Kodangal: పదేళ్లు కొడంగల్‌కే సీఎం సీటు
ABN, Publish Date - Mar 30 , 2025 | 01:15 AM
రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీ.. పదేళ్లపాటు కొడంగల్‌కే ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పదేళ్లలో కొడంగల్‌ను దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదుద్దుతానన్నారు.

దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతా
భూములు కోల్పోయిన కుటుంబాలకు 2 ఉద్యోగాలు
అంబేడ్కర్‌ను అవమానించిన షా
బీసీలకు బీజేపీ వ్యతిరేకం
హిందూ ముస్లింలు ఏకమై దేశాన్ని కాపాడాలి: సీఎం రేవంత్
కొడంగల్‌లో ముఖ్యమంత్రి పర్యటన
కొడంగల్/వికారాబాద్, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీ.. పదేళ్లపాటు కొడంగల్‌కే ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పదేళ్లలో కొడంగల్‌ను దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదుద్దుతానన్నారు. పరిశ్రమల కోసం భూములు కోల్పోయిన వారి కుటుంబాలకు ఎకరాకు రూ.20 లక్షలు, 150 గజాల ఇంటిస్థలంతోపాటు కుటుంబంలో ఇద్దరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే రూ.10 వేల కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, వచ్చే ఐదేళ్లలో మరో రూ.10 వేల కోట్ల పనులు చేపడతామని చెప్పారు. శనివారం తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో సీఎం పర్యటించారు. సాయంత్రం కొడంగల్‌లోని శ్రీ మహాలక్ష్మీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానిక ముస్లింలకు సీఎం ఇఫ్తార్ విందు ఇచ్చారు. ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శనివారం రాత్రి కొడంగల్‌లోని తన నివాసంలో నిర్వహించిన జై బాపు, జైభీమ్, జై సంవిధాన్ అభియాన్ సన్నాహక సమావేశంలో రేవంత్ మాట్లాడారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పార్లమెంటు సాక్షిగా బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించేలా, మహాత్మాగాంధీని చంపిన వారిని ప్రోత్సహించేలా మాట్లాడడం దారుణమన్నారు. వెనుకబడిన వర్గాలకు వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. అంబేడ్కర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సమావేశాలు నిర్వహించి ఆయన స్ఫూర్తి చాటాలని కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు.
కొడంగల్ ప్రజలిచ్చిన శక్తితోనే..
కొడంగల్ ప్రాంత ప్రజలు ఇచ్చిన శక్తితోనే తాను ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగానని రేవంత్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీకి వస్తే కొడంగల్ వ్యక్తిగా తాను మాట్లాడితే మాట పడాల్సి వస్తుందనే మాజీ సీఎం కేసీఆర్ సభకు రావడం లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తరఫున అసెంబ్లీకి వచ్చిన వారికి ఓనమాలు కూడా రావని అన్నారు. సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లకు ఉండాల్సిన అధికారం కొడంగల్‌కు రావడంతో కుట్రలకు తెరలేపారని ఆరోపించారు. కొడంగల్‌ను ఎలాగైనా దెబ్బతీయాలనే లక్ష్యంతో రైతులను రెచ్చగొట్టి పరిశ్రమలను అడ్డుకునేందుకు చేస్తున్న కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సీఎం హోదాలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి తెలంగాణను కాపాడుకునే బాధ్యతను తాను తీసుకుంటానని, కొడంగల్ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను కార్యకర్తలు తీసుకోవాలని అన్నారు. తనను లగచర్లకు వెళ్లాలంటూ అసెంబ్లీలో కేటీఆర్ విసిరిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని, త్వరలోనే లగచర్లలో సమావేశం నిర్వహించి రైతులతో మాట్లాడతానన్నారు. కొడంగల్ ప్రాంతంలో ఎకరా భూమి ధర కోటి రూపాయల వరకు పెరగడమే తన ఆకాంక్ష అని ప్రకటించారు.
ఒక్క సంతకంతో అన్నీ కొడంగల్‌కు..
‘‘నేను ఉన్నంతవరకు కొడంగల్‌లో అభివృద్ధి పనుల కోసం మీరు ఎవరి వద్దకో వెళ్లి బిక్షం అడగాల్సిన పనిలేదు. ఒక్క సంతకంతో కొడంగల్‌కు అన్నీ వస్తాయి. పనుల కోసం మీరు హైదరాబాద్‌కు రావాల్సిన పని లేదు. చిట్టీ రాసి పంపిస్తే 24 గంటల్లో నేనే వచ్చి కొడంగల్‌కు ఏ పనులు కావాలో అవన్నీ పూర్తి చేయిస్తాను’’ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సందర్భంగా వారినుద్దేశించి సీఎం మాట్లాడారు. గత 15 ఏళ్లుగా మంచికి, చెడుకు ఇక్కడి ముస్లింలు తనకు అండగా ఉన్నారని తెలిపారు. కొడంగల్‌లో ముస్లింల అభివృద్ధికి ఎమ్మెల్యే అభివృద్ధి నిధుల నుంచి 25 శాతం కేటాయించామని గుర్తు చేశారు. దేశంలో ముస్లింలకు ఎక్కువ అవకాశాలు కల్పించింది కాంగ్రెస్సేనని తెలిపారు. మతోన్మాద పార్టీలకు వ్యతిరేకంగా చేసే పోరాటంలో కాంగ్రెస్ ముందుంటుందన్నారు. హిందూ, ముస్లింలు ఏకమై దేశాన్ని రక్షించాలని భారత్ జోడో యాత్రలో రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ఆ దిశగా తాము కృషి చేస్తూ ఉంటే, ఎన్నికల్లో గెలుపొందడానికి కొందరు మనలో మనకు విబేధాలు సృష్టించి లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ప్రయత్నాలను సాగనివ్వబోమన్నారు.
వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న సీఎం
వికారాబాద్ జిల్లా కొడంగల్‌లోని శ్రీ మహాలక్ష్మీవేంకటేశ్వరస్వామిని శనివారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి దర్శించుకున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక పూజలు చేశారు. సీఎంకు మంగళవాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సీఎం మొదట శ్రీ భూవరాహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టువస్త్రాలను తలపై పెట్టుకుని ప్రదక్షిణగా వెళ్లి ప్రభుత్వం తరఫున స్వామివారికి సమర్పించారు. అనంతరం యాగశాలలో ఉత్సవ మూర్తులను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆస్థాన మండపంలో వేద పండితులు, అర్చకులు తీర్థ ప్రసాదాలు, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తీసుకువచ్చిన స్వామి వారి శేషవస్త్రాలను సీఎం రేవంత్‌రెడ్డికి బహూకరించి ఆశీర్వదించారు. దేవాలయ ధర్మకర్తలు శ్రీవేంకటేశ్వరస్వామి ఫొటో, వస్త్రం, ప్రసాదాలను అందజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
Hyderabad Metro : అదిరిపోయే శుభవార్త చెప్పిన HYD మెట్రో.. రైళ్ల ప్రయాణ వేళలు పొడిగింపు..
GPO Posts: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
Sunny Yadav Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. ఒక్కొక్కరికీ చుక్కలు చూపిస్తున్న పోలీసులు
Read Latest Telangana News And Telugu News
Updated Date - Mar 30 , 2025 | 01:15 AM