Share News

నీడ కోసం నిరీక్షణ

ABN , Publish Date - Apr 05 , 2025 | 11:38 PM

రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుండటంతో ఎండ వేడిమికి ప్రజలు తట్టుకోలేక అల్లాడుతున్నారు. ఏప్రిల్‌లోనే భానుడు ఉగ్రరూపం దాలుస్తుండటంతో వివిధ గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.

నీడ కోసం నిరీక్షణ

- బస్‌ షెల్లర్లు లేక అవస్థలు

- మండుటెండలో ప్రయాణికుల పడిగాపులు

- తాగునీటికి దిక్కే లేదు

- తాత్కాలిక ఏర్పాట్లయినా చేయాలంటున్న ప్రజలు

బెజ్జూరు, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుండటంతో ఎండ వేడిమికి ప్రజలు తట్టుకోలేక అల్లాడుతున్నారు. ఏప్రిల్‌లోనే భానుడు ఉగ్రరూపం దాలుస్తుండటంతో వివిధ గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఎండ తీవ్రతతో పాటు వడగాలుల ఇబ్బందులు పెడుతున్నాయి. మరోవైపు ప్రయాణికులు మండే ఎండలోనే బస్సుల కోసం నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని పలు మండలాల్లో బస్సు షెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రకరకాల చార్జీల పేరుతో ప్రయాణికుల నుంచి ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్న ఆర్టీసీ సౌకర్యాల కల్పనపై మాత్రం దృష్టి సారించకపోవడంపై పలు విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో పదిహేను మండలాలుండగా కేవలం ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌, కౌటాల మండలాల్లో బస్టాండ్‌లు ఉండగా, మిగితా మండలాల్లో కొన్నిచోట్ల కేవలం షెల్టర్లు మాత్రమే ఉన్నాయి. బెజ్జూరు, చింతలమానేపల్లి, సిర్పూర్‌(టి), దహెగాం, రెబ్బెన, కెరమెరి, తిర్యాణి వంటి మండలాల్లో బస్టాండ్‌లు లేని కారణంగా వివిధ గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు తిప్పలు పడుతున్నారు. పెంచికలపేటలో చిన్న షెల్టర్‌ మాత్రమే ఉంది. ప్రయాణికులకు నిలువ నీడ లేకపోవడంతో ఎండలోనే నిలవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. బస్సుల కోసం గంటల తరబడి రోడ్లపై, కిరాణ దుకాణాల ఎదుట, చెట్ల కింద వేచి చూడాల్సిన దుస్థితి ఉంది. ప్రస్తుతం ఎండలు దంచి కొడుతుండటంతో ప్రయాణికులు ఎండలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మండలకేంద్రాల్లో ఆర్టీసీ అధికారులు కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో ప్రయాణికులు మండిపడుతున్నారు.

అధికారుల పట్టింపేదీ?

జిల్లాలోని పలు మండలాల్లో బస్టాండ్‌లు లేని కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఆర్టీసీ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. మండలాల్లో నుంచి నిత్యం వివిధ పనుల నిమిత్తం కాగజ్‌నగర్‌కు, కార్యాలయాల పనుల కోసం జిల్లా కేంద్రానికి వెళ్తుంటారు. ఈ క్రమంలో చంటి పిల్లలతో కుటుంబసభ్యులు ఎండలోనే వేచి చూడాల్సిన పరిస్థిఽతులు ఉన్నాయి. గతంలో కొన్ని చోట్ల బస్టాండ్‌ల నిర్మాణం కోసం పాలకులు భూమి పూజ చేసినప్పటికి ఇప్పటికీ పనులు ప్రారంభించ లేదు. రోడ్లపై నిల్చొని ఉన్నా కనీసం తాగడానికి మంచి నీరు సైతం దొరకని పరిస్థితి తలెత్తుతోంది. వర్షాకాలంలో వర్షాలకు తడుచుకుంటూ, చలికాలంలో చలికి వణుకుతున్నారు. జిల్లాలో వివాహాల సీజన్‌లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో వివాహాలకు వెళ్లేందుకు ప్రయాణికులు ఇతర గ్రామాలకు వెళ్తున్న క్రమంలో ఎలాంటి సౌకర్యాలు లేక చంటి పిల్లల తల్లులు అనేక అవస్థలు పడుతున్నారు. గ్రామాల్లో నిలువ నీడలేక ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు.

