CM Revanth Reddy: పదేళ్లు.. 20 వేల కోట్లు!

ABN, Publish Date - Apr 05 , 2025 | 03:32 AM

రేవంత్‌ మాటలునమ్మి 400 ఎకరాల భూమిలో అంగుళం కూడా కొనకండి. మూడేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది మేమే. అప్పుడు ఆ భూముల్ని వెనక్కి తీసుకుంటాం.

CM Revanth Reddy: పదేళ్లు.. 20 వేల కోట్లు!

బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రభుత్వ భూముల అమ్మకాల తీరిది..

  • పర్యావరణ విధ్వంసం, జల వనరుల నిర్మూలన

  • ఆకాశహర్మ్యాలతో కాలుష్య, ట్రాఫిక్‌ సమస్యలు

  • అప్పటి లెక్కలన్నీ తీస్తున్న రేవంత్‌ సర్కార్‌

  • ప్రజల ముందుంచి బీఆర్‌ఎస్‌ను నిలదీయాలని యోచన

  • కేటీఆర్‌ ‘భూములు వెనక్కి’ వ్యాఖ్యలపై గరంగరం

  • వెనక్కి తీసుకుంటామంటే పరిశ్రమలెలా అని ప్రశ్న

  • హైదరాబాద్‌ ఇమేజ్‌ దెబ్బతింటుందని ఆందోళన

  • బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన కోకాపేట్‌ భూముల

  • వేలం రద్దుకు నిరుద్యోగుల ధర్నా.. కేటీఆర్‌పై ఫైర్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): ‘రేవంత్‌ మాటలునమ్మి 400 ఎకరాల భూమిలో అంగుళం కూడా కొనకండి. మూడేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది మేమే. అప్పుడు ఆ భూముల్ని వెనక్కి తీసుకుంటాం. కాంగ్రెస్‌ సర్కార్‌ చెప్పిందని ఎవరైనా కొంటే డబ్బులు నష్టపోతారు’’ అంటూ గురువారం మాజీ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మండిపడుతున్నారు. కేసీఆర్‌ పదేళ్ల పాలనలో ప్రభుత్వ భూముల అమ్మకాలపై వివరాలు ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఆయా భూముల అభివృద్ధి క్రమంలో జరిగిన పర్యావరణ విధ్వంసం, గుట్టలు, నీటి వనరుల నిర్మూలన వంటి వివరాలనూ తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం సహా అస్మదీయ సంస్థలకు ఎంత విలువైన భూముల్ని కారుచౌకగా కేటాయించిందీ వివరాలను వెలికి తీస్తున్నట్లు చెబుతున్నారు. ఈ వివరాలన్నిటినీ ప్రజల ముందు పెట్టాలని, కేసీఆర్‌ పదేళ్ల పాలనలో హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూముల అమ్మకాన్ని ప్రధాన ఆదాయ వనరుగా ఎలా మార్చుకున్నదీ ప్రజలకు వివరించే ఆలోచన సీఎం రేవంత్‌ రెడ్డి చేస్తున్నట్లు చెబుతున్నారు. మరోవైపు, ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేటాయించిన భూములను తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెనక్కి తీసుకుంటామని చెబితే రాష్ట్రానికి పరిశ్రమలు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి వ్యాఖ్యలతో హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్‌ వ్యాఖ్యలకు ఆదిలోనే చెక్‌ పెట్టాలని, అప్పుడు మాత్రమే హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీ తదితర సంస్థల ద్వారా జరిగే ప్రభుత్వ భూముల అమ్మకాల పట్ల కొనుగోలుదారుల్లో నమ్మకాన్ని కలిగించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. లేకపోతే, ప్రభుత్వ ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రభుత్వ పెద్దలు భావిస్తునట్లు తెలుస్తోంది. వీటికితోడు, కేసీఆర్‌ పదేళ్ల పాలనలో జరిగిన ప్రభుత్వ భూముల అమ్మకాలు, పర్యావరణ విధ్వంసం తదితర వివరాలను బయటపెట్టి.. ఇప్పుడు ఆ భూములను ప్రభుత్వం వెనక్కు తీసుకోవచ్చా!? అంటూ బీఆర్‌ఎస్‌ నేతలను నిలదీయాలని ఆలోచిస్తున్నారు.


