Share News

Youthful Skin: దాచాలంటే దాగునులే

ABN , Publish Date - Apr 07 , 2025 | 04:41 AM

మనిషి ఎన్ని సాధించినా తప్పించుకోలేనివి జర ముసలితనం, మరణం.. అని చాలా మంది ఆధ్యాత్మికవేత్తలు చెబుతుంటారు! రోగం, జర, మరణం ప్రతి ప్రాణికీ తప్పవని తెలుసుకున్నాకే రాజకుమారుడైన సిద్ధార్థుడు తపస్సు చేసి బుద్ధుడయ్యాడు కానీ అదంతా గతం.

Youthful Skin: దాచాలంటే దాగునులే

వయసు కనపడనివ్వకుండా చేసే మార్గాలెన్నో!

  • యాంటీ ఏజింగ్‌ క్రీముల నుంచి.. లేజర్‌, కణజాల చికిత్సల వరకూ అందుబాటులో..

  • 3 పదుల వయసు దాటిన మహిళల్లో చాలా మంది చూపు ఆయా చికిత్సల వైపు!

  • మగవారిలో ఎక్కువగా హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌, బొటాక్స్‌ చికిత్సలు!

  • రూ.వేల కోట్ల వ్యాపారంగా యాంటీ ఏజింగ్‌ రంగం

  • అర్హత లేనివారితో ఈ చికిత్సలు చేయించుకుంటే

  • కష్టాలు కోరితెచ్చుకున్నట్టే.. ప్లాస్టిక్‌ సర్జన్ల హెచ్చరిక

ఆమె ఓ పేజ్‌ 3 సెలబ్రిటీ. ఇటీవలే మనవరాలికి ఓణీల ఫంక్షన్‌ చేసింది. అప్పటిదాకా చాలా మందికి ఆమె వయసు హాఫ్‌ సెంచరీ దాటిందని తెలియదంటే ఆశ్చర్యమే! ఎందుకంటే ఆమె ముఖంలో చూద్దామన్నా వార్ధక్యపు ఛాయలు కనపడవు. అలా కనపడకుండా ఉండడానికి ఆమె ఏం మాయ చేస్తోంది?

(ఆంధ్రజ్యోతి-హైదరాబాద్‌ సిటీ): మనిషి ఎన్ని సాధించినా తప్పించుకోలేనివి జర (ముసలితనం), మరణం.. అని చాలా మంది ఆధ్యాత్మికవేత్తలు చెబుతుంటారు! రోగం, జర, మరణం ప్రతి ప్రాణికీ తప్పవని తెలుసుకున్నాకే రాజకుమారుడైన సిద్ధార్థుడు తపస్సు చేసి బుద్ధుడయ్యాడు!! కానీ అదంతా గతం. మృత్యువు సంగతి పక్కన పెడితే.. ముసలితనాన్ని కనీసం కొన్నాళ్లపాటయినా జయించి, యవ్వనంగా కనిపించేలా చేసే పరిజ్ఞానాలు ఇప్పుడు చాలానే అందుబాటులోకి వచ్చాయి. ఎప్పటికీ యవ్వనంగాకనిపించాలనుకునేవారి సంఖ్య కూడా ఎక్కువైంది. ఒకప్పుడు సినీ తారలకు మాత్రమే పరిమితమైన యాంటీ ఏజింగ్‌ చికిత్సలు ఇప్పుడు సామాన్యులకూ చేరువయ్యాయి. డబ్బు ఎక్కువగా ఉన్నవారు.. కాస్తంత ఖరీదైనా సరే వినూత్నమైన పరిష్కారాల వైపు చూస్తున్నారు. యాంటీ ఏజింగ్‌ చికిత్సల కోసం కొందరు సరాసరిన నెలకు 10-15 వేల రూపాయలను ఖర్చు చేస్తోంటే, కొంతమంది 50-90 వేల రూపాయలను కూడా ఖర్చు చేస్తున్నారు.

