Share News

Bhatti Vikramarka: కార్పొరేషన్ల రుణాలను పునర్వ్యవస్థీకరించండి

ABN , Publish Date - Feb 09 , 2025 | 04:20 AM

రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్ల కోసం స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌(ఎస్పీవీ) కింద తీసుకున్న రుణాలను పునర్వ్యవస్థీకరించాలని(రీస్ట్రక్చరింగ్‌) డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్తు శాఖల మంత్రి భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు.

Bhatti Vikramarka: కార్పొరేషన్ల రుణాలను పునర్వ్యవస్థీకరించండి

  • కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి

హైదరాబాద్‌, న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్ల కోసం స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌(ఎస్పీవీ) కింద తీసుకున్న రుణాలను పునర్వ్యవస్థీకరించాలని(రీస్ట్రక్చరింగ్‌) డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్తు శాఖల మంత్రి భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఢిల్లీలో ఆమెను కలిసి వినతిపత్రం ఇచ్చారు. గత ప్రభు త్వం 2014 నుంచి 2023 వరకు సాగు, తాగు నీటి కోసం కార్పొరేషన్లను ఏర్పాటు చేసి ఎస్పీవీల కింద రుణాలు తీసుకుందని తెలిపారు.


ఇలాంటివాటికి అసలు, వడ్డీని ప్రభుత్వ బడ్జెట్‌ నుంచి చెల్లిస్తున్నట్టు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ల నుంచి 10.75శాతం, 11.25శాతం వడ్డీ రేట్లతో రూ.31,795 కోట్ల రుణం తీసుకున్నారని, ఇతర కార్పొరేషన్ల కోసం అధిక వడ్డీలతో రుణాలుతెచ్చారని తెలిపారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఈ అప్పులు పెద్ద గుదిబండగా పరిణమించాయన్నారు. ఈ దృష్ట్యా వడ్డీ రేట్లను తగ్గించడం, దీర్ఘకాలిక రుణాలుగా మార్చడంవంటి రీస్ట్రక్చరింగ్‌ చర్యలు చేపట్టాలని, దీనికి సంబంధించి రుణ వితరణ సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు.

  • ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్‌ 94(2)ప్రకారం రాష్ట్రంలోని 9 వెనుకబడిన ఉమ్మడి జిల్లాలకు ఏటా రూ.450 కోట్ల చొప్పున నిధులు విడుదల చేయాల్సి ఉందని భట్టి తెలిపారు. 2019-20, 2021-22, 2022-23, 2023-24 సంవత్సరాలకు సంబంధించి మొత్తం రూ.1,800 కోట్లు విడుదల చేయాలని కోరారు.

  • ఏపీబీఏసీడబ్ల్యూడబ్ల్యూబీ నుంచి రూ.455.76 కోట్లు, ఏపీ సంక్షేమ నిధి నుంచి రూ.9.15 కోట్లు రావాల్సి ఉందని, వీటిని ఇప్పించాలని కోరారు.

  • రాష్ట్ర విభజన సందర్భంలో ఏపీ ప్రభుత్వం తెలంగాణ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు అదనంగా రూ.1,052.70 కోట్ల అప్పును కేటాయించిందని, అదనపు కేటాయింపుల కారణంగా తెలంగాణ అసలు కింద రూ.481.82 కోట్లు, వడ్డీ కింద రూ.788.18 కోట్లు (మొత్తం రూ.1,270 కోట్లు) చెల్లించాల్సి వచ్చింద న్నారు. ఈ సొమ్మును ఏపీ నుంచి తెలంగాణకు రీ-యింబర్స్‌ చేయించాలని, అలాగే తెలంగాణ విద్యు త్తు సంస్థలకు ఏపీ నుంచి రావాల్సిన రూ.24,132 కోట్ల బకాయిలను ఇప్పించాలని కోరారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, బలరాం నాయక్‌, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

MLC Kavitha: కాంగ్రెస్‌ ఆరోపణల్లో నిజం లేదు.. కేసీఆర్ ఎంతో కష్టపడ్డారు

Nandamuri Balakrishna: నాన్న ఆశీర్వాదం వల్లే పద్మ భూషణ్: బాలకృష్ణ

Supreme Court: ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 09 , 2025 | 04:20 AM