Indiramma Houses: ఇంటికి పైసలు రెడీ

ABN, Publish Date - Apr 07 , 2025 | 05:15 AM

రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ముందడుగు వేసింది. బేస్‌మెంట్‌ దశ వరకు నిర్మించిన ఇళ్ల లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించేందుకు హడ్కో నుంచి రూ.3 వేల కోట్ల రుణం తీసుకోగా, నిర్మాణం కొనసాగించేందుకు ఎస్‌హెజీల రుణాలు అందిస్తున్నాయి

Indiramma Houses: ఇంటికి పైసలు రెడీ

ఇందిరమ్మ ఇళ్లకు రూ.3 వేల కోట్లు

హడ్కో నుంచి రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ రుణం

బేస్‌మెంట్‌ పూర్తి చేసిన వారికి త్వరలో ఆర్థిక సాయం

మొదటి దశ కింద రూ.లక్ష చొప్పున అందజేత

బేస్‌మెంట్‌ దాకా కూడా నిర్మించుకునే స్థోమత లేని

వారికి ఎస్‌హెచ్‌జీల రుణాలు ఇప్పించే ఏర్పాట్లు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ముందడుగు పడింది. తొలివిడతలో ఇళ్లు మంజూరై బేస్‌మెంట్‌ వరకు నిర్మించుకున్న లబ్ధిదారులకు అందించే మొదటి దశ ఆర్ధిక సాయానికి అవసరమైన నిధులను ప్రభుత్వం సిద్ధం చేసింది. రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఇందుకోసం హడ్కో నుంచి రూ.3 వేల కోట్ల రుణం తీసుకుంది. ప్రస్తుతానికి ఆ నిధులు హడ్కో దగ్గరేఉన్నాయి. బేస్‌మెంట్‌ వరకు నిర్మించిన ఇళ్ల వివరాలన్నీ కార్పొరేషన్‌కు చేరాక హడ్కో నుంచి నిధులను తీసుకుని లబ్ధిదారులకు అందించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల ఆర్థిక సాయాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కానీ ప్రతిష్టాత్మక పథకం కావడంతో.. ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి కొందరికి చెక్కులు ఇవ్వాలని, మిగతా వారికి ఖాతాల్లో జమచేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. మొదటి దశ కింద రూ.లక్ష చొప్పున ఆర్ధిక సాయం అందిస్తారు.


క్షేత్రస్థాయిలో వేగంగా పరిశీలన..

రాష్ట్రవ్యాప్తంగా బేస్‌మెంట్‌ వరకు పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఫొటోలు తీసి, జియో ట్యాగింగ్‌ చేస్తూ ఆన్‌ లైన్‌లో నమోదు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం సాయంత్రం వరకు 1,265 ఇళ్ల వివరాలను అప్‌లోడ్‌ చేశారు.

నిర్మాణం కోసం ఎస్‌హెచ్‌జీల రుణం

బేస్‌మెంట్‌ దశ వరకు కూడా ఇళ్లను నిర్మించుకోలేని పలువురు లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) ద్వారా ప్రభుత్వం రుణాలను ఇప్పించింది. ఇందుకు సంబంధించి ఖమ్మం జిల్లా పాలేరులో కొందరు లబ్ధిదారులకు రుణం కింద రూ.లక్ష అందించారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇలా రుణాలు అందేలా చూడాలని హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ జిల్లాల కలెక్టర్లకు సర్క్యులర్‌ పంపారు. ఇటీవల జరిగిన అడిషనల్‌ కలెక్టర్ల సమావేశంలోనూ దీనిపై సూచన చేశారు. సెర్ప్‌ సీఈవోకు కూడా ఈ రుణాల విషయంలో సహకరించాలంటూ లేఖ పంపారు. బేస్‌మెంట్‌ పూర్తయ్యాక అందించే ఆర్ధిక సాయాన్ని లబ్ధిదారుల ఆమోదంతో.. ఎస్‌హెచ్‌జీలకు తిరిగి చెల్లించనున్నారు.


పీఎంఏవై రూరల్‌ కింద రాష్ట్రానికి ఇళ్లు..!

ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) కింద రాష్ట్రానికి ఇళ్లను మంజూరు చేసే అంశంపై చిక్కుముడులు వీడుతున్నట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కేంద్రం అమలుచేసే పీఎంఏవై పథకానికి అనుసంధానం చేసి, నిధులు పొందాలని భావించింది. పీఎంఏవైతో రాష్ట్ర పథకాన్ని అనుసంధానించాలంటే.. కేంద్రం రూపొందించిన ఆవాస్‌ ఫ్లస్‌ యాప్‌తో సర్వే చేసి, లబ్ధిదారుల వివరాలను పొందుపర్చాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా రూపొందించిన యాప్‌తో సర్వే చేసి, లబ్ధిదారులను ఎంపిక చేసింది. దీనితో ఇళ్లు మంజూరు చేయడానికి కేంద్రం అంగీకరించలేదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చలు జరిపినా ఇటీవలి వరకు స్పష్టత రాలేదు. తాజాగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్‌.. రాష్ట్ర హౌసింగ్‌ కార్పోరేషన్‌తోపాటు పలు శాఖలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పీఎంఏవై రూరల్‌ కింద రాష్ట్రానికి ఇళ్లను మంజూరు చేయాలన్న విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. రాష్ట్రం రూపొందించిన యాప్‌, అందులో పొందుపర్చిన దరఖాస్తుదారుల వివరాలు, ప్రభుత్వం నిర్వహించిన సర్వే వివరాలన్నింటినీ తమకు సమర్పించాలని సూచించినట్టు సమాచారం. మరోవైపు పీఎంఏవై అర్బన్‌ కింద కేంద్రం ఇప్పటికే రాష్ట్రానికి 1.13 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. కేంద్రం రూరల్‌ స్కీం కింద ఇళ్లకు రూ.72 వేలు, అర్బన్‌ స్కీం కింద రూ.1.5లక్షల చొప్పున ఆర్ధిక సాయం అందిస్తుంది.


నిదానంగా ఇళ్ల నిర్మాణాలు

ప్రభుత్వం జనవరి 26న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా 71వేల మందిని ఎంపిక చేసింది. వీరిలో 44,616 ఇళ్లకు మంజూరు పత్రాలు అందించారు. ఇప్పటివరకు 13,222 ఇళ్లకు మాత్రమే ముగ్గులు పోయగా (మార్కవుట్‌ చేయగా).. మరో 1,250 ఇళ్లు బేస్‌మెంట్‌ దశను పూర్తిచేసుకున్నాయి. మొత్తానికి రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిదానంగా సాగుతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వ్యవసాయ పనులతో, మంచి ముహుర్తాలు లేకపోవడంతోపాటు బేస్‌మెంట్‌ వరకు కూడా నిర్మించుకునేందుకు లబ్ధిదారులకు ఆర్ధిక స్థోమత లేకపోవడమే దీనికి కారణమని అధికారుల పరిశీలనలో తేలింది. ఈ నెల 9 తరువాతి నుంచి మంచి ముహుర్తాలు ఉండడం, ఎస్‌హెచ్‌జీల ద్వారా రుణాలు ఇప్పించే చర్యలతో ఇళ్ల నిర్మాణం వేగవంతం అవుతుందని అంచనా వేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

HCU Land: హెచ్‌సీయూ వివాదంలో నిజాలు ప్రచారం చేయండి

No Exam: ఈ అర్హత చాలు.. పరీక్ష లేకుండా ఉద్యోగం.. నెలకు రూ. 2 లక్షల జీతం

Water Conflict: నీటి పంచాయతీ.. అధికారులతో ఉత్తమ్ కీలక భేటీ

Healthy Soup: ఈ సూప్‌తో మీ శరీరంలో కొన్ని భాగాలకు ఊహించని శక్తి పక్కా

Cotton Clothing: కాటన్ దుస్తులు.. ఒరిజినలా? కాదా? ఎలా గుర్తించాలంటే..

Fake Cardiologist: ఏడుగురి ఉసురు తీసిన వైద్యుడు.. విచారణకు రంగం సిద్ధం

శ్రీలీలకి చేదు అనుభవం.. చెయ్యి పట్టుకుని లాగిన యువకులు

కేసు No.62.. సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్ పై విచారణ

For Telangana News And Telugu News

Updated Date - Apr 07 , 2025 | 05:15 AM