Share News

GHMC: ప్యారానగర్‌ డంపుయార్డ్‌ పనులు ప్రారంభం

ABN , Publish Date - Feb 06 , 2025 | 04:19 AM

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామపంచాయతీ పరిధి ప్యారానగర్‌లో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోతున్న డంపుయార్డ్‌ నిర్మాణ పనులు పోలీసు పహారా నడుమ సోమవారం ప్రారంభమయ్యాయి.

GHMC: ప్యారానగర్‌ డంపుయార్డ్‌ పనులు ప్రారంభం

  • అఖిలపక్ష నాయకులు, ఎమ్మెల్యే సునీతారెడ్డి అరెస్ట్‌

గుమ్మడిదల, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామపంచాయతీ పరిధి ప్యారానగర్‌లో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోతున్న డంపుయార్డ్‌ నిర్మాణ పనులు పోలీసు పహారా నడుమ సోమవారం ప్రారంభమయ్యాయి. డంపుయార్డ్‌ స్థలానికి వెళ్లేందుకు అటవీ ప్రాంతం నుంచి రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు. కొన్నేళ్లుగా గ్రామస్థులు, అఖిలపక్ష నాయకులు ఆందోళన చేయడంతో డంపుయార్డ్‌ ఏర్పాటు ఆలస్యమవుతూ వచ్చింది. అయితే ఈసారి జీహెచ్‌ఎంసీ పకడ్బందీ ఏర్పాట్లతో రంగంలోకి దిగింది. ఏఎస్పీ సంజీవ్‌రావు నేతృత్వంలో భారీ భద్రతా చర్యలు చేపట్టారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే గ్రామంలో పలు పార్టీల నాయకులను అదుపులోకి తీసుకున్నారు.


గుమ్మడిదల, నల్లవల్లి, మంబాపూర్‌ గ్రామాల్లో భారీగా పోలీసులు మోహరించారు. డంపుయార్డ్‌ పనుల విషయం తెలుసుకున్న అఖిలపక్ష నాయకులు విద్యాసంస్థల బంద్‌ నిర్వహించారు. గుమ్మడిదల రోడ్డుపై ధర్నా నిర్వహించి, డంపుయార్డ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. స్థానికులను పరామర్శించేందుకు వెళ్లిన నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతారెడ్డిని సైతం పోలీసులు అరెస్టు చేశారు. కాగా డంపుయార్డ్‌ నిర్వహణను యూరోపియన్‌ టెక్నాలజీతో చేపడుతున్నామని, స్థానికులు అపోహలు వీడి సహకరించాలని జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ రఘుప్రసాద్‌ కోరారు.

Updated Date - Feb 06 , 2025 | 04:19 AM