12.jpg


దీంతో యాంటీ ఏజింగ్‌ చికిత్సల వ్యాపారం బాగా జోరందుకుంది. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ చర్మం సాగడంతోపాటు తేమ కోల్పోతుంది. ఫలితంగా ముడతలు, గీతలు, బుగ్గలు లోపలకు చొచ్చుకుపోవడం.. వంటి మార్పులు సంభవిస్తాయి. జుట్టు తెల్లబడడం, ఊడిపోవడం సరేసరి. జన్యుపరమైన కారణాలు, జీవనశైలి మార్పులు, రోజువారీ జీవితంలో మనం వాడే వస్తువుల్లో ఉండే రసాయనాల వల్ల వయసు మీరే ప్రక్రియ కొందరిలో మరికొంత వేగంగా జరుగుతుంది. అలాంటివారంతా యాంటీ ఏజింగ్‌ చికిత్సలపై ఆసక్తి చూపుతున్నారని అంబ్రోసియా క్లినిక్‌ వ్యవస్థాపకురాలు, ప్రముఖ ప్లాస్టిక్‌ సర్జన్‌ ప్రీతి శుక్లా తెలిపారు. క్లినిక్‌లకు వెళ్లి చేయించుకునే పెద్ద పెద్ద చికిత్సల సంగతి పక్కనపెడితే ప్రస్తుతం అందరూ ఎక్కువగా వాడుతున్నవి.. యాంటీ ఏజింగ్‌ క్రీములు. సూర్యుడి అతినీలలోహిత (యూవీ) కిరణాల బారిన పడకుండా చర్మాన్ని కాపాడే ఈ క్రీముల వల్ల.. ముడతలు పడటం, నుదుటిపై గీతలు రావడం వంటి సమస్యలను కొంతమేరకు నివారించవచ్చు. అయితే, ఇలాంటి క్రీమ్‌లతో ఫలితాలు పరిమితమేనని.. చాలా మంది కాస్మెటాలజిస్టులు, డెర్మటాలజిస్టులు, ప్లాస్టిక్‌ సర్జన్లు చెబుతున్నారు.


ఎందుకంటే.. అందరికీ అనువుగా ఉండేలా వాటిని అతి తక్కువ గాఢతతో చేస్తారని, సాధారణ చర్మం కలిగినవారికి మాత్రం వాటితో కొంత ఫలితం ఉంటుంది తప్ప అందరికీ ఒకే స్థాయిలో ఉండదని వారు వివరిస్తున్నారు. ఇక.. ప్రస్తుతం భారతీయ యాంటీ ఏజింగ్‌ మార్కెట్‌లో ఎక్కువగా వినిపిస్తున్న మాట.. ‘బయో రీ మోడలింగ్‌’. దీనిలో భాగంగా చర్మానికి తేమ అందించడంతో పాటు కొలాజెన్‌ ఉత్పత్తి అయ్యేలా చర్మాన్ని ప్రేరేపిస్తారు. చర్మంలో సాగే గుణాన్ని పెంపొందింపజేస్తారు. చికిత్సలేవైనా సరే, ఎంత చెప్పినా సరే ఒత్తిళ్లతో కూడిన ఉద్యోగాలు చేసేవారికి వాటితో మెరుగైనఫలితాలు రావడం కష్టమేనని హెయిర్‌లైన్‌ స్టూడియో అఽధినేత, సెలబ్రిటీ స్టైలిస్ట్‌ వంశీ అభిప్రాయపడ్డారు. వేళకు పౌష్టికాహారం తీసుకుంటూ, కంటి నిండా నిద్రపోతూ, నిత్య వ్యాయామాలు చేసేవారికి ఈ చికిత్సలు బాగా ఉపకరిస్తాయని ఆయన పేర్కొన్నారు. ‘‘సహజంగా వచ్చేదే అందం, అది తెలుసుకుంటేనే ఆనందం’’ అంటారాయన.


బోలెడన్ని చికిత్సలు..

వయసు మీద పడుతున్నా యవ్వనంగా కనిపించేలా చేయడానికి అనేక రకాల చికిత్సలున్నాయి. ప్రాథమికంగా యాంటీ ఏజింగ్‌ క్రీములు మొదలు.. కణజాల స్థాయిలో చర్మం పై ప్రభావం చూపే ఫేషియల్‌ సీరమ్‌లు, మాయిశ్చరైజర్ల దాకా పలు ఉత్పత్తులు, ప్రక్రియలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి..

బొటాక్స్‌: ముఖంపై ముడతలను పోగొట్టడానికి ఇచ్చే ఒక న్యూరో టాక్సిన్‌ ప్రొటీన్‌ ఇది. దీనిని బ్యాక్టీరియం క్లోస్ట్రిడియం బొటులినమ్‌ అనే బ్యాక్టీరియా ఉత్సత్తి చేస్తుంది. దీనిని మన కండరాల్లోకి చొప్పిస్తే ఆ కండరాలు పనిచేయడం మానేస్తాయి. దీనివల్ల చర్మంపై గీతలు తగ్గుతాయి. ముడతలు పోతాయి. చర్మం మృదువుగా కనిపిస్తుంది. వయసు తక్కువగా అనిపిస్తుంది. అయితే.. ఈ ఇంజెక్షన్‌ సరిగ్గా చేయకపోయినా, అది సరైన కండరాల్లోకి వెళ్లకపోయినా ఫలితాలు చాలా ఇబ్బందిగా ఉంటాయి. సంవత్సరానికి 2-3 మూడు ఇంజెక్షన్లు చేయాల్సి ఉంటుంది. ఒక్కో సెషన్‌కూ 15-20 వేల రూపాయల వరకూ ఖర్చవుతుంది.

ఫిల్లర్లు: ఫిల్లర్స్‌లో హైల్యూరానిక్‌ యాసిడ్‌ ఉంటుంది. కళ్ల కింద గుంతలు, నవ్వినప్పుడు వచ్చే గీతలను పూరించడానికి వాడతారు. దీని ఖర్చు 20-40 వేల రూపాయల వరకూ ఉంటుంది. ఫిల్లర్‌ నాణ్యత, డాక్టర్‌ అర్హతలను బట్టి కూడా ఈ ఖర్చు మారుతుంటుంది.

కెమికల్‌ పీల్‌: ఈ పద్ధతిలో కెమికల్‌ సొల్యూషన్‌ను చర్మం లోపలకు జొప్పిస్తారు. తద్వారా చర్మం పై పొర తొలగిస్తారు. కొత్తగా వచ్చే చర్మం కాంతివంతంగా ఉంటుంది. ఈ యాంటీ ఏజింగ్‌ చికిత్స ఖర్చు ఒక్క సిటింగ్‌కు రూ.3 వేల నుంచి రూ.5 వేల దాకా ఉంటుంది.

ఫోటోఫేషియల్‌: ఇది కాంతి ఆధారిత చికిత్స. కొల్లాజెన్‌ ఉత్పత్తి మెరుగుపరచడానికి, వయసు ప్రభావం తగ్గించడానికి వినియోగిస్తారు. చర్మం మృదువుగా మారేందుకు, పునరుత్తేజం కావడానికి ఈ చికిత్స తోడ్పడుతుంది. దీనిలోనూ రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఎల్‌ఈడీ అయితే మరోటి ఇంటెన్స్‌ పల్స్‌డ్‌ లైట్‌ (ఐపీఎల్‌) థెరపీ. వీటికి ఒక్కో సెషన్‌కూ రూ.2 వేల నుంచి రూ.5 వేల దాకా వసూలు చేస్తున్నారు.

ప్లేట్‌లెట్‌ రిచ్‌ ప్లాస్మా థెరపీ: చర్మంపై ముడతలు, గీతలు పొగొట్టటానికి వాడుతున్నారు. దీని ఖర్చు సెషన్‌కు రూ.5 వేల నుంచి 12 వేల రూపాయల దాకా ఉంటుంది.

లేజర్‌ చికిత్సలు: వీటిని బ్లాక్‌ ప్యాచెస్‌ వంటి వాటి నిర్మూలన కోసం వాడుతుంటారు. సెషన్‌కు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకూ ఉండవచ్చు. పిగ్మెంట్‌ సంబంధిత చికిత్సలకైతే ఆరు సెషన్‌లు ఉంటాయి. ఈ లేజర్‌లో విభిన్న రకాలు ఉంటాయి. రకాన్ని బట్టి ఖర్చు కూడా మారుతుంటుంది. వీటిలో క్యు స్విచ్‌ లేజర్‌, ఫ్రాక్షనల్‌ లేజర్‌ వంటివి ఎక్కువగా వాడుతున్నారు.

