Share News

Faheem Qureshi: వక్ఫ్‌ సవరణను ఉపసంహరించుకోవాలి

ABN , Publish Date - Apr 15 , 2025 | 04:37 AM

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్‌ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం.. వివక్షాపూరితమని మైనారిటీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీజీఎంఆర్‌ఈఐఎస్‌) ఉప చైర్మన్‌ ఫహీం ఖురేషీ తెలంగాణ ఫుడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎంఏ ఫహీం అన్నారు.

Faheem Qureshi: వక్ఫ్‌ సవరణను ఉపసంహరించుకోవాలి

  • అది రాజ్యాంగ విరుద్ధం.. వివక్షాపూరితం

  • టీజీఎంఆర్‌ఈఐఎస్‌ ఉప చైర్మన్‌ ఫహీం ఖురేషీ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్‌ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం.. వివక్షాపూరితమని మైనారిటీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీజీఎంఆర్‌ఈఐఎస్‌) ఉప చైర్మన్‌ ఫహీం ఖురేషీ తెలంగాణ ఫుడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎంఏ ఫహీం అన్నారు. ఈ చట్టాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సెంట్రల్‌ వక్ఫ్‌ కౌన్సిల్‌కు నామినేట్‌ చేసే ముగ్గురు ఎంపీలు, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారుల్లో ముస్లిమేతరులను నియమించుకోవచ్చన్న నిబంధన.. బీజేపీ ప్రభుత్వ ఉద్దేశాన్ని తెలియజేస్తుందన్నారు. ఇది మతపరమైన అంశాల్లో జోక్యంగా ముస్లిం సమాజం భావిస్తోందని తెలిపారు. ఈ మేరకు ఫహీం ఖురేషీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముస్లింల సంక్షేమం, మతపరమైన వ్యవహారాలు, విద్య, సాంస్కృతిక అంశాలు, దాతృత్వ, వైద్య సేవలు తదితరాల కోసం పూర్వీకులు తమ భూములను వక్ఫ్‌కు దానంగా ఇచ్చారని వివరించారు. వక్ఫ్‌ పేరుతో నోటి మాటగా దానం ఇచ్చిన భూములను కూడా నిరూపించుకోవాల్సిన పరిస్థితిని కొత్త చట్టం కలిగి ఉండటం విచారకరమన్నారు. వక్ఫ్‌కు దానం ఇవ్వాలనుకుంటున్న వ్యక్తి తప్పనిసరిగా ఐదేళ్ల పాటు ముస్లింగా ఉండాలన్న నిబంధన.. లౌకిక భారత దేశంలో విచిత్రంగా ఉందన్నారు. సదుద్దేశంతో ఇచ్చే దానానికి కూడా మతాన్ని ముడిపెట్టడం సమంజసం కాదన్నారు. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్‌ ఇప్పటికే పెద్దఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించిందని, ఈ సవరణ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయవద్దని సీఎం రేవంత్‌రెడ్డిని కూడా కోరామని తెలిపారు. నిజంగా ముస్లింల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే.. కేంద్ర మంత్రివర్గంలోగానీ, బీజేపీ తరఫున లోక్‌సభ ఎంపీల్లో గానీ ఒక్క ముస్లిమైనా ఎందుకు లేరని ఖురేషీ ప్రశ్నించారు.


మతపరంగా లబ్ధి పొందేందుకే

కేవలం మతం ఆధారంగా ప్రజలను విభజించి ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే వక్ఫ్‌ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారని రాష్ట్ర ఫుడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎం.ఏ.ఫహీం విమర్శించారు. మత రాజకీయాలు చేయడమే బీజేపీ పని అని అన్నారు. దశాబ్దాల నుంచి ఉన్న చట్టాలను, దూరదృష్టితో పాలకులు తీసుకొచ్చిన చట్టాలను ఇష్టానుసారంగా మార్చేయడం గర్హనీయమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

- ఎం.ఏ.ఫహీం, ఫుడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌

Updated Date - Apr 15 , 2025 | 04:37 AM