Harish Rao: మీ నిర్లక్ష్యం.. విద్యార్థులకు శాపం!
ABN , Publish Date - Apr 12 , 2025 | 04:15 AM
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రారంభించిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ (బీఏఎస్) పథకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం శోచనీయమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

విద్యకు ప్రాధాన్యమన్నవి కేవలం మాటలేనా?
సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్ లేఖ
హైదరాబాద్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రారంభించిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ (బీఏఎస్) పథకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం శోచనీయమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ పథకం కింద 150 స్కూళ్లకు నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులకు, యాజమాన్యాలకు పెను శాపంగా మారిందని చెప్పారు. బీఏఎస్ నిధుల విడుదలపై తక్షణమే స్పందించాలని కోరుతూ ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. సరైన భోజనం, వసతి, ఇతర సౌకర్యాల్లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పాఠశాలల యాజమాన్యాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నాయన్నారు.
విద్యకు అధిక ప్రాధాన్యమంటూ మీరు చెబుతున్నవి కేవలం మాటలేనని ఈ నిర్లక్ష్య వైఖరితో స్పష్టమవుతోందని తన లేఖలో పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2023-24 విద్యా సంవత్సరానికిగాను రూ.130 కోట్లు కేటాయించిందని, ఇందులో తొలి విడత రూ.50 కోట్లు విడుదల చేయగా.. రెండో విడత నిధులు విడుదల చేసే సమయానికి ఎన్నికల కోడ్ వచ్చిందని గుర్తుచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రూ.80 కోట్లను విడుదల చేయలేదని, 2024-25కు సంబంధించిన నిధులనూవిడుదల చేయలేదని తెలిపారు. గత ఆగస్టులో ఉపముఖ్యమంత్రి భట్టికి లేఖ రాసినా పరిష్కరించలేదన్నారు. బీఏఎస్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని సీఎంని కోరారు.