HCU: సుప్రీంకోర్టు స్టేతో హెచ్‌సీయూలో విద్యార్థుల సంబరాలు

ABN, Publish Date - Apr 04 , 2025 | 04:08 AM

కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేత, చదును చేయడం వంటి పనులను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు.

HCU: సుప్రీంకోర్టు స్టేతో హెచ్‌సీయూలో విద్యార్థుల సంబరాలు

ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించిన విద్యార్థి సంఘాలు

  • భూముల విధ్వంసాన్ని పరిశీలించిన హైకోర్టు రిజిస్ట్రార్‌

  • విద్యార్థులకు సంఘీభావంగా బీజేవైఎం ర్యాలీ

హైదరాబాద్‌ సిటీ నెట్‌వర్క్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేత, చదును చేయడం వంటి పనులను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో తమ ఆందోళనను విరమిస్తున్నట్లు యూనివర్సిటీ స్టూడెంట్స్‌ యూనియన్‌ నేతలు ప్రకటించారు. నిరాహార దీక్షను విరమించినట్లు విద్యార్థులు ప్రకటించారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ప్రాంతాన్ని వన్యప్రాణులకు ఆవాసంగా అభివృద్ధి చేయాలన్నారు. అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు.


హెచ్‌సీయూకు వచ్చిన హైకోర్టు రిజిస్ర్టార్‌

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు రిజిస్ర్టార్‌ హెచ్‌సీయూకు వచ్చారు. సుమారు 5 కిలోమీటర్ల మేర కాలినడకన పర్యటించి భూములకు సంబంధించిన వివరాలను సేకరించారు. అంతకు ముందు బారికేడ్లు అడ్డుపెట్టి విద్యార్థులను ఈస్ట్‌ క్యాంపస్‌ వైపు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు.. హైకోర్టు రిజిస్ర్టార్‌ రాకతో వాటిని తొలగించారు. జేసీబీలు కూడా అక్కడి నుంచి మాయమయ్యాయి. విద్యార్థి సంఘం నాయకులు, పలువురు ప్రొఫెసర్లతో కలిసి ముష్రూమ్‌ రాక్స్‌ ఉన్న భూముల వద్దకు హైకోర్టు రిజిస్ర్టార్‌ వెళ్లారు. ప్రభుత్వం ధ్వంసం చేసిన ప్రదేశాన్ని పరిశీలించారు. విద్యార్థులు, ప్రొఫెసర్లు చెప్పిన పలు అంశాలను ