CM Revanth Reddy: కులగణన.. తప్పెట్లా?
ABN , Publish Date - Feb 23 , 2025 | 04:00 AM
ప్రభుత్వం నిర్వహించిన కులగణన ఎట్లా తప్పో చెప్పాలంటూ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిలకు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. బట్ట కాల్చి మీద వేయడం కాదని, రాష్ట్రంలోని ఏ బ్లాక్‌లోని ఏ ఇంట్లో లెక్క తప్పు జరిగిందో చూపాలన్నారు.

ఏ ఇంట్లో తప్పు రాసుకొచ్చామో చూపండి
కేసీఆర్, కిషన్‌రెడ్డిలకు సీఎం సవాల్.. కులగణన వద్దంటూ నాపై ఎన్నో ఒత్తిళ్లు
పారదర్శకంగా కులగణన.. మనం తేల్చిన లెక్క నూటికి నూరు శాతం పక్కా
సర్వేలో పాల్గొనకుండా ఫాంహౌ్‌సలో ఉన్నోడు మంచోడైండు..
నన్ను విలన్‌ను చేశారు.. చిన్న చిన్న తప్పులంటూ పార్టీ నేతలు మాట్లాడొద్దు
కులగణన డాక్యుమెంట్‌కు బీసీ నేతలు ఓనర్‌షిప్ తీసుకోవాలి
మార్చి 10 లోగా కులాల వారీగా భేటీల్లో లెక్క పక్కా అని తీర్మానం చేయాలి
బీసీలకు ఇదే బైబిల్, భగవద్గీత, ఖురాన్.. కాంగ్రెస్ బీసీ నేతలతో రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం నిర్వహించిన కులగణన ఎట్లా తప్పో చెప్పాలంటూ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిలకు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. బట్ట కాల్చి మీద వేయడం కాదని, రాష్ట్రంలోని ఏ బ్లాక్‌లోని ఏ ఇంట్లో లెక్క తప్పు జరిగిందో చూపాలన్నారు. కులగణన లెక్కలను అసెంబ్లీలో పెట్టి, వాటికి చట్టబద్దత కల్పిస్తే.. ముఖ్యమంత్రిగా తన బాధ్యత అయిపోయినట్లేనని, అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత బీసీ నేతలదేనన్నారు. ప్రభుత్వం నిర్వహించిన కులగణన లెక్క పక్కా అంటూ కులాల వారీగా సమావేశాలను ఏర్పాటు చేసుకుని, తీర్మానాలను ఆమోదించాలంటూ కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలకు సూచించారు. ఈ ప్రక్రియను మార్చి 10లోపు పూర్తి చేయాలన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో శనివారం ప్రజాభవన్‌లో పార్టీలోని బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, సీనియర్ నేతల సమావేశం జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కులగణన సర్వే నిర్వహించిన తీరును వివరించారు. ‘‘తెలంగాణలో కాంగ్రె్‌సను అధికారంలోకి తీసుకువస్తే.. కులగణన చేసే బాధ్యతను తీసుకుంటామంటూ రాష్ట్ర ప్రజలకు రాహుల్‌గాంధీ మాట ఇచ్చారు. ఆయన మాటను విశ్వసించిన ప్రజలు అధికారం కట్టబెట్టిన తర్వాత.. ఆ మాటను నిలబెట్టడం నా బాధ్యత. ఎదురయ్యే రాజకీయ పరిణామాలకు భయపడి.. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వమూ కులగణన ప్రక్రియ చేపట్టే సాహసం చేయలేదు. మా ప్రభుత్వం.. ప్రజల్ని, ప్రభుత్వాన్ని పూర్తిస్థాయిలో భాగస్వాములను చేసి, ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఉత్తమ్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం చర్చించి.. కోర్టుల్లో ఇబ్బందులు రాకుండా.. ప్రణాళిక శాఖను నోడల్ ఏజెన్సీగా నియమించి, సర్వేను నిర్వహించాం. ప్రతి 150 ఇళ్లను ఒక క్లస్టర్‌గా తీసుకుని.. సర్వే జరిపాం. మొత్తం 1.03 లక్షల మంది ఉద్యోగులు 50 రోజుల పాటు ఇంటింటికీ తిరిగి, సమాచారాన్ని సేకరించారు. ఆ సమాచారంపై సర్వేలో పాల్గొన్న ఇంటి యజమాని, ఎన్యుమరేటర్, సూపర్‌వైజర్ సంతకాలుంటాయి. ఎన్యుమరేటర్ల పర్యవేక్షణలో 36 వేల మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లు ఆ సమాచారాన్ని క్రోడీకరించి కంప్యూటరీకరించారు.
