CM Revanth Reddy: భూ భారతి రైతుల చుట్టం
ABN , Publish Date - Apr 15 , 2025 | 04:05 AM
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెవెన్యూ చట్టాలను మార్చారని, ధరణి పీడకలగా మారిందని, అందుకే, రైతుల సమస్యలు పరిష్కరించే చుట్టంలా భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

భూ వివాదాలు లేని తెలంగాణే మా లక్ష్యం
గత సర్కార్ రెవెన్యూ సిబ్బందిని దొంగలుగా చూపింది
చట్టాల్ని చుట్టంగా మార్చి వేల ఎకరాలు కొల్లగొట్టారు
రైతులు అన్నం పెట్టి, గౌరవించేలా సమస్యల్ని తీర్చండి
రెవెన్యూ సిబ్బందికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపు
నా జన్మ ధన్యమైంది: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెవెన్యూ చట్టాలను మార్చారని, ధరణి పీడకలగా మారిందని, అందుకే, రైతుల సమస్యలు పరిష్కరించే చుట్టంలా భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం నాలుగు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని, తర్వాత ప్రతి జిల్లాలోని ఒక మండలంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని తెలిపారు. చివరకు, భూముల వివాదాలు లేని తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని వివరించారు. తెలంగాణ రికార్డ్ ఆఫ్ రైట్స్- 2025 (భూ భారతి)’ చట్టాన్ని సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. ‘‘తెలంగాణలో ధరణి పీడకలగా మారింది. తహసీల్దార్‌ను తగులపెట్టే స్థాయికి, ఇబ్రహీంపట్నంలో జంట హత్యలకు కారణమైంది. సిరిసిల్లలో ఒక మహిళ అధికారుల చుట్టూ తిరిగినా.. తహసీల్దార్ స్థాయిలో సమస్య పరిష్కారం కాకపోవడంతో తాళిబొట్టును కార్యాలయానికి వేలాడదీసి.. సమస్యను పరిష్కరించాలని విజ్ఙప్తి చేసే దాకా వెళ్లింది. కానీ, భూ వివాదాలకు రెవెన్యూ సిబ్బంది మూలమంటూ వారిని దోషులుగా, దొంగలుగా చిత్రీకరించి.. ఆ భూముల చట్టాలను కొద్దిమందికి చుట్టాలుగా మార్చి.. వేలాది ఎకరాలు కొల్లగొట్టారు’’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పామని, చెప్పినట్లే.. ప్రజల అభిప్రాయాలను సేకరించి.. రైతు సమస్యల శాశ్వత పరిష్కారానికి సరళంగా భూ భారతి చట్టం తీసుకొచ్చామని చెప్పారు.
మిమ్మల్ని సంపూర్ణంగా విశ్వసిస్తున్నా
తమ ప్రభుత్వం రెవెన్యూ సిబ్బందిని సంపూర్ణంగా విశ్వసిస్తుందని, వారిని దొంగలు, దోపిడిదారులు, అవినీతిపరులుగా చిత్రీకరించబోదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. వ్యక్తులు తప్పు చేస్తే కఠినంగా ఉంటామని, అంతే తప్ప వ్యవస్థను దోషిగా నిలబెట్టడాన్ని వ్యతిరేకిస్తామని అన్నారు. ఇంత గొప్ప లక్ష్యాన్ని ప్రజలకు చేరవేసే ప్రతినిధులు రెవెన్యూ సిబ్బందేనని, భూ భారతిని అమలు చేసేది వారేనని, ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే వారి ద్వారానే సాధ్యమవుతుందని చెప్పారు. గ్రామాలకు వెళ్లి.. ప్రతిష్ఠకు ఎక్కడ భంగం కలిగిందో.. అక్కడే ప్రక్షాళన చేసి, త ప్పులను కడిగేయాలని పిలుపునిచ్చారు. ప్రజా దర్బార్లు నిర్వహించి రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలన్నారు. రెవెన్యూ సిబ్బంది ఏ గ్రామానికి వెళ్లినా రైతులు భోజనం పెట్టి, గౌరవం ఇచ్చే విధంగా భూముల సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
ప్రతి కమతానికి భూధార్
మనుషులకు ఆధార్ ఉన్నట్లే.. భూమికి భూధార్ తీసుకొస్తామని సీఎం రేవంత్ చెప్పారు. ప్రతి కమతానికి భూధార్ నంబర్ ఇస్తామని, భూమి సరిహద్దులను పక్కాగా కొలిచి కార్డులు జారీ చేస్తామని ప్రకటించారు. రాబోయే రోజుల్లో కొలతలు వేసి.. హద్దులు నిర్ణయించి.. భవిష్యత్తులో ఏ సమస్యలు రాకుండా చట్టాలను బలోపేతం చేద్దామన్నారు.
