Share News

Rachakonda Crime News: వృద్ధురాలిని చంపేసి మృతదేహంపై గెంతులేసి

ABN , Publish Date - Apr 16 , 2025 | 05:08 AM

ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని హత్య చేసి, మృతదేహంపై గెంతుతూ నృత్యం చేసిన 17 ఏళ్ల బాలుడు వీడియో తీసి బెంగళూరులోని స్నేహితులకు షేర్‌ చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో కేసు బయటపడింది.

Rachakonda Crime News: వృద్ధురాలిని చంపేసి మృతదేహంపై గెంతులేసి

  • వీడియో తీసి బెంగళూరులోని మిత్రులకు షేర్‌

  • 17 ఏళ్ల బాలుడి పైశాచికానందం

  • బెంగళూరులో వీడియో వైరల్‌... అక్కడి పోలీసుల అప్రమత్తం

  • రాచకొండ పోలీసులకు సమాచారమివ్వడంతో ఘోరం వెలుగులోకి

ఏఎస్‌రావునగర్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): ఆ పదిహేడేళ్ల బాలుడిది ఎంతటి వికృత మనస్తత్వం? ఏమా పైశాచికానందం? ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిని చీరతో ఉరి బిగించి చంపేశాడు. చనిపోయిందని నిర్ధారించుకున్నాక ముఖంపై, మెడపై తన్నుతూ.. మృతదేహంపై గెంతులేశాడు. ఎగిరెగిరి దుంకుతూ నృత్యం చేశాడు. తన ఈ దుశ్చేష్టనంతా వీడియో తీసి.. బెంగళూరులో ఉన్న తన స్నేహితులకు షేర్‌ చేశాడు. ఈ మేరకు కుషాయిగూడ కృష్ణానగర్‌ కాలనీలో వృద్ధురాలు కమలమ్మ (70) దారుణ హత్యకు గరైన ఘటనలో తాజాగా వెలుగుచూసిన ఘోరమిది. స్థానికుల వివరాల ప్రకారం.. కృష్ణానగర్‌లో కమలమ్మ ఒంటరిగా భవనంలో నివాసం ఉంటోంది. ఆమెకు ఎవ్వరూ లేరు. ఆ భవనంలోని రెండు షెటర్లను విద్యుదుపకరణాల దుకాణం కోసం కొన్నేళ్ల క్రితం రాజస్థాన్‌కు చెందిన ప్రకాశ్‌ చౌదరి, లలిత్‌ చౌదరికి ఆమె అద్దెకిచ్చింది. ఆ షాపులో రాజస్థాన్‌కే చెందిన 17 ఏళ్ల బాలుడు గత ఎనిమిది నెలలుగా పనిచేస్తున్నాడు. ఆ దుకాణం నిర్వహణ విషయంలో కమలమ్మ తరచూ ఆ బాలుడిని మందలిస్తోంది. అతడి తీరుపై చిర్రుబుర్రులాడుతోంది. అతడు కనిపించినప్పుడల్లా కసురుకుంటోంది. వృద్ధురాలి తీరుతో ఆమెపై కక్ష పెంచుకున్న బాలుడు, శుక్రవారం రాత్రి ఇంట్లోకి చొరబడి కమలమ్మ మెడకు చీరతో బిగించి చంపేశాడు.


అప్పటికీ కోపం చల్లారని బాలుడు, మృతదేహంపై ఎగిరి దుంకుతూ.. మెడపై తొక్కుతూ నృత్యం చేశాడు. దీన్నంతా వీడియోగా చిత్రీకరించి.. ఇదిగో చూడండంటూ బెంగళూరులోని స్నేహితులకు వాట్సా్‌పలో పంపాడు. అక్కడ ఆ వీడియో వైరల్‌గా మారడంతో బెంగళూరు పోలీసులు ఆరా తీశారు. హైదరాబాద్‌లో ఈ దారుణం జరిగినట్లు గుర్తించి రాచకొండ పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు రంగంలోకి దిగడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం కుళ్లిన స్థితిలో వృద్ధురాలి మృతదేహాన్ని కనుగొంటే.. తాజాగా 17 ఏళ్ల బాలుడు ఘోరానికి పాల్పడ్డ వీడియో బయటపడింది. కమలమ్మ ఒంటరి మహిళ కావడం, సంతానం లేకపోవడంతో ఆస్థికోసం ఎవరైనా ఈ దారుణాన్ని చేయించారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 16 , 2025 | 05:08 AM