స్కిన్‌ బూస్టింగ్‌ ఇంజెక్షన్స్‌: చర్మాన్ని యవ్వనంతో మెరిసిపోయేలా చేయడానికి ఈ చికిత్స చేస్తారు. వీటిలో పెప్టైడ్స్‌, ఎక్పోజోమ్స్‌, హైల్యూరానిక్‌ యాసిడ్స్‌ ఇలా చాలా ఉన్నాయి. ఈ ఇంజెక్షన్లన్నీ రూ.15-20 వేల ధరలో ఉంటాయి. చర్మ స్థితి, ఆరోగ్య పరిస్థితి, తదితర అంశాల ఆధారంగా ఎన్ని ఇంజెక్షన్లు ఇవ్వాలన్నదీ వైద్యులు నిర్ణయిస్తారు. వాహనాలకు సర్వీసింగ్‌ లాగా.. ఈ తరహా చికిత్సలను క్రమం తప్పకుండా చేయించుకోవాల్సి ఉంటుంది.

హెయిర్‌ గ్రోత్‌ ట్రీట్‌మెంట్‌: యాంటీ ఏజింగ్‌ చికిత్సల్లో జుట్టు కూడా ఒక భాగమే. ఇంకా చెప్పాలంటే.. జుట్టు ఒక ప్రధాన భాగం. అది బాగా పెరిగేందుకు చేసే ఈ చికిత్స ఒక్కో సెషన్‌కూ 15-20 వేల రూపాయల ఖర్చవుతుంది.

హైఫూ (హై ఇంటెన్సిటీ ఫోకస్డ్‌ అలా్ట్రసౌండ్‌): ఇది.. కొలాజెన్‌ ఉత్పత్తిని ప్రేరేపించడం ద్వారా ముఖచర్మాన్ని బిగుతుగా చేసే నాన్‌ సర్జికల్‌ ఫేస్‌ లిఫ్ట్‌ ట్రీట్‌మెంట్‌. దీన్ని మూడు నెలలకోమారు చేయించుకుంటే మెరుగైన ఫలితాలు వస్తాయి. ఖర్చు రూ.30-40 వేలు అవుతుంది.

థ్రెడ్‌ లిఫ్ట్‌: ఇది కూడా.. సాగే చర్మాన్ని బిగుతుగా చేసే ఒక తరహా నాన్‌ సర్జికల్‌ కాస్మెటిక్‌ చికిత్స. ఈ చికిత్సలో భాగంగా.. కరిగిపోయే గుణం కలిగిన మెడికల్‌ గ్రేడ్‌ దారాలను వాడతారు. ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ చికిత్సకు.. రూ.70 వేల నుంచి రూ.లక్ష దాకా ఖర్చవుతుంది. రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ చికిత్స చేయాల్సి ఉంటుంది. మధుమేహం తదితర సమస్యలు ఉన్న వారికి అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

బ్లెఫరో ప్లాస్టీ: కనురెప్పల లోపాలను సరిచేసి, అందంగా కనిపించేలా చేసే శస్త్రచికిత్స. రూ.40 వేల నుంచి రూ. లక్ష దాకా ఖర్చవుతుంది.

ఫేస్‌ లిఫ్ట్‌: ముఖచర్మాన్ని బిగుతుగా చేసే శస్త్రచికిత్స. ఈ పద్ధతిలో ముఖం, మెడ సరిచేయడానికి రూ.5-6 లక్షల దాకా ఖర్చవుతుంది.


నల్లగా ఉన్న వారు తెల్లగా మారడానికి..

