Duvvuri Subbarao: పేదలను గుర్తుంచుకుని నిర్ణయాలు
ABN, Publish Date - Jan 26 , 2025 | 04:49 AM
పేద ప్రజలను గుర్తుంచుకుని నిర్ణయాలు తీసుకోవాలనే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సలహా ఎప్పటికీ ఆచరణీయమని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు.
మన్మోహన్ సింగ్ సలహా ఎప్పటికీ ఆచరణీయమే
సంస్కరణల వెనక ఐఎంఎఫ్ ఒత్తిడి లేదు
పరిపాలనా సంస్కరణలు కూడా రావాలి
ఎన్టీఆర్ హయాంలో చాలా నేర్చుకున్నాను
హైదరాబాద్ సాహితీ మహోత్సవంలో ఆర్‌బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు
‘జస్ట్ ఏ మెర్సినరీ’ పుస్తకంపై సంభాషణ
హైదరాబాద్ సిటీ, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): పేద ప్రజలను గుర్తుంచుకుని నిర్ణయాలు తీసుకోవాలనే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సలహా ఎప్పటికీ ఆచరణీయమని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. తాను ఆర్బీఐ గవర్నర్‌గా వెళ్లే ముందు మన్మోహన్ ఈ సలహా ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలో పనిచేయడం జీవితపాఠాలు నేర్పిందని దువ్వూరి చెప్పారు. హైదరాబాద్ సాహితీ మహోత్సవంలో తాను రచించిన ‘జస్ట్ ఏ మెర్సినరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్’ పుస్తకం గురించి మాట్లాడటానికి ఆయన వచ్చారు. రచయిత సుచిత్ర షెనాయ్‌తో జరిపిన సంభాషణలో పలు అంశాలపె మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
‘జస్ట్ ఏ మెర్సినరీ’ అనే పేరు ఎందుకంటే..
మనం మన దేశం గురించి ఎన్నో ఫిర్యాదులు చేస్తుంటాం. సమానత్వం లేదని, పేద-ధనిక తేడాలని.. ఇలా ఎన్నో! అందుకు నేనూ మినహాయింపు కాదు. కానీ, నా జీవితం, కెరీర్‌ను ఓసారి తరచి చూస్తే ఈ దేశం తనకు ఎంతో ఇచ్చిందని తెలుసుకున్నాను. ప్రభుత్వ స్కాలర్‌షి్‌పతో సైనిక్ స్కూల్‌లో, తరువాత ఐఐటీలో చదివాను. కలెక్టర్‌గా తొలి ఉద్యోగం చేశాను. తరువాత ఆర్థిక శాఖ కార్యదర్శిగా, ఆర్‌బీఐ గవర్నర్ పనిచేశాను. ప్రతిచోటా ప్రభుత్వం తనకు అవకాశం ఇచ్చింది. తన విధులను సాధ్యమైనంత మేర సక్రమంగానే నిర్వర్తించాను. అయితే సమాజానికి తాను తిరిగి సక్రమంగా ఇవ్వగలిగానా అనేది నన్ను ఇప్పటికీ వేధిస్తున్న ప్రశ్న. అందుకే ఈ పుస్తకానికి ’జస్ట్ ఏ మెర్సినరీ’ అనే పేరు పెట్టాను.
మన్మోహన్ మాటలు తర్వాత అర్థమయ్యాయి
మన్మోహన్ సింగ్‌కు ఫైనాన్స్ సెక్రటరీగా కొన్నాళ్లు పనిచేశాను. అంతకు ముందు 1991లో ఆర్థిక సంసంస్కరణల వేళ కూడా ఆయనతో ఉన్నాను. ఆ తరువాత ఆర్‌బీఐ గవర్నర్‌గా ఆయన హయాంలోనే నియమితుడయ్యాను. ఆయనకు ధన్యవాదాలు చెప్పడానికి వెళ్లినప్పుడు, ‘గతంలో మీరు ఆర్‌బీఐ గవర్నర్‌గా చేశారు. ఆ అనుభవంతో నాకేమైనా సలహా ఇస్తారా’ అని అడిగాను. దానికి ఆయన.. ‘మీరు ప్రభుత్వంలో 35 సంవత్సరాలు పనిచేశారు. కాబట్టి వాస్తవ పరిస్థితులు ఏమిటో తెలుసు. ఆర్‌బీఐలో కూడా మీకు ఎలా అనిపిస్తే అలానే చేయండి. కానీ ఆర్‌బీఐ విభిన్న ప్రపంచం, సంస్థ. మీరు అక్కడ ఎప్పుడూ వడ్డీ రేటు, ద్రవ్యోల్బణం, నగదు సరఫరా లాంటి మాటలే వింటారు. కానీ వాటి వెనుక ఉన్న ప్రజలను మరిచిపోతారు. కాబట్టి పేద ప్రజలను గుర్తుంచుకుని మీ నిర్ణయాలు తీసుకోండ’ని సూచించారు. ఐఏఎ్‌సగా నా 35 ఏళ్ల కెరీర్‌లో ఎన్‌టీఆర్ హయాంలో పనిచేయడం మరిచిపోలేని అనుభవం. 250 మంది ఐఏఎస్ అధికారులు ఉంటే నన్ను ఎంపిక చేసి ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు.
ఐఎంఎఫ్ ఒత్తిడిఉందనడం తప్పు
1991లో ఆర్ఘిక సంస్కరణలను అంతర్జాతీయ ద్రవ్య సంస్థ (ఐఎంఎఫ్) ఒత్తిడితో తీసుకున్నారని చాలామంది విమర్శించారు. అది తప్పు. అన్ని రంగాల్లో.. ముఖ్యంగా పరిపాలనా సంస్కరణలు అవసరం. ఐఏఎస్ అధికారులు రాజకీయ నాయకులను అర్థం చేసుకోవాలి. ‘చాలా చేద్దామనుకున్నాను. రాజకీయ నాయకులు చేయనీయడం లేద’ని ఎవరైనా అంటే ఆ కథలు నమ్మవద్దు. రాజకీయ నాయకులది మాత్రమే తప్పు కాదు. నేను మండలస్థాయి అధికారుల నుంచి ప్రధాని వరకూ కలిసి పనిచేశాను.
Updated Date - Jan 26 , 2025 | 04:49 AM