Share News

Gachibowli: కంచ గచ్చిబౌలి విధ్వంసంతో జీవ వైవిధ్యానికి దెబ్బ

ABN , Publish Date - Apr 03 , 2025 | 06:01 AM

కొన్నివేల వృక్షాలు, జంతువులు, పక్షులు, కీటకాలకు ఆవాసమైన కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని కట్టడాలుగా మారిస్తే, జీవ వైవిధ్యత దెబ్బతింటుందని పర్యావరణ శాస్త్రవేత్త అరుణ్‌ వాసిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

Gachibowli: కంచ గచ్చిబౌలి విధ్వంసంతో జీవ వైవిధ్యానికి దెబ్బ

  • ఈ భూముల్లో 233 రకాల పక్షి జాతులు

  • అత్యంత అరుదైన 72 వృక్ష జాతులన్నాయి

  • సహజ అడవిని కోల్పోతే నగరం నరకమే

  • అరుణ్‌ వాసిరెడ్డి, హరగోపాల్‌ ఆందోళన

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌2(ఆంధ్రజ్యోతి): కొన్నివేల వృక్షాలు, జంతువులు, పక్షులు, కీటకాలకు ఆవాసమైన కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని కట్టడాలుగా మారిస్తే, జీవ వైవిధ్యత దెబ్బతింటుందని పర్యావరణ శాస్త్రవేత్త అరుణ్‌ వాసిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సహజసిద్ధంగా ఏర్పడిన అడవిని కోల్పోతే నగరం నరకంగా మారుతుందనడంలో సందేహంలేదన్నారు. కంచ గచ్చిబౌలిలోని వృక్ష, జంతుజాలాలకు సంబంధించిన ఒక నివేదికను బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. ఈ భూముల్లో 233 రకాలకుపైగా అరుదైన పక్షిజాతులు, 200కుపైగా జింకలు ఉన్నాయని ఆయన తెలిపారు. అత్యంత అరుదైన 72రకాల వృక్షజాతులకు కంచ గచ్చిబౌలీ చిరునామా అని తెలిపా రు. 2024లో షెడ్యూల్‌ 1 జాబితాకెక్కిన 27రకాల పక్షులు, ఉడుములు, కొండచిలువలు, నక్షత్రతాబేలు, నాలుగు కొమ్ముల జింక తదితర 4రకాల జంతువులు ఉన్నాయని పేర్కొన్నారు. వాటికి ఎలాంటి నష్టం తలపెట్టినా చట్టరీత్యా నేరమని గుర్తుచేశారు.


కంచ గచ్చిబౌలిలోని 400ఎకరాల భూమి చట్టపరంగా తెలంగాణ ప్రభుత్వానిదే కావచ్చని, అయితే నైతికంగా హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయానిదే’’ అని ప్రముఖ సామాజిక వేత్త ఆచార్య హరగోపాల్‌ వ్యాఖ్యానించారు. అనేక జీవజాతులకు, వృక్షసంపదకు ఆలవాలమైన ఆ భూమిని యాభై ఏళ్లుగా పరిరక్షిస్తున్నది హెచ్‌సీయూనే చెప్పారు. ఇప్పటికి దాన్ని కాపాడడానికి వర్సిటీ విద్యార్థులు నిద్రాహారాలు మాని మరీ పోరాడుతున్నారని చెప్పారు. హెచ్‌సీయూ విశ్రాంత ఆచార్యుడు నరసింహారెడ్డి మాట్లాడుతూ భూములను కాంక్రీట్‌ జంగిల్‌గా మారిస్తే ఇక నగరం నిప్పుల కుంపటిని తలపిస్తుందనడంలో సందేహంలేదని హెచ్చరించారు. కంచగచ్చిబౌలి భూముల వేలానికి వ్యతిరేకంగా 1.20లక్షలమందికిపైగా పౌరులు ఆన్‌లైన్‌ పిటీషన్‌లో సంతకాలు చేసినట్లు సేవ్‌ సిటీ ఫారెస్ట్‌ ప్రతినిధి శశి తెలిపారు.

Updated Date - Apr 03 , 2025 | 06:01 AM