Share News

Food Safety: ఆహార భద్రతా అధికారులకు టార్గెట్లు

ABN , Publish Date - Apr 09 , 2025 | 04:25 AM

రాష్ట్ర రాజధానిలో ఆహారభద్రతా ప్రమాణాల విషయాన్ని ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణించింది. ఆహార ఉత్పత్తులు, హోటళ్లలో తీసే నమూనాల సంఖ్యను మరింత పెంచాలని నిర్ణయించింది.

Food Safety: ఆహార భద్రతా అధికారులకు టార్గెట్లు

  • ఇక ప్రతి నెలా 25 శాంపిళ్లు తీయాల్సిందే

  • నమూనాల పరీక్షల సంఖ్య భారీగా పెంపు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధానిలో ఆహారభద్రతా ప్రమాణాల విషయాన్ని ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణించింది. ఆహార ఉత్పత్తులు, హోటళ్లలో తీసే నమూనాల సంఖ్యను మరింత పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆహార భద్రతా అధికారుల (ఎఫ్‌ఎ్‌సవో)కు టార్గెట్లను విధించింది. ఇక ప్రతి ఆహార భద్రతా అధికారి తన పరిఽధిలో విధిగా ప్రతి నెలా 25 శాంపిళ్లను తీయాలని తేల్చి చెప్పింది. మంగళవారం ఫుడ్‌సేఫ్టీ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోనల్‌ కమిషనర్లతో ఆహారభద్రతా ప్రమాణాలపై సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లో ఆహార భద్రతా దికారులు నెలకు అరకొరగా ఐదారు శాంపిళ్లనే తీస్తున్నట్లుగా గుర్తించి వారికి ప్రతినెలా 25 నమూనాలు తీసి, పరీక్షలకు పంపాలని టార్గెట్‌ను పెట్టారు. 2023-24లో రాష్ట్రవ్యాప్తంగా కేవలం 6,156 నమూనాలను సేకరించగా, అందులో 16 శాతం శాంపిళ్లను కల్తీగా గుర్తించారు.


ఆ సంఖ్యను మరింత పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా, ఆహార భద్రతా విభాగాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు కమిషనర్‌ కర్ణన్‌ వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ పరిఽధిలోని ఆరుజోన్లలో ఆరు మినిల్యాబులను ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో అందుకు అవసరమైన ప్రదేశాలను వెంటనే గుర్తించాలని కమిషనర్‌ ఆదేశించారు. హైదరాబాద్‌ పరిధిలో పెరుగుతోన్న ఆహార వ్యాపార వ్యవహారాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌ విభాగాలను నేరుగా పర్యవేక్షించే అధికారాన్ని కూడా జోనల్‌ కమిషనర్లకే అప్పగిస్తున్నట్లు ఫుడ్‌సేఫ్టీ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌ తెలియజేశారు.

Updated Date - Apr 09 , 2025 | 04:25 AM