మాన్యువల్‌గా సేకరించిన 8 పేజీల సమాచారాన్ని.. క్లస్టర్ల వారీగా బండిల్స్ కట్టి భద్రపరిచాం’’ అని రేవంత్‌రెడ్డి వివరించారు. కులగణన తప్పంటున్నవారు.. ఏ బ్లాక్‌లో ఎక్కడ తప్పు జరిగిందో చెబితే.. ఆ కట్టను తెరిచి, వారికి చూపిస్తామన్నారు. భవిష్యత్తులో ఎవరైనా కోర్టులో కేసు వేసి, ప్రక్రియను నిర్వీర్యం చేసే అవకాశం ఇవ్వకుండా సమాచారాన్ని భద్రపరిచామని చెప్పారు. ఒక వైపు కులగణన పక్రియను కుప్ప కూల్చే కుట్ర జరుగుతుంటే.. చిన్నాచితక తప్పులు జరిగితే సరిదిద్దుకుంటామంటూ పార్టీ నాయకులే మాట్లాడడం సరికాదన్నారు. ‘‘మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు 2011లో కులగణనకు సంబంధించి ఒక ప్రయత్నం జరిగింది. సమాచార సేకరణ జరిగినా.. పార్లమెంటు ముందుకు రాలేదు. బీసీ ప్రధానిని అని చెప్పుకొంటున్న మోదీ.. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన కులగణన నివేదికను బయటపెట్టాలి. బండి సంజయ్ ఆయనతో ఆ నివేదికను బయట పెట్టించాలి. లెక్క తేలితే.. బీసీలు వారి వాటాను అడుగుతారనే బయటపెట్టడం లేదు. మేం చేపట్టిన కులగణ నివేదికను ఒక్కసారి కోర్టు ముందు పెడితే.. ప్రతి రాష్ట్రంలోనూ కులగణనకు డిమాండ్లు వస్తాయి. అప్పుడు కేంద్రంలోని మోదీ సర్కారు కూడా దేశవ్యాప్తంగా కులగణనను అమలు చేయాల్సి ఉంటుంది. అదే జరిగితే.. బీజేపీలో ఆధిపత్యం వహిస్తున్న ఒకట్రెండు సామాజికవర్గాలకు నష్టం జరుగుతుంది. అందుకే.. తెలంగాణ సర్కారు జరిపిన కులగణన ప్రక్రియను తప్పుబట్టి.. ఏ లెక్క లేకుండా చేయాలని బీజేపీ చూస్తోంది’’ అంటూ రేవంత్ మండిపడ్డారు. కేసీఆర్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం బీసీలు 51ు, ఓసీలు 21ు, ఎస్సీలు 10ు, ఎస్టీలు 10ు మేరకు ఉన్నారని తెలిపారు. నాలుగు కేటగిరీలుగా జరిగిన ఆ సర్వేలో మైనార్టీల కేటగిరి ఎక్కడుందని నిలదీశారు. తమ ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో ముస్లింలలో వెనుకబడిన వర్గాలను కలుపుకోగా.. బీసీలు 56.33ు ఉన్నట్లు తేలిందన్నారు. ముస్లింలను తీసుకువచ్చి బీసీల్లో కలపడమేంటంటూ బండి సంజయ్ మాట్లాడుతున్నాడని, గుజరాత్‌కు సీఎంగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలోని 70 ముస్లిం జాతులను బీసీల్లో చేర్చానంటూ ప్రధాని మోదీ 2022లో జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో ప్రకటించారన్నారని గుర్తుచేశారు.
నాపై ఒత్తిళ్లు వచ్చాయ్
తెలంగాణలో కులగణన దేశానికే రోల్ మోడల్‌గా నిలవనుందని రేవంత్‌రెడ్డి అన్నారు. భవిష్యత్తులో దేశంలో ఎవరైనా బీసీ కులాల లెక్క తేల్చాలంటే.. తెలంగాణ రాష్ట్రం, రేవంత్‌రెడ్డి గురించి మాట్లాడాల్సిందేనన్నారు. ‘‘చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప అవకాశాన్ని జార విడుచుకుంటే అంతకంటే గొప్ప రాజకీయ అజ్ఞానం గానీ, దురద్దేశం కానీ ఇంకోటి ఉండదు. నేను రాజకీయ అజ్ఞానంతో లేను. రాజకీయంగా ఇబ్బందులు వస్తాయనీ, కులగణన వాయిదా వేసుకోవాలనీ నాపై ఎన్నో ఒత్తిళ్లు వచ్చాయి. అయినా.. నాయకుడు రాహుల్‌గాంధీ ఆదేశాలను పాటించడమే నా ధర్మం అనుకున్న. ఏనాడైనా నాయకుని ఆదేశాలు, పార్టీ నిర్ణయాలు నూటికి నూరుపాళ్లు పాటించాను కాబట్టే నాకు అవకాశాలు వచ్చాయి’’ అని వ్యాఖ్యానించారు.
