Share News

Heatwave: భానుడి భగభగ..

ABN , Publish Date - Mar 16 , 2025 | 05:32 AM

రాష్ట్రంపై భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సాధారణం కన్నా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడంతో పగటిపూట బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు.

Heatwave: భానుడి భగభగ..

  • ఆదిలాబాద్‌ జిల్లా పిప్పల్‌ధరిలో 40.8డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వడదెబ్బతో మహిళ మృతి

  • ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందన్న వాతావరణశాఖ

ఆదిలాబాద్‌ /హనుమకొండ/ పినపాక/ కరీంనగర్‌, మార్చి 15: రాష్ట్రంపై భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సాధారణం కన్నా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడంతో పగటిపూట బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. శనివారం ఆదిలాబాద్‌ జిల్లా పిప్పల్‌ ధరిలో అత్యధికంగా 40.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదవగా, కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 40.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. జనగామ, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో 40.6, నిజామాబాద్‌, ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 40.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవగా, జగిత్యాల జిల్లాలో 40.3, హనుమకొండ జిల్లాలో 40.2, వరంగల్‌ జిల్లాలో 39.01, కామారెడ్డి జిల్లాలో 39.7, మహబూబాబాద్‌ జిల్లాలో 39.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


కాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని పోతురెడ్డిపల్లి గ్రామంలో వడదెబ్బ తగిలి తాటి రత్తాలు (55) అనే మహిళ మృతి చెందింది. తన చెల్లెలి కుమార్తె పెళ్లి సందర్భంగా మూడు రోజులపాటు వివాహ ఆహ్వాన పత్రికలు పంచేందుకు బంధువుల ఇళ్లకు తిరగడంతో వాంతులు, విరోచనాలతో ఆమె స్పృహ తప్పిపడిపోయిందని, ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించిందని బంధువులు తెలిపారు. రానున్న రెండు మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా వడ దెబ్బకు గురికాకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.

Updated Date - Mar 16 , 2025 | 05:32 AM