ఎన్నాళ్లీ దుస్థితి?

మారుమూల గ్రామాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా ఆర్టీసీ ఆచరణలో మాత్రం అమలు చేయడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ఆర్టీసీ ద్వారా ప్రభుత్వానికి కోట్ల ఆదాయం సమకూరుతున్నా సౌకర్యాల కల్పనపై శ్రద్ధచూపడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో ప్రయాణికుల రద్దీ మరింత పెరిగింది. దీనికి తోడు మండలాల్లో ప్రయాణికులకు ఎలాంటి సదుపాయాలు లేక మండుటెండలోనే ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

జిల్లాలో ఇదీ పరిస్థితి...:

జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాలు లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. జిల్లాలో చివరి ప్రాంతంలో ఉన్న బెజ్జూరు, చింతలమానేపల్లి, తిర్యాణి, సిర్పూర్‌(యు), లింగాపూర్‌, జైనూర్‌ తదితర ప్రాంతాల్లోని ప్రజలు ప్రతినిత్యం వందల సంఖ్యలో వివిధ పనులు, ఆసుపత్రులు, సామగ్రి కొనుగోలు కోసం ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌, మంచిర్యాల, కరీంనగర్‌ వంటి పట్టణాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో బస్టాండ్లు లేక ఎండలోనే చంటి పిల్లలతో ప్రయాణికులు గంటల తరబడి బస్సు వచ్చే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడి నుంచి ప్రతి రోజు పదుల సంఖ్యలో బస్సులు వచ్చి వెళ్తుంటాయి. ఆయా ప్రాంతాల్లో ఉండటానికి నీడ లేక, తాగునీరు, మూత్రశాలలు వంటి సదుపాయాలు లేక అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా మహిళల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. వారు కాలకృత్యాలకు ఎటు వెళ్లాలో తెలియక సతమతమవుతున్నారు. వేసవి కావడంతో ఎండవేడిమికి ప్రయాణికులు మరింత ఇబ్బందులకు గురవుతున్నారు. బెజ్జూరు, సిర్పూర్‌(టి), చింతలమానేపల్లి, రెబ్బెన, వాంకిడి, కెరమెరి, జైనూర్‌, తిర్యాణి వంటి మండలాల్లో బస్సుల కోసం ప్రయాణికులు రోడ్లపైనే వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. సీర్పూర్‌(టి)లో బస్టాండ్‌ స్థలంలో రూ.20లక్షలతో ఇటీవల ప్రహరీ నిర్మించారు. అది కూడా అసంపూర్తిగానే ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఎవరు పట్టించుకోవడం లేదు...

- చాకటి రవికుమార్‌, బెజ్జూరు

బస్టాండ్‌లో నీడ లేకప్రాణం పోతోంది. చెట్ల కింద నిల్చొని కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నాం. మాలాంటి వారికి చిన్న పిల్లల కోసమన్నా కూర్చోడానికి ఏర్పాట్లు చేయాలి. తాగు నీరు అందుబాటులో ఉంచాలి. ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు.

బస్టాండ్‌ నిర్మించాలి..

- రియాజ్‌అలీ, బెజ్జూరు

ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మండల కేంద్రాల్లో బస్టాండ్‌లు ఏర్పాటు చేయాలి. ఎండ వేడిమి కారణంగా బయట ఉండలేకపోతున్నాం. అధికారులు స్పందించి బస్టాండ్‌ ఏర్పాటు చేయాలి. మండల కేంద్రాల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేని కారణంగా మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Updated Date - Apr 05 , 2025 | 11:38 PM