Share News

యాదగిరికొండపై భక్తుల సందడి

ABN , Publish Date - Apr 14 , 2025 | 01:05 AM

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో కొండపై సందడి నెలకొంది.

యాదగిరికొండపై భక్తుల సందడి
ప్రసాద విక్రయాల వద్ద భక్తుల రద్దీ

నిత్యాదాయం రూ.54.91 లక్షలు

యాదగిరిగుట్ట, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో కొండపై సందడి నెలకొంది. శని, ఆదివారం వారాంతపు సెలవు, సోమవారం (అంబేడ్కర్‌ జయంతి) వరుసగా మూడు సెలవు రోజులు రావడంతో ఇష్టదైవాలను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వాహనాలపై తరలివచ్చారు. కొండకింద పార్కింగ్‌ ప్రదేశం వాహనాలతో నిండిపోయి వైకుంఠ ద్వారం ఇరువైపులా వాహనాలు పార్కింగ్‌ చేశారు. ఉభయ (ప్రత్యేక, ధర్మదర్శన) క్యూలైన్లు భక్తులతో ఉదయం నుంచి మధ్యాహం వరకు రద్దీగా ఉన్నాయి. వీఐపీ టికెట్‌ దర్శనానికి గంటన్నర, ధర్మదర్శనానికి రెండు గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. మధ్యాహ్నం గంటసేపు ఆరగింపు సమ యంలో క్యూ కాంప్లెక్స్‌లో వేచి ఉన్న భక్తులు ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డారు. ప్రధానాలయం, ఉత్తర ప్రాకార మండపం, కొండకింద వ్రత మండపాలు, లక్ష్మీ పుష్కరిణి, అన్నప్రసాద సత్రం, బస్టాండ్‌, కొండపైన తిరువీధులు, బస్టాండ్‌, ప్రసా ద విక్రయశాలల్లో కూడా భక్తుల సందడి నెలకొంది. వేసవి తాపానికి తట్టుకోలేక కొండబండపై భక్తులు పరుగులు పెట్టారు. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.54,91,048ఆదాయం సమకూరినట్లు ఈవో ఏ.భాస్కర్‌రావు తెలిపారు.

లక్ష్మీనృసింహుడికి శాస్త్రోక్తంగా నిత్య పూజలు

సుప్రభాత సేవతోస్వామి అమ్మవార్లను మేల్కొలిపిన అర్చకస్వాములు స్వయంభువులకు సంప్రదాయరీతిలో నిత్యపూజలు నిర్వహించారు. గర్భాలయంలో స్వయంభువులకు అభిషేకం, అర్చనలు, ప్రాకార మండపంలో హోమం, నిత్య కల్యాణోత్సవ పర్వాలు వైభవంగా చేపట్టారు. అనుబంధ ఆలయమైన పాతగుట్టలోనూ స్వామి, అమ్మవార్లకు నిత్య పూజలు ఘనంగా చేపట్టారు. శివాల యంలో శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామివారికి నిత్య పూజలు, రుద్రహవన పూజలు, శైవాగమరీతిలో జరిపారు. రాత్రి మహానివేదన, శయనోత్సవాలతో ఆయన ద్వారబంధనం చేశారు.

Updated Date - Apr 14 , 2025 | 01:05 AM