High Court: క్రిశాంక్‌కు నోటీసు ఇచ్చి విచారణ చేపట్టండి
ABN , Publish Date - Apr 09 , 2025 | 05:09 AM
కంచ గచ్చిబౌలి 400 ఎకరాల భూములకు సంబంధించిన ఫేక్ వీడియోల కేసులో బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌కు బీఎన్‌ఎ్‌సఎ్‌స 35 నోటీసు ఇచ్చి విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది.

కంచ గచ్చిబౌలి ఫేక్ వీడియోల కేసులో హైకోర్టు
హైదరాబాద్, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): కంచ గచ్చిబౌలి 400 ఎకరాల భూములకు సంబంధించిన ఫేక్ వీడియోల కేసులో బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌కు బీఎన్‌ఎ్‌సఎ్‌స 35 నోటీసు ఇచ్చి విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. ఆ భూములను చదును చేసే క్రమంలో అక్కడ నివసించే జింక చనిపోయిందని, అధికారులే దానిని చంపేశారనేలా సామాజిక మాధ్యమాల్లో ఫేక్ వీడియోలను వైరల్ చేసినట్లు క్రిశాంక్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తప్పుడు ప్రచారం చేసేందుకు క్రిశాంక్ నకిలీ వీడియోలు సృష్టించారని అటవీ శాఖ అధికారులు, కాంగ్రెస్, ఎన్‌ఎ్‌సయూఐ నాయకులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
వివిధ వర్గాల మధ్య శత్రుత్వం, విద్వేషం రెచ్చగొట్టేలా, ఉద్రిక్తతలను రాజేసేలా క్రిశాంక్ వ్యవహరించారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. దీంతో అతనిపై మూడు కేసులు నమోదయ్యాయి. ఈ ఎఫ్‌ఐఆర్‌లను కొట్టేయాలని కోరుతూ క్రిశాంక్ హైకోర్టులో వేర్వేరు క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న జస్టిస్ ఎన్ తుకారాంజీ.. మూడు ఎఫ్‌ఐఆర్‌లలో ఆరోపణలు ఒకేలా ఉన్నాయని పేర్కొన్నారు. పిటిషనర్ కం నిందితుడికి చట్టప్రకారం నోటీసు ఇచ్చి విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం, ఫిర్యాదుదారులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు.