Food Adulteration: ఆహార కల్తీలో దక్షిణాదిలో తెలంగాణకు రెండో స్థానం
ABN, Publish Date - Apr 07 , 2025 | 05:20 AM
దేశంలో ఆహార కల్తీ రోజురోజుకి పెరిగిపోతూ ఆందోళన కలిగిస్తోంది. ఆహార భద్రత అధికారులు గత నాలుగేళ్లలో దేశ వ్యాప్తంగా సేకరించిన ఆహార నమూనాల్లో సగటున 22 శాతం కల్తీవే ఉన్నాయి.

నాలుగేళ్లలో సేకరించిన ఆహార నమూనాల్లో సగటున 14 శాతం కల్తీ
58 శాతంతో దేశంలోనే యూపీ టాప్
కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడి
హైదరాబాద్, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఆహార కల్తీ రోజురోజుకి పెరిగిపోతూ ఆందోళన కలిగిస్తోంది. ఆహార భద్రత అధికారులు గత నాలుగేళ్లలో దేశ వ్యాప్తంగా సేకరించిన ఆహార నమూనాల్లో సగటున 22 శాతం కల్తీవే ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించిన లెక్కలు భయపెడుతున్నాయి. 2021-24 మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా సేకరించిన ఆహార పదార్థాల నమూనాలు, అందులో కల్తీగా తేలిన నమూనాల లెక్కలను రాష్ట్రాల వారీగా ఆ శాఖ ఇటీవల పార్లమెంట్‌కు నివేదించింది. దీని ప్రకారం.. ఆహార కల్తీలో తెలంగాణ దక్షిణాది రాష్ట్రాల్లో రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణలో గత నాలుగేళ్ల సగటు 14 శాతంగా ఉంది. అంటే తెలంగాణలో సేకరించి పరీక్షించిన ప్రతీ 100 నమూనాల్లో 14 వరకు కల్తీ ఆహారంగా తేలుతున్నాయి. ఇక, ఆహార కల్తీలో తమిళనాడు 20 శాతం సగటుతో దక్షిణాది రాష్ట్రాల్లోనే అగ్రస్థానంలో ఉంది. తెలంగాణ రెండో స్థానంలో ఉండగా.. కేరళలో 13.11 శాతం, ఆంధ్రప్రదేశ్ 9 శాతం, కర్ణాటక 6.30 శాతంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
వామ్మో.!! యూపీ
ఆహార కల్తీలో ఉత్తరప్రదేశ్(యూపీ) దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. యూపీలో గత నాలుగేళ్లల్లో 93,182 ఆహార నమూనాలు సేకరించగా, అందులో 54,474 నమూనాల(58.75 శాతం)లో కల్తీని గుర్తించారు. యూపీ తర్వాత ఝార్ఖండ్ 49.91 శాతం, హరియాణా 27.48 శాతం, రాజస్థాన్ 26.28 శాతం సగటుతో ఆహారకల్తీలో వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గత నాలుగేళ్ల జాతీయ సగటు 22 కంటే ఈ రాష్ట్రాల్లో చాలా ఎక్కువగానే ఆహార పదార్థాల కల్తీ ఉండడం గమనార్హం. కాగా కలుషితమైన తాగునీరు, ఆహార పదార్థాల వల్ల మనుషులు 200 రకాలకు పైగా వ్యాధులు బారినపడే అవకాశం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
దేశంలో ఆహార కల్తీ ఇలా..
సంవత్సరం శాంపిల్స్ కల్తీ(%)
2024-25 72,110 14,783 20.50
2023-24 1,70,513 33,808 19.82
2022-23 1,77,511 44,625 25.13
2021-22 1,42,584 32,930 23.09
(సెప్టెంబరు నాటికి)
తెలంగాణలో ఇలా...
సంవత్సరం శాంపిల్స్ కల్తీ(%)
2024-25 1660 167 10.1
2023-24 6156 973 15.81
2022-23 4809 894 18.59
2021-22 3077 353 11.47
(సెప్టెంబరు నాటికి)
Updated Date - Apr 07 , 2025 | 05:20 AM