Kotha Prabhakar Reddy: నేను కేసీఆర్‌కు విధేయుడిని
ABN , Publish Date - Apr 03 , 2025 | 03:54 AM
దుబ్బాకలో స్కిల్ వర్సిటీ ఏర్పాటుకు సీఎం సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో రెండు రోజుల క్రితం ప్రభాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం ఎన్నో సంవత్సరాల నుంచి వెనుకబడింది.

ప్రజాప్రతినిధిగా సీఎంను గౌరవిస్తా
నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలపడంలో తప్పేముంది?
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
2 రోజుల క్రితం ఎమ్మెల్యే వ్యాఖ్యలు వైరల్
మా ప్రభుత్వంలోనూ దుబ్బాకకు నిధులు రాలేదు
కాంగ్రెస్ పాలనలో వేగంగా అభివృద్ధి
గత పాలకులు నిర్లక్ష్యం చూపారంటూ విమర్శ
దుబ్బాక, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): ‘‘నాకు రాజకీయ భిక్ష పెట్టిందే కేసీఆర్. నేను ఎక్కడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడలేదు’ అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. తప్పుడు ప్రచారాలకు సమాధానమిచ్చుకుంటూ పోలేనని, తాను కేసీఆర్‌కు విధేయుడనని స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రజాప్రతినిధిగా తాను సీఎంను గౌరవిస్తానని, రేవంత్‌రెడ్డి తనపై గౌరవంతో నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేశారని అన్నారు. దుబ్బాకలో స్కిల్ వర్సిటీ ఏర్పాటుకు సీఎం సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో రెండు రోజుల క్రితం ప్రభాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం ఎన్నో సంవత్సరాల నుంచి వెనుకబడింది. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, గతంలో మా ప్రభుత్వంలో కూడా సరైన నిధులు రాలేదు. ఇది జగమెరిగిన సత్యం’’ అని అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో కన్నా కాంగ్రెస్ పాలనలో దుబ్బాక అభివృద్ధి వేగంగా జరుగుతోందని అభిప్రాయపడ్డారు. దుబ్బాకపై గత పాలకులు తీవ్ర నిర్లక్ష్యం చూపారని విమర్శించారు. తనకు సీఎంను కలిసే హక్కుందని, అభివృద్ధి కోసం ఎంతదూరమైనా వెళ్తానని వ్యాఖ్యానించారు.
ఈ విషయం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో బుధవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ తాను సంస్కారవంతమైన వ్యక్తినని, నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలపడంలో తప్పులేదన్నారు. ఇందులో రాజకీయ దురుద్దేశం లేదని తెలిపారు. కాగా, ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై కేసీఆర్ ఎలా స్పందిస్తారోనన్న చర్చ జరిగినా.. ఎర్రవెల్లి ఫాంహౌ్‌సలో జరిగిన సమావేశంలో ఆ అంశమేమీ చర్చకు రాలేదు. ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి హాజరైన ప్రభాకర్‌రెడ్డిని కేసీఆరే పలకరించారు. ‘‘ఏం ప్రభాకర్.. దుబ్బాక ఎలా ఉంది? దుబ్బాకలోని నా బాల్యమిత్రులు ఎలా ఉన్నారు? వారందరినీ అడిగినట్టు చెప్పు... దుబ్బాకకు ఒక్కసారి రావాలని ఉంది’’ అని వ్యాఖ్యానించారు. వరంగల్ సభకు దుబ్బాక నుంచి స్వచ్ఛందంగా కార్యకర్తలు తరలివస్తారని, వీలైనంత ఎక్కువ మందిని తీసుకురావాలని ప్రభాకర్‌రెడ్డికి సూచించారు. ఈ మేరకు ప్రభాకర్‌రెడ్డి బదులిస్తూ.. 15వేలమందికి తగ్గకుండా వస్తామని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎస్ఆర్‌హెచ్ వివాదంపై స్పందించిన హెచ్‌సీఏ
నా కుమారుడు ఎవరినీ మోసం చేయలేదు
For More AP News and Telugu News