High-Speed Plasma Rocket Engine: రష్యా శాస్త్రవేత్తల ఘనత.. నెల రోజుల్లో అంగారకుడిని చేరేలా రాకెట్ ఇంజెన్ రూపకల్పన
ABN , Publish Date - Mar 04 , 2025 | 02:56 PM
కేవలం 30 రోజుల్లో అంగారకుడిని చేరగలిగేలా రష్యా ఓ అత్యాధునిక రాకెట్ ఇంజెన్‌ను రూపొందించింది. దీని సాయంతో గరిష్టంగా సెకెనుకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించొచ్చు.

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం సంప్రదాయక రాకెట్లతో అంగారకగ్రహం మీదకు వెళ్లాంటే దాదాపు ఏడాది పడుతుంది. కానీ కేవలం 30 రోజుల్లోనే అంగారకుడి మీదకు చేరేందుకు వేగవంతమైన ఇంజెన్‌ను రష్యా శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. దీంతో, కనీసం నెల నుంచి రెండు నెలలోపే అంగారకుడిపై చేరుకోవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఇంజెన్ మరో ఆరేళ్లల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
రష్యాలోని అణు ఇంధన కార్పొరేషన్ కోసాటామ్ శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. ప్రత్యేక మాగ్నెటోప్లామా వ్యవస్థ ఆధారంగా నడిచే ఈ ఇంజెన్.. అణువులను సెకెనుకు 100 కిలోమీటర్ల వేగంతో వెదజల్లగలదు. ఫలితంగా ఉద్భవించే చోదక శక్తితో రాకెట్లు అసాధారణ వేగంతో పయనిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. గరిష్ఠంగా గంటకు 3.6 లక్షల కిలోమీటర్ల వేగం అందుకోవచ్చని చెబుతున్నారు (Russia High-Speed Plasma Rocket Engine).
ChatGPT 4.5: చాట్‌జీపీటీ కొత్త మోడల్‌ను ఆవిష్కరించిన ఓపెన్ ఏఐ.. ఫీచర్లు ఏంటంటే..
ఇంజెన్ పనితీరు ఇలా..
సాధారణ ఇంజెన్లు ఇంధనాన్ని మండించి రాకెట్‌ను ముందుకు తోసే చోదక శక్తిని ఉత్పత్తి చేస్తాయి. కానీ తాజాగా ఇంజెన్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా పనిచేస్తుంది. దీన్ని ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్ అని అంటారు. ఇది విద్యుత్ శక్తి, హైడ్రోజన్ పరమాణువల ఆధారంగా పనిచేస్తుంది. ఇంజెన్‌లో మొదట రెండు ఎలక్ట్రోడ్ల మధ్య అత్యంత శక్తిమంతమైన అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తారు. విద్యుదావేశం కలిగిన అణువులు ఈ అయాస్కాంత క్షేత్రంలోంచి పయనించేలా చేసినప్పుడు అవి అసాధారణ వేగంతో రాకెట్ బయటకు దూసుకొస్తాయి. ఫలితంగా జనించే చోదక శక్తి రాకెట్‌ను అంతే వేగంతో ముందుకు తోస్తుంది.
హైడ్రోజన్ అణువులను వినియోగించే విధంగా రూపకల్పన చేయడం వల్ల ఇంజెన్ సామర్థ్యం మరింత పెరిగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాంద్రత తక్కువగా ఉండే వీటిని అత్యధిక వేగంతో దూసుకుపోయేలా చేయొచ్చని చెప్పారు. ఇక విశ్వసంలో అత్యధికంగా లభ్యమయ్యే హైడ్రోజన్ కు కొరతే లేదని, మార్గమధ్యం ఎక్కడైనా సరే దీన్ని పొందొచ్చని శాస్త్రవేత్తలు వివరించారు. ఇంధనాన్ని మండించే శక్తిని సృష్టించే సంప్రదాయిక ఇంజెన్లతో గరిష్ఠంగా సెకెనుకు 4.5 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవచ్చని తెలిపారు. ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ వ్యవస్థకు ఇంత అనేక రెట్ల వేగాన్ని అందుకోవచ్చని వివరించారు.
ప్రస్తుతం తాము రూపొందించిన ప్రయోగాత్మక ఇంజెన్‌పై మరిన్న పరీక్షలు నిర్వహిస్తామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. రాకెట్‌లో వినియోగించేందుకు అనువైన పూర్తిస్థాయి మోడల్ మాత్రం 2023లో అందుబాటులోకి వస్తుందని అన్నారు. 300 కిలోవాట్ సామర్థ్యంతో పల్స్-పీరియోడిక్ మోడ్‌లో పనిచేసే ఇంజెన్ అంగాకరకుడి వరకూ ప్రయాణాలకు సరిపోతుందని వెల్లడించారు.
Read More Technology and Latest Telugu News