స్కిన్‌ లైటెనింగ్‌కి.. అంటే నల్లగా ఉన్న వారు తెల్లగా కావడానికి గ్లూటాథియోన్‌ అనే చికిత్స అందుబాటులోకి వచ్చింది. నిజానికి గ్లూటాథియోన్‌ అనేది శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే యాంటాక్సిడెంట్‌. శరీరంలో మెలనిన్‌ ఉత్పత్తిని తగ్గించడం ద్వారా చర్మాన్ని తెల్లబరచడానికి దీన్ని ఇప్పుడు ఇంజెక్షన్ల రూపంలో ఇస్తున్నారు. అయితే, ఇది ఎలా పడితే అలా చేసే చికిత్స కాదు. వ్యక్తి ఆరోగ్య పరిస్థితి, అవసరాలను బట్టి ఎంత మోతాదులో దానిని అందించాలన్నది డాక్టర్‌ నిర్ణయిస్తారు. ఇష్టం వచ్చినట్లు చేస్తే అది ప్రమాదానికి కారణమవుతుంది. ఈ చికిత్స 10-15 సిట్టింగ్స్‌ తీసుకుంటే ఫలితాలు ఉంటాయి. ఒక్కో సిటింగ్‌కూ రూ.10 వేల దాకా ఖర్చవుతుంది.

బాలీవుడ్‌లో 50 ఏళ్లు దాటిన ఓ కండల వీరుడు. తన వయసులో సగమున్న కథానాయికతో కలిసి నటించడంపై విమర్శలువస్తే.. ‘‘ఆమెతో మాత్రమే కాదు, ఆమెకు పుట్టబోయే అమ్మాయితో కూడా నటిస్తాను. మీకేంటి బాధ?’’ అని ఎదురు ప్రశ్నించాడు. ఐదుపదుల వయసు దాటినా అతడిలో వార్ధక్యపు ఛాయలు అంతగా కనబడవు. ముప్పై ఏళ్లకే తెల్ల వెంట్రుకలు రావడం మొదలై.. నాలుగు పదుల వయసుకు ముఖం మీద చర్మం బిగుతును కోల్పోయి.. 50 ఏళ్లకే ముసలివారిలా కనిపించే సామాన్యులకు, అతడికి తేడా ఏంటి?

12.jpg

..ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఇటీవలికాలంలో చాలా మంది సెలబ్రిటీలను చూస్తే వయసు అస్సలు తెలియట్లేదు. అరవై, డెబ్బై ఏళ్లొచ్చిన హీరోలు సైతం 40-50ల్లో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. ‘మమ్మీ..’ అంటూ పిల్లలు ఆలింగనం చేసుకునే వరకూ తెలియనంత అందంతో మెరిసిపోతున్న అమ్మలకు ఇప్పుడు కొదవే లేదు. దీనికి కారణం.. ఇటీవలికాలంలో బాగా అందుబాటులోకి వచ్చిన యాంటీ ఏజింగ్‌ చికిత్సలే.


పిల్లలు పుట్టాక..

ఆడవారిలో ఎక్కువ మంది ప్రెగ్నెన్సీ తరువాత బాడీ షేపింగ్‌ చికిత్సలు చేయించుకుంటున్నట్టు వైద్యులు చెబుతున్నారు. పిల్లలు పుట్టాక.. రొమ్ములు జారడం, ఆకృతి మారడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నవారు, వాటిని సరిచేసుకోవడానికి చికిత్స చేయించుకుంటున్నారు. బ్రెస్ట్‌ ఫ్యాట్‌ ట్రాన్స్‌ఫర్‌, బ్రెస్ట్‌ లిఫ్ట్‌, బ్రెస్ట్‌ రిడక్షన్‌ లాంటివి వీటిలో ఉంటాయి. ప్రసవం అయిన తరువాత కూడా పొట్టభాగం పెద్దగా కనబడే వారు.. అబ్డామినో ప్లాస్టీ, టమ్మీ టక్‌ ట్రీట్‌మెంట్‌ చికిత్సలు చేయించుకుంటున్నారు. స్ట్రెచ్‌ మార్క్స్‌ (గర్భం దాల్చిన తరువాత పొట్ట దగ్గర వచ్చే చారలు) తొలగించుకోవడానికి కూడా చాలా మంది వైద్యులను సంప్రదిస్తున్నారు. వీటికి అయ్యే ఖర్చు దాదాపు రూ.50-60 వేల వరకూ ఉండవచ్చు.

ముందుగా ప్రారంభిస్తే ఫలితాలు మెరుగ్గా..

