నవ్వుతూ మాట్లాడి.. సైకోలా మారి
ABN , Publish Date - Apr 03 , 2025 | 05:17 AM
రంజాన్ రోజు జర్మనీ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ మహమ్మద్ అబ్దుల్ అస్లాంకు నేరచరిత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

జర్మనీ యువతి రేప్‌కేసు నిందితుడు అస్లాం తీరు
టూరిస్టులను ఆకట్టుకోవడంలో దిట్ట
గంజాయి.. మత్తు పదార్థాలకు బానిస
2018లోనే బాలికపై అత్యాచారం
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): రంజాన్ రోజు జర్మనీ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ మహమ్మద్ అబ్దుల్ అస్లాంకు నేరచరిత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కారులో విదేశీ యువతిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన అస్లాం.. అప్పటి వరకూ నవ్వుతూ మాట్లాడి.. అంతలోనే సైకోగా మారాడని బాధిత యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది. దుబాయ్‌లో డ్రైవర్‌గా పనిచేసిన అస్లాం.. విదేశీ పర్యాటకులను ఆకట్టుకోవడంలో దిట్ట అని పోలీసులు చెబుతున్నారు. వేర్వేరు దేశాల వారిని.. వారి మాతృభాషలో పలకరిస్తూ.. బుట్టలో వేసుకుంటాడని వివరించారు. విదేశీ యువతిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాక.. ఒక్కసారిగా సైకోగా మారాడని, అసభ్యంగా ప్రవర్తించాడన్నారు. చెప్పినట్లు వినకుంటే చంపేస్తానని బెదిరించి.. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డట్లు తెలిపారు. గంజాయి, డ్రగ్స్‌కు బానిసైన అస్లాం.. 2018లోనే ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పోక్సో కేసులో కొన్నాళ్లు జైలులో ఉన్నాడు. 2021లో ఆ కేసును కొట్టివేసినట్లు తెలిసింది. అస్లాంపై గొడవలు, ఈవ్‌టీజింగ్ కేసులు నమోదైనట్లు సమాచారం. డబ్బు అవసరమున్నప్పుడు దుబాయ్ వెళ్తాడని, అక్కడ ఎంతోకొంత సంపాదించాక.. తిరిగి హైదరాబాద్‌కు వస్తాడని పోలీసులు గుర్తించారు. అస్లాం తండ్రి అజీమ్.. మజ్లిస్ పార్టీ స్థానిక నేత అని తెలిసింది.
జర్మనీ ఎంబసీకి నివేదిక!
బాధిత యువతి గురువారం తన స్వదేశానికి వెళ్లిపోవడానికి సిద్ధమైనట్లు తెలిసింది. దీంతో పోలీసులు ఆమెను బుధవారం మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారని, జడ్జి ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు ఈ కేసులో సేకరించిన సీసీకెమెరా ఫుటేజీలు, ఇతర అంశాలతో ఓ సమగ్ర నివేదికను రాచకొండ సీపీకి అందజేశారు. ఆ నివేదికను పరిశీలించిన సీపీ.. దాన్ని సీఐడీ విభాగానికి పంపారు. సీఐడీ అధికారులు ఆ నివేదిక ప్రతిని చెన్నైలో ఉండే జర్మనీ ఎంబసీకి అందజేస్తారని తెలిసింది.