Hyderabad: ‘మైదానంలో మందు పార్టీ’పై కమిషనర్ సీరియస్
ABN, Publish Date - Jan 03 , 2025 | 06:54 AM
ఉప్పల్ మునిసిపల్ క్రీడా మైదానాన్ని మందు పార్టీ (నూతన సంవత్సర వేడుకలు)కి కేటాయించడాన్ని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబరిది(GHMC Commissioner Ilambaridi) తీవ్రంగా పరిగణించారు.
హైదరాబాద్ సిటీ: ఉప్పల్ మునిసిపల్ క్రీడా మైదానాన్ని మందు పార్టీ (నూతన సంవత్సర వేడుకలు)కి కేటాయించడాన్ని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబరిది(GHMC Commissioner Ilambaridi) తీవ్రంగా పరిగణించారు. ‘ఆంధ్రజ్యోతి’లో మైదానంలో మందు పార్టీ పేరుతో గురువారం ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. వేడుక నిర్వహణకు కొన్నిరోజుల ముందే బుకింగ్ రద్దు చేయాలని కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లినా.. స్థానిక జోనల్, సర్కిల్ కమిషనర్లు పట్టించుకోకపోవడంపై సీరియస్ అయినట్టు తెలిసింది.
ఈ వార్తను కూడా చదవండి: CM Revanth Reddy: బ్రాండ్‌గా తెలంగాణ!
ఈమేరకు ఉప్పల్ సర్కిల్ కమిషనర్ ఆంజనేయులును ఉన్నతాధికారులు కేంద్ర కార్యాలయానికి పిలిపించారు. ఏ ప్రాతిపదికన మైదానం కేటాయించారు? రద్దు చేయాలని చెప్పినా పట్టించుకోకపోవడం.. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు జారీ చేసేందుకు నిర్ణయించినట్టు సమాచారం. డిసెంబర్ 31వ తేదీన ఓ కార్యక్రమం కోసం కార్పొరేట్ కేటగిరీలో ఓ వ్యక్తి ముందస్తు బుకింగ్ చేసుకున్నారు.
‘మునిసిపల్ స్టేడియంలో నూతన సంవత్సర వేడుకలు.. మందు, విందు’ అంటూ డిసెంబరు మొదటి వారం నుంచే నిర్వాహకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆన్‌లైన్, నేరుగా కూడా టికెట్లు విక్రయించారు. దీంతో స్టేడియంలో మందు పార్టీపై జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయానికి ఫిర్యాదులు వచ్చాయి. అప్రమత్తమైన ఉన్నతాధికారులు కార్యక్రమానికి కొన్నిరోజుల ముందే జోనల్, సర్కిల్ అధికారులను అప్రమత్తం చేసినట్టు తెలిసింది. అయినా వారు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఉప్పల్ సర్కిల్ డిప్యూటీ మునిసిపల్ కమిషనర్ ఏకంగా ఫోన్ ఆఫ్ చేసి అందుబాటులో లేరని తెలిసింది.
ప్రణాళిక ప్రకారమే..
పార్టీకి మైదానం బుకింగ్ నుంచి కార్యక్రమం నిర్వహణ వరకు అంతా ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వేడుకల పేరిట మద్యం పార్టీ నిర్వహిస్తున్నారని తెలిసీ స్థానిక అధికారులు సహకరించారన్న ఆరోపణలున్నాయి. అందుకే ఉన్నతాధికారులు అప్రమత్తం చేసినా బుకింగ్ రద్దు చేయలేదని సమాచారం. ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితం కావడంతో సర్కిల్ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. గురువారం ఉదయం మైదానంలో ఉన్న మద్యం సీసాలు, ఆహార వ్యర్థాలు, ఇతరత్రా చెత్తా చెదారం యుద్ధప్రాతిపదికన తొలగించారు.
అప్పటి వరకు తెలియదు..
‘ఆన్‌లైన్ బుకింగ్ కావడంతో ఈవెంట్ ప్రారంభమయ్యే వరకు మాకు తెలియదు. ఎక్సైజ్, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, అగ్నిమాపక శాఖల నుంచి అనుమతి తీసుకున్నారు. మేం తాత్కాలిక ట్రేడ్ లైసెన్స్ మాత్రమే ఇచ్చాం. చెత్త తొలగించనందుకు జరిమానా విధిస్తాం. మున్ముందు ఇలాంటి ఈవెంట్లకు పర్మిషన్ ఇవ్వం.’ అని ఉప్పల్ డీసీ ఆంజనేయులు చెబుతున్నారు. మద్యం పార్టీ జరుగుతుందని ఉన్నతాధికారులు చెప్పినా పట్టించుకోని డీసీ.. వేడుకల విషయం తనకు తెలియదని చెప్పడం గమనార్హం.
అన్నీ అనుమానాలే?
వేడుకలకు సర్కిల్ అధికారులు తాత్కాలిక ట్రేడ్ లైసెన్స్ ఇచ్చారు. సాధారణ కార్యక్రమాలు నిర్వహిస్తే ట్రేడ్ లైసెన్స్ అవసరం లేదు. వ్యాపారం కనుకే నిర్వాహకులు ట్రేడ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. జీహెచ్‌ఎంసీ నిబంధనల ప్రకారం క్రీడా మైదానాలను వ్యాపారాల కోసం కేటాయించవద్దు. ఇక్కడ ట్రేడ్ లైసెన్స్ కోసం దరఖాస్తు వచ్చినా.. కార్యక్రమం ఏంటనేది తెలుసుకోకుండానే అనుమతి ఇచ్చారా..? అన్నీ తెలిసే చేశారా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికీ మైదానంలో పగిలిన సీసా ముక్కలున్నాయి. గ్రౌండ్‌లో ఆడుకునేందుకు వచ్చే పిల్లలు, ఉదయం, సాయంత్రం నడకకు వచ్చే వారికి వీటితో ప్రమాదం పొంచి ఉంది.
ఆన్‌లైన్ కేటాయింపుతో..
పారదర్శక సేవలు, అక్రమాలకు చెక్ పెట్టేలా జీహెచ్‌ఎంసీలోని క్రీడా మైదానాలు, ఇండోర్ స్టేడియం బుకింగ్ కోసం ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆన్‌లైన్‌లో వ్యక్తిగత, కార్పొరేట్, స్కూల్ కేటగిరీలో బుకింగ్ చేసుకునే అవకాశముంటుంది. దీనిని కొందరు నిర్వాహకులు దుర్వినియోగం చేస్తుండగా.. అధికారులూ సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కమిషనర్‌కు ఫిర్యాదు
ఉప్పల్ మైదానంలో మందు పార్టీపై జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ(GHMC Standing Committee) సభ్యుడు, చిలుకానగర్ కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ కమిషనర్ ఇలంబరిదికి ఫిర్యాదు చేశారు. లిక్కర్ ఈవెంట్ ఉందని తెలిసినా.. బుకింగ్ రద్దు చేయని డీసీపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంతకుముందు మైదానాన్ని పరిశీలించారు. డీసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈవార్తను కూడా చదవండి: Formula E Race: ఇదేం ఫార్ములా?
ఈవార్తను కూడా చదవండి: 765 చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్ధారణ
ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ: హరీశ్ రావు
ఈవార్తను కూడా చదవండి: అన్నదాతలకు రేవంత్ సున్నంపెట్టే ప్రయత్నం
Read Latest Telangana News and National News
Updated Date - Jan 03 , 2025 | 06:54 AM