పదేళ్లలో రూ.20 వేల కోట్లకుపైగా ఆదాయం

బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో రాష్ట్రంలో ప్రభుత్వ భూములను అమ్మేసి రూ.20 వేల కోట్లకుపైగా ఆదాయాన్ని ఆర్జించినట్లు ప్రభుత్వం లెక్కలు తీసింది. వీటిలో కోకాపేట, నియో పొలిస్‌ వంటి ప్రాంతాలు అత్యంత విలువైనవే కాకుండా అక్కడ కొండలు, గుట్టలు, చెట్లు, పొదలనూ తొలగించారని సమాచారం సేకరించింది. తన పాలనలో కేసీఆర్‌ కూడా రాష్ట్ర బడ్జెట్‌కు వాణిజ్య పన్నులు, లిక్కర్‌ అమ్మకాలతోపాటు ప్రభుత్వ భూముల అమ్మకాన్నే ప్రధాన ఆదాయ వనరుగా ఎంచుకున్నారంటూ గణాంకాలు సేకరించింది. 2015 నుంచి 2024 వరకు టీజీఐఐసీ భాగస్వామ్యంతోనూ, ప్రభుత్వమే నేరుగానూ సుమారు 342 ఎకరాల భూమిని వేలం వేసి.. రూ.9,031 కోట్ల మేరకు ఆదాయాన్ని సమకూర్చుకుందని నివేదిక సిద్ధం చేసింది. వాస్తవానికి, 650 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమిని వేలం పెట్టగా.. అందులో 342 ఎకరాల భూముల అమ్మకం మాత్రమే జరిగిందని, న్యాయపరమైన చిక్కులు, ఇతర కారణాలతో మిగిలిన భూమి అమ్మకం పెండింగ్‌లో పడిందని గుర్తు చేసింది. ఇక, 2018 నుంచి 2024 వరకు హెచ్‌ఎండీఏ ద్వారా ప్రభుత్వ స్థలాలను అభివృద్ధి చేసి.. 1,445 ప్లాట్ల (7,81,612 చదరపు గజాలు)ను విక్రయించిందని, తద్వారా, రూ.11,875 కోట్ల మేరకు ఆదాయాన్ని సమకూర్చుకుందని సమాచారం సేకరించింది. వీటిలో కోకాపేట, నియో పొలిస్‌, బాచుపల్లి, మేడిపల్లి, మోకిల తదితర అత్యంత విలువైన భూములూ ఉన్నాయని పేర్కొంది. వెరసి, ప్రభుత్వ స్థలాల అమ్మకాల ద్వారా రూ.20,906 కోట్ల మేరకు ఆదాయాన్ని సమకూర్చుకుందని పేర్కొంది. హెచ్‌ఎండీఏ ద్వారా అమ్మిన ప్లాట్లలో ప్రభుత్వ భూములతోపాటు అసైన్డ్‌, ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం ద్వారా సేకరించిన భూములూ ఉన్నాయి.


అన్నీ హాట్‌ కేక్‌ భూములే!

హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీ ద్వారా, ప్రభుత్వమే నేరుగానూ అమ్మిన భూములన్నీ బాగా డిమాండ్‌ ఉన్న ప్రాంతాల్లోనే ఉన్నాయి. కోకాపేట, గచ్చిబౌలి, బుద్వేలు, పుప్పాలగూడ, మణికొండ, నార్సింగి, నియో పోలిస్‌ వంటి ప్రైమ్‌ ఏరియాల్లోనే ఈ భూములున్నాయి. కోకాపేటలో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయానికి కేటాయించిన భూమి రూ.వందల కోట్లలో ఉంటుందని చెబుతున్నారు. ఇలా ప్రైమ్‌ ఏరియాల్లో ప్రభుత్వ భూములను తెగనమ్మిన బీఆర్‌ఎస్‌ నాయకత్వం.. ఆయా ప్రాంతాల్లో పర్యావరణకూ పాతరేసిందని కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అవసరానికి మించి ఆకాశ హర్మ్యాలను నిర్మించుకోవడానికి అనుమతులు ఇచ్చి పర్యావరణంతోపాటు కాలుష్యం, ట్రాఫిక్‌ సమస్యలనూ సృష్టించారని తప్పుబడుతున్నారు. కోకాపేట వంటి ప్రాంతాల్లో అదనంగా పదుల అంతస్తుల్లో భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి మరీ ప్రభుత్వ భూములను గత ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని గుర్తు చేస్తున్నారు. ఈ అంశాలన్నీ సవివరంగా ప్రజల దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వ పెద్దలు కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి:

Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కి మరో దెబ్బ.. అమెరికా వస్తువులపై కూడా 34% సుంకం..


Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..

Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 05 , 2025 | 03:32 AM