Ponguleti: జూన్ 2 నుంచి రాష్ట్రమంతా భూ భారతి
ABN , Publish Date - Apr 14 , 2025 | 03:58 AM
జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలనేది ప్రభుత్వ సంకల్పం. తొలుత మూడు జిల్లాల పరిధిలోని మూడు మండలాల్లో సోమవారం నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తాం.

ప్రజా ప్రయోజనాలు కాపాడేందుకే కొత్త చట్టం
మేలో గ్రామ పాలనాధికారుల నియామకం
భూ భారతిపై గందరగోళం సృష్టిస్తే చర్యలు
వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇదే రెఫరెండం
‘ధరణి’తో కొల్లగొట్టిన భూములపై త్వరలో
ఆడిట్.. మీడియాతో ఇష్టాగోష్ఠిలో పొంగులేటి
హైదరాబాద్, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): ‘‘జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలనేది ప్రభుత్వ సంకల్పం. తొలుత మూడు జిల్లాల పరిధిలోని మూడు మండలాల్లో సోమవారం నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తాం. పోర్టల్ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉంటుంది. మూడు మండలాల పరిధిలో అంశాల వారీగా వచ్చే సమస్యలను అధ్యయనం చేశాక.. వాటి పరిష్కారానికి వీలైనంత త్వరగా నిబంధనల్లో మార్పులు చేస్తాం. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులకు గరిష్ఠంగా పది రోజుల వ్యవధిలో పరిష్కారం చూపాలనే లక్ష్యం నిర్ణయించాం’’ అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. సచివాలయంలో ఆదివారం ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. భూభారతి చట్టంపై అపోహలు తలెత్తేలా, ప్రజలను గందరగోళానికి గురి చేసేలా ఎవరు వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. ‘‘ఆదివారం సాయంత్రం 5 గంటల తరువాత భూభారతి పోర్టల్ అందరికీ అందుబాటులోకి వస్తుంది.
అయితే ఒకేసారి ఎక్కువ మంది లాగిన్ అయితే సర్వర్ మొరాయించే ప్రమాదం ఉంది. భూముల వివరాలను తెలుసుకోవాలనుకుంటే ఎప్పుడైనా పోర్టల్‌లో చూసుకోవచ్చు. ఏ ఒక్క రైతు కూడా అభద్రతకు గురికావాల్సిన పని లేదు. ధరణి సమస్యల నుంచి రైతులను, ప్రజలను కాపాడేందుకే కొత్త చట్టం తీసుకొస్తున్నాం. దీని వల్ల లాభమే తప్ప.. ఎవరికి నష్టం జరగదు. 2029 అసెంబ్లీ ఎన్నికలకు భూభారతిని రిఫరెండంగా కాంగ్రెస్ భావిస్తుంది’’ అని అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 6.50లక్షల సాదాబైనామా దరఖాస్తులను తిరస్కరించిందని పొంగులేటి గుర్తు చేశారు. కొత్త చట్టం ప్రకారం అర్హత కలిగిన దరఖాస్తులను పరిష్కరిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం పార్ట్-బీలో పెట్టిన 18 లక్షల ఎకరాల్లో సుమారు 6 లక్షల ఎకరాల వరకు అటవీ, దేవాదాయ, వక్ఫ్ భూములు ఉన్నాయని వెల్లడించారు. మిగతా 12లక్షల ఎకరాల్లో వివాదాలు లేని భూములపై వాటి యజమానులకు హక్కులు కల్పిస్తామన్నారు.
అక్రమాలను ప్రజల ముందు పెడతాం
భూభారతి అమల్లోకి వచ్చాక.. గతంలో జరిగిన భూ అక్రమాలను బయట పెడతామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఫోరెన్సిక్ ఆడిట్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని.. అందుకు సంబంధించిన ఏర్పాట్లూ పూర్తవుతున్నాయన్నారు. అన్ని వివరాలను త్వరలోనే ప్రజల ముందు పెడతామన్నారు. ఇబ్రహీంపట్నంలోని యాచారంలో భూ దందాపైనా నివేదిక సిద్ధమైందన్నారు. తొమ్మిది నెలల్లో భూభారతి కొత్త పోర్టల్ అందుబాటులోకి వస్తుందని, ప్రస్తుతానికి పాత పోర్టల్‌లోనే పలు మార్పులు చేశామన్నారు. భూభారతి అమల్లోకి వచ్చాక రిజిస్ర్టేషన్లు యథావిధిగా కొనసాగుతాయన్నారు. సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఎవరు ఫిర్యాదు చేసినా విచారణకు స్వీకరించాలని చట్టంలో పొందుపరిచామన్నారు.
గతంలో తొలగించిన వీఆర్వోలు, వీఆర్‌ఏల నుంచి ఈ నెల 17వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని, రాత పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థులకు మే మొదటి వారంలో గ్రామపాలన అధికారులుగా నియామక పత్రాలు అందజేస్తామన్నారు. గ్రామాల్లోని భూ సమస్యలను వారు ప్రభుత్వానికి నివేదిస్తారే తప్ప.. ఎలాంటి నిర్ణయాధికారాలు ఉండవన్నారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా 1000 మంది సర్వేయర్లను నియమించబోతున్నామన్నారు. వీరితోపాటు మరో 6వేల మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వనున్నామని, కర్ణాటకలో మాదిరిగా వారి సేవలను వినియోగించుకుంటామన్నారు. నాలుగేళ్లకు సంబంధించిన పాత రెవెన్యూ రికార్డులను అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రతి కార్యాలయంలో మ్యానువల్ రికార్డులు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. పాస్ పుస్తకాలు లేని వారికి ఆందోళన అవసరం లేదని.. కొత్త చట్టం ప్రకారం అర్హులందరికీ పాస్ పుస్తకాలు జారీ చేస్తామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పులివెందుల అభివృద్ధి పేరుతో జగన్ మోసం
ఏపీలో ఢిల్లీకి మించిన లిక్కర్ స్కామ్..
టీడీపీ కార్యకర్తపై కేసు.. మరికాసేపట్లో అరెస్టు..
For More AP News and Telugu News