలేదనిపించింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ మార్ష్‌ను పేసర్ అర్ష్‌దీప్ తొలి ఓవర్‌లో గోల్డెన్ డకౌట్‌గా అవుట్ చేశాడు. అటు మరో ఓపెనర్ మార్‌క్రమ్ మూడో ఓవర్‌లో మూడు ఫోర్లతో 13 రన్స్ రాబట్టాడు. తర్వాతి ఓవర్‌లోనే వరుసగా 4,6తో వహ్వా అనిపించినా అతడిని ఫెర్గూసన్ బౌల్డ్ చేశాడు. దీంతో రెండో వికెట్‌కు పూరన్‌తో మార్‌క్రమ్ 31 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక కెప్టెన్ పంత్ (2) మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. మ్యాక్స్‌వెల్ ఓవర్‌లో అతడు చాహల్‌కు క్యాచ్ ఇవ్వడంతో జట్టు పవర్‌ప్లేలో 39/3 స్కోరుతో నిలిచింది. తొలి ఓవర్‌లోనే క్రీజులోకి వచ్చిన పూరన్ పరిస్థితులకు తగ్గట్టు ఆరంభంలో సంయమనం చూపాడు. కాస్త కుదురుకున్నాక బ్యాట్ ఝుళిపిస్తూ పదో ఓవర్‌లో 4,4,6తో చెలరేగి 15 రన్స్ రాబట్టాడు. ఆ వెంటనే స్టొయినిస్ ఓవర్‌లో 6,4 బాదాడు. కానీ అతను మరింత ప్రమాదకరంగా మారకముందే 12వ ఓవర్‌లో పూరన్‌ను చాహల్ వెనక్కిపంపాడు. దీంతో నాలుగో వికెట్‌కు బదోనితో అతను జోడించిన 54 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం మిల్లర్ (19) స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా బదోని-సమద్ జోడీ వేగంగా ఆడి ఆరో వికెట్‌కు 47 పరుగులు జత చేర్చింది. ముఖ్యంగా సమద్ 18వ ఓవర్‌లో 6,4,4తో పాటు బదోని 4తో 20 రన్స్ సమకూరాయి. వీరి జోరుకు జట్టు స్కోరు కూడా 150 దాటింది. కానీ చివరి రెండు ఓవర్లలో పంజాబ్ బౌలర్లు నియంత్రించారు. 19వ ఓవర్‌లో పేసర్ జాన్సెన్ 8 పరుగులే ఇవ్వగా.. ఆఖరి ఓవర్‌లో బదోని, సమద్‌ల వికెట్లు తీసిన అర్ష్‌దీప్ 7 పరుగులే ఇచ్చాడు.
స్కోరుబోర్డు
లఖ్‌నవూ: మార్‌క్రమ్ (బి) ఫెర్గూసన్ 28, మార్ష్ (సి) జాన్సెన్ (బి) అర్ష్‌దీప్ 0, నికోలస్ పూరన్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) చాహల్ 44, పంత్ (సి) చాహల్ (బి) మ్యాక్స్‌వెల్ 2, బదోని (సి) మ్యాక్స్‌వెల్ (బి) అర్ష్‌దీప్ 41, మిల్లర్ (సి) ప్రభ్‌సిమ్రన్ (బి) జాన్సెన్ 19, సమద్ (సి) ఆర్య (బి) అర్ష్‌దీప్ 27, శార్దూల్ (నాటౌట్) 3, అవేశ్ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 171/7; వికెట్ల పతనం: 1-1, 2-32, 3-35, 4-89, 5-119, 6-166, 7-167; బౌలింగ్: అర్ష్‌దీప్ 4-0-43-3, ఫెర్గూసన్ 3-0-26-1, మ్యాక్స్‌వెల్ 3-0-22-1, జాన్సెన్ 4-0-28-1, స్టొయినిస్ 2-0-15-0, చాహల్ 4-0-36-1.
పంజాబ్: ప్రియాన్ష్ ఆర్య (సి) శార్దూల్ (బి) దిగ్వేష్ రాఠి 8, ప్రభ్‌సిమ్రన్ (సి) బిష్ణోయ్ (బి) దిగ్వేష్ రాఠి 69, శ్రేయాస్ అయ్యర్ (నాటౌట్) 52, నేహల్ వధేరా (నాటౌట్) 43, ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 16.2 ఓవర్లలో 177/2; వికెట్ల పతనం: 1-26, 2-110; బౌలింగ్: శార్దూల్ ఠాకూర్ 3-0-39-0, అవేశ్ ఖాన్ 3-0-30-0, దిగ్వేష్ రాఠి 4-0-30-2, రవి బిష్ణోయ్ 3-0-43-0, సిద్దార్థ్ 3-0-28-0, సమద్ 0.2-0-6-0.
పాయింట్ల పట్టిక
జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే
బెంగళూరు 2 2 0 0 4 2.266
పంజాబ్ 2 2 0 0 4 1.485
ఢిల్లీ 2 2 0 0 4 1.320
గుజరాత్ 2 1 1 0 2 0.625
ముంబై 3 1 2 0 2 0.309
లఖ్‌నవూ 3 1 2 0 2 -0.150
చెన్నై 3 1 2 0 2 -0.771
హైదరాబాద్ 3 1 2 0 2 -0.871
రాజస్థాన్ 3 1 2 0 2 -1.112
కోల్‌కతా 3 1 2 0 2 -1.428
గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;
ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్ రన్‌రేట్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..