నన్ను విలన్‌ను చేశారు
సర్వేలో పాల్గొనకుండా.. ఫామ్‌హౌ్‌సలో పడుకున్నోడు మంచోడయ్యాడని, ఇంత కష్టపడ్డ తనను కొందరు బీసీ నాయకులు విలన్‌ను చేశారని రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేలో పాల్గొనేందుకు రెండోసారి అవకాశమిచ్చినా.. కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్ వివరాలను అందజేయడంలేదన్నారు. వారి ఇళ్ల ముందుకెళ్లి.. డప్పుకొడుతూ మేల్కొలపాలని బీసీ నేతలకు సూచించారు. బీసీ నేతలు కులాల వారీగా సమావేశాలను ఏర్పాటు చేసుకుని, ఆయా కులాలకు ఆర్థికంగా, సామాజికంగా, ఉపాధిపరంగా ఉన్న డిమాండ్లను గుర్తించి, తీర్మానం చేయాలని పిలుపునిచ్చారు.
వీహెచ్ వర్సెస్ అంజన్
సీఎం ఎదుటే సీనియర్ నేత వి.హనుమంతరావు, అంజన్‌కుమార్ యాదవ్ వాగ్వాదానికి దిగారు. కులానికి ఒకరు చొప్పున మాట్లాడాలంటూ ప్రజాప్రతినిధులకు రేవంత్ సూచించగా.. తొలుత వీహెచ్ మాట్లాడారు. ‘‘బీసీల్లో మున్నూరు కాపులు, గౌడ, పద్మశాలి, ముదిరాజ్‌లు ఎక్కువగా ఉన్నారు. వారికి ప్రాధాన్యం ఇవ్వాలి’’ అని కోరారు. యాదవులను చేర్చక పోవడంపై అంజన్ అభ్యంతరం వ్యక్తంచేశారు. తమను రాజకీయంగా తొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనిల్‌కుమార్‌కు రాజ్యసభ సీటు ఇవ్వడాన్ని వీహెచ్ ప్రస్తావించగా.. సికింద్రాబాద్ ఎంపీ సీటును తాము వదులుకోలేదా? అని నిలదీశారు. టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, మంత్రి పొన్నం కల్పించుకుని, వారికి నచ్చజెప్పి.. శాంతింపజేశారు.
మౌనంగా ఉంటే నష్టపోతారు
తెలంగాణలో తేలిన బీసీ లెక్క పక్కా అని, ఈ అవకాశాన్ని వెనకబడిన వర్గాల వారు వదులుకుంటే మళ్లీ రాదని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘ఈ లెక్క లు తప్పంటూ ఆరోపణలు వస్తున్నాయి. బీసీ నేతలు మౌనంగా ఉంటే.. నష్టపోయేది మనమే. తెలంగాణను ఆదర్శంగా తీసుకుని, దేశవ్యాప్తంగా కులగణనకు రాహుల్‌గాంధీ సన్నద్ధమవుతున్నారు. ప్రజలు దీన్ని విశ్వసిస్తే.. రాహుల్‌గాంధీ 100ు ప్రధాని అవుతారు. మోదీ, బండి సంజయ్ ఉద్యోగాలు ఊడుతాయి. తమ ఉద్యోగాలను కాపాడుకునేందుకు వారు కులగణన ప్రక్రియను తప్పుబడుతున్నారు. కొన్ని సంఘాలు, వ్యక్తులతో ఏదేదో మాట్లాడిస్తున్నారు. తమకు సర్వేలో అవకాశం ఇవ్వలేదంటూ ఎవరైనా కోర్టుకు వెళ్లే ప్రమాదముందని, అలాంటి వారు నమోదు చేసుకునేందుకు ఈ నెల 28 వరకు అవకాశం కల్పించాం. ఆ లెక్కలు కూడా వచ్చాక.. సర్వేకు చట్టబద్ధత కల్పిస్తాం’’ అని రేవంత్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
KTR: రేవంత్ యాక్సిడెంటల్ సీఎం.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
Boy Death: మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్.. లిఫ్ట్‌లో ఇరుక్కున్న చిన్నారి మృతి
Hyderabad: స్వచ్ఛమైన గాలి.. అరగంటకు రూ.5 వేలు
Read Latest Telangana News And Telugu News