హక్కు కల్పించేందుకే భూ భారతి: భట్టి
భూమిపై హక్కులు కోల్పోయిన రైతులకు తిరిగి హక్కు కల్పించే ఉద్దేశంతో భూ భారతి చట్టం తీసుకొచ్చామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సరళంగా.. సామాన్యులకు అర్థమయ్యేలా.. ఎటువంటి మతలబులూ లేకుండా తీసుకొచ్చిన అద్భుత చట్టమిదని చెప్పారు. ‘‘భూమితో పెనవేసుకున్న రైతుల జీవితాల్లో అల్లకల్లోలం సృస్టిస్తూ ధరణి చట్టం తెచ్చారు. పదేళ్లపాటు అసెంబ్లీలో చర్చకు వచ్చిన ప్రతి సందర్భంలో ధరణి శాపంగా మారిందని, రైతుల హక్కులను కొద్దిమంది పెత్తందారుల కాళ్ల దగ్గర పెడుతున్నారని చెబితే ఆనాటి పాలకులు పట్టించుకోలేదు. 24 లక్షల ఎకరాలపై హక్కులను కాలరాశారు. ఇందిరమ్మ రాజ్యం రాగానే ధరణిని బంగాళా ఖాతంలో వేస్తామని చెప్పాం.. చెప్పినట్లే చేశాం’’ అని తెలిపారు.
ధరణిని రహస్యంగా చేశారు: పొంగులేటి
‘‘కొత్త రాష్ట్రంలో కొత్త చట్టాలు చేయడం సాధారణం. కానీ, చట్టం చేస్తే అది ప్రజలకు చుట్టంలాగానో.. ఉపయోగకరంగానో ఉండాలి. కానీ, గత పాలకులు వారి స్వార్థం కోసం.. నాలుగు గోడల మధ్య నలుగురు వ్యక్తులు కూర్చుని చట్టం చేశారు. రూల్స్ లేవు. దొరగారికి ఏ ఆలోచన వస్తే.. అదే నిబంధన. వాళ్లు చెప్పినట్లు చేయలేదనే వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేశారు. ధరణి చట్టంతో ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. ఆస్తులు కాపాడుకోలేక.. రికార్డులో పేరు లేదని ప్రజలు పడిన ఆవేదన అంతా కాదు. భూ ఆసాములకు కంటి మీద లేకుండా చేశారు’’ అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసిన ధరణి చట్టాన్ని ఇచ్చిన మాట ప్రకారం బంగాళా ఖాతంలో వేశామని, ప్రజలకు ఉపయోగకరమైన భూ భారతి చట్టాన్ని తెచ్చామని ప్రకటించారు. 18 రాష్ట్రాలకు ఉద్యోగులను పంపి.. ఉత్తమ చట్టాల్లోని అంశాలను సేకరించి ప్రజలు కోరుకున్నట్లు చట్టాన్ని తయారు చేశామన్నారు. ప్రజా పాలనలో అధికారులు గ్రామాలకు వచ్చి దరఖాస్తులు తీసుకుంటారని, ప్రతి గ్రామంలో ఎమ్మార్వో రోజంతా ఉంటారని చెప్పారు. జూన్ ఒకటో తేదీలోపు ప్రయోగాత్మకంగా అమలు చేసే గ్రామాల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. ‘‘చాలామంది సీఎంలు ఉంటారు. మంత్రులుంటారు. కానీ, సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో మంత్రిగా.. ఈ చట్టం చేసే అవకాశం కలిగినందుకు నా జన్మ ధన్యమైంది’’ అంటూ హర్షం వ్యక్తం చేశారు.
తొలుత 4 మండలాల్లోనే..
భూ భారతి పోర్టల్‌ను తొలుత నాలుగు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం, కామారెడ్డి జిల్లా లింగంపేట, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, నారాయణపేట జిల్లా మద్దూరు మండలాల్లో ఈ వెబ్‌సైట్ పైలట్ ప్రాజెక్టుగా అమలు కానుంది. జూన్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పోర్టల్ సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
సన్నబియ్యం లబ్ధిదారులే మా ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్లు
సన్నబియ్యం లబ్ధిదారులే తమ ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్లని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లాలోని అక్బర్‌పేట గ్రామానికి చెందిన కూతురి లక్ష్మి కుటుంబానికి 24 కిలోల సన్నబియ్యం రేషన్ వచ్చింది. ఆ బియ్యాన్ని ఆమె అన్నం వండి గ్రామంలో సహపంక్తి భోజనం పెట్టింది. ఈ విషయంపై సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. కూతురి లక్ష్మికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ పథకం పేదల జీవితాల్లో ఎంతటి ఆనందం నింపిందో చెప్పే ప్రయత్నాన్ని లక్ష్మి చేసిందని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Raj Kasireddy: రాజ్ కసిరెడ్డి కోసం హైదరాబాద్‌లో గాలింపు
Gutkha Khaini: గుట్కా తయారీలో వాడేవి ఇవే.. తింటే డైరెక్ట్‌గా అక్కడికే..
Kancha Gachibowli: కంచ గచ్చిబౌలిపై సుప్రీంలో అఫిడవిట్.. తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పిందంటే..
New Delhi: విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ టెర్మినల్‌లోకి నో ఎంట్రీ
UPI Transactions: ఫోన్‌పే, గూగుల్‌పే చేస్తున్నారా ఈ 12 అంకెల యూటీఆర్ చరిత్ర తెలుసా
For AndhraPradesh News And Telugu News