Share News

ఆ విషయంలో ఇండియా తోపు.. జర్మనీ కూడా మన వెనకాలే..

ABN , Publish Date - Apr 08 , 2025 | 01:01 PM

Wind And Solar Power: నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయటం బాగా తగ్గిపోయింది. ప్రస్తుతం సోలార్, గాలి ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఈ విషయంలో భారత్ రికార్డు సృష్టించింది. జర్మనీని సైతం వెనక్కు నెట్టేసింది.

ఆ విషయంలో ఇండియా తోపు.. జర్మనీ కూడా మన వెనకాలే..
Wind And Solar Power

భారత్ కొత్త రికార్డు సృష్టించింది. 2024 సంవత్సరంలో గాలి, సూర్యకాంతి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసిన మూడో అతి పెద్ద దేశంగా చరిత్రలోకి ఎక్కింది. జర్మనీని సైతం వెనక్కు నెట్టేసింది. ఎంబర్స్ గ్లోబల్ ఎలక్ట్రిసిటీ రివ్యూ రిపోర్టులో ఈ విషయాలు వెలుగుచూశాయి. ఆ రివ్యూ రిపోర్టు ప్రకారం.. గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా గాలి, సూర్యకాంతి నుంచి ఉత్పత్తి చేసిన విద్యుత్ వాటా 15 శాతం కాగా.. అందులో భారత్ వాటా 10 శాతంగా ఉంది. ఇక, 2024లో ఇండియా వ్యాప్తంగా క్లీన్ ఎనర్జీ సోర్సెస్ ద్వారా ఉత్పత్తి చేసిన విద్యుత్ శాతం 22 కాగా.. అందులో హైడ్రో పవర్ వాటా 8 శాతంగా ఉంది. గాలి, సూర్యకాంతి నుంచి ఉత్పత్తి చేసిన విద్యుత్ వాటా 10 శాతంగా ఉంది.


2024 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా గాలి, సూర్యకాంతి నుంచి ఏకంగా 858 టెరావాట్ అవర్స్‌ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏటా సోలార్ విద్యుత్ ఉత్పత్తి పెరుగుతోంది. ఒక్క 2024 సంవత్సరంలోనే సోలార్ ద్వారా 474 టెరావాట్స్ అవర్స్ విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఇండియాలోనూ సోలార్ విద్యుత్ ఉత్పత్తి వేగంగా ముందుకు సాగుతోంది. 2024 సంవత్సరంలో.. దేశంలో ఉత్పత్తి అయిన మొత్తం విద్యుత్‌లో సోలార్ విద్యుత్ వాటా 7 శాతంగా ఉంది. సోలార్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో.. అమెరికా, చైనాల తర్వాత భారత్ మూడో స్థానం దక్కించుకుంది.


సోలార్ ఉత్పత్తిలో తెలుగు రాష్ట్రాలు

తెలుగు రాష్ట్రాల్లో సోలార్ శక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తి పెద్ద ఎత్తున జరుగుతోంది. రెండు రాష్ట్రాల్లోని పలు చోట్ల భారీ సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. 2017 సంవత్సరంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది. ఇండియాలోనే నెంబర్ వన్‌గా నిలిచింది. తెలంగాణ నాలుగవ స్థానాన్ని సొంతం చేసుకుంది. 2016 టు 2017 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సోలార్ ద్వారా 1,867 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసింది. తెలంగాణ 1287 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసింది. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో రెండు, మూడవ స్థానంలో రాజస్థాన్,తమిళనాడు నిలిచాయి. రాజస్థాన్ 1812 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగా.. తమిళనాడు 1691 వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసింది.

Updated Date - Apr 08 , 2025 | 01:01 PM