బడిలో విద్యార్థిని అనుమానాస్పద మృతి
ABN, Publish Date - Mar 11 , 2025 | 04:50 AM
అప్పటి వరకు హాస్టల్‌లోని తోటి విద్యార్థినులతో సరదాగా గడిపిన బాలిక.. కొద్ది సేపటికే విగత జీవిగా మారింది. రాత్రి భోజనం చేసిన అనంతరం నిద్రపోయిన ఆ విద్యార్థిని.. తెల్లారేసరికే అనంతలోకాలకు వెళ్లిపోయింది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని ఆశ్రమ పాఠశాలలో ఈ దారుణం జరిగింది.

రాత్రి భోజనం చేశాక నిద్ర.. తెల్లారేసరికే మృతి
ఇచ్చోడ గిరిజన ఆశ్రమ పాఠశాలలో విషాదం
ఇచ్చోడ/బోథ్, మార్చి, 10 (ఆంధ్రజ్యోతి) : అప్పటి వరకు హాస్టల్‌లోని తోటి విద్యార్థినులతో సరదాగా గడిపిన బాలిక.. కొద్ది సేపటికే విగత జీవిగా మారింది. రాత్రి భోజనం చేసిన అనంతరం నిద్రపోయిన ఆ విద్యార్థిని.. తెల్లారేసరికే అనంతలోకాలకు వెళ్లిపోయింది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని ఆశ్రమ పాఠశాలలో ఈ దారుణం జరిగింది. జిల్లాలోని బజార్‌హత్నూర్ మండలం మోర్కండి గ్రామానికి చెందిన లాలిత్య(14) ఇచ్చోడలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఆదివారం రాత్రి భోజనం చేసిన అనంతరం నిద్రపోయిన లాలిత్య.. సోమవారం ఉదయం ఎంతకూ లేవకపోవడంతో.. తోటి విద్యార్థినులు విషయాన్ని పాఠశాల సిబ్బందికి తెలియజేశారు. దీంతో ఉపాధ్యాయులు వచ్చి చూసేసరికి బాలిక అచేతనంగా ఉంది. వెంటనే పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, వైద్యులు బాలికను పరిశీలించారు. ఆమె చనిపోయిందని నిర్ధారించిన వైద్యులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోథ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. ఐటీడీఏ అధికారులు పాఠశాలలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.
దయనీయంగా ప్రభుత్వ హాస్టళ్లు : బోథ్ ఎమ్మెల్యే
బోథ్ నియోజకవర్గంలోని ప్రభుత్వ హాస్టళ్ల పరిస్థితి దయనీయంగా మారిందని ఎమ్మెల్యే జాదవ్ అనిల్ విమర్శించారు. హాస్టళ్లలో భోజనం, నీరు, మరుగుదొడ్లు తదితర వసతుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందన్నారు. బోథ్‌ఆస్పత్రిలో బాలిక మృతదేహాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం అనిల్ విలేకరులతో మాట్లాడారు. బాలిక తండ్రికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Mar 11 , 2025 | 04:50 AM