చర్మం ముడతలు పడటం, చర్మం వదులుగా మారడం, నుదుటిపై గీతల వంటి సమస్యలకు.. బొటాక్స్‌. ఫిల్లర్లు, థ్రెడ్‌ లిఫ్ట్‌, సర్జరీ వంటి చికిత్సలు చేస్తాం. ఇప్పుడు రీజనరేటివ్‌ మెడిసిన్‌ కూడా అందుబాటులోకి వచ్చింది. ఏ చికిత్స అయినా 30-40లలో ప్రారంభిస్తేనే కోరుకున్న ఫలితాలు వస్తాయి. అర్హులైన, నైపుణ్యం కలిగిన పాస్టిక్‌సర్జన్లు, డెర్మటాలజిస్టులను సంప్రదించి, నాణ్యమైన ఉత్పత్తులు వాడితే ఎలాంటి సమస్యలూ రావు. కానీ.. అర్హతలు లేనివారు ఇటీవలికాలంలో ఈ చికిత్సలను అందిస్తుండటం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

- డాక్టర్‌ ప్రీతి శుక్లా ప్లాస్టిక్‌ సర్జన్‌, ఫౌండర్‌, అంబ్రోసియా క్లినిక్‌

అర్హులా? కాదా? చూసుకోవాలి

యాంటీ ఏజింగ్‌ చికిత్సలు మూడు రకాలు. అవి.. పీల్స్‌, ఇంజెక్టబుల్స్‌, ఎనర్జీ బేస్డ్‌ డివైజెస్‌. మృతకణాలు, పిగ్మంటేషన్‌ వంటివాటిని తొలగించడానికి పీల్స్‌ వాడతాం. రెండో రకం... బొటాక్స్‌, ఫిల్లర్ల వంటి ఇంజెక్టబుల్స్‌. ఎనర్జీ బేస్డ్‌ డివైజస్‌ అంటే.. లేజర్లు, రేడియో ఫ్రీక్వెన్సీ డివైజ్‌లు, హైఫూ వంటివి. చర్మంలో కొలాజెన్‌ను పెంచడానికి, సాగే గుణం మెరుగుపరచడానికి వీటిని వాడతాం. ఈ చికిత్సలన్నీ అర్హత కలిగిన వ్యక్తుల చేత మాత్రమే చేయించుకోవాలి. లేదంటే అంతర్గత కండరాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

- డాక్టర్‌ సింఽధూర కంభంపాటి సీనియర్‌ కన్సల్టెంట్‌ డెర్మటాలజిస్ట్‌, స్టార్‌ హాస్పిటల్‌

మగవారికీ కొన్ని..

మగవారు ఎక్కువగా.. ముక్కు సరిచేసుకునే శస్త్రచికిత్సతో పాటు, హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఎక్కువగా చేయించుకుంటున్నట్టు వైద్యులు చెబుతున్నారు. అలాగే లైపోసక్షన్‌ (అధికంగా ఉన్న కొవ్వు తీసివేయడం), గైనకోమాస్టియా (మగవారిలో పెరిగిన రొమ్ము పరిమాణాన్ని తగ్గించే శస్త్ర చికిత్స) కూడా ఎక్కువగా చేయించుకుంటున్నారు.

13.jpg


ఈ వార్తలు కూడా చదవండి..

HCU Land: హెచ్‌సీయూ వివాదంలో నిజాలు ప్రచారం చేయండి

No Exam: ఈ అర్హత చాలు.. పరీక్ష లేకుండా ఉద్యోగం.. నెలకు రూ. 2 లక్షల జీతం

Water Conflict: నీటి పంచాయతీ.. అధికారులతో ఉత్తమ్ కీలక భేటీ

Healthy Soup: ఈ సూప్‌తో మీ శరీరంలో కొన్ని భాగాలకు ఊహించని శక్తి పక్కా

Cotton Clothing: కాటన్ దుస్తులు.. ఒరిజినలా? కాదా? ఎలా గుర్తించాలంటే..

Fake Cardiologist: ఏడుగురి ఉసురు తీసిన వైద్యుడు.. విచారణకు రంగం సిద్ధం

శ్రీలీలకి చేదు అనుభవం.. చెయ్యి పట్టుకుని లాగిన యువకులు

కేసు No.62.. సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్ పై విచారణ

For Telangana News And Telugu News

Updated Date - Apr 07 , 2025 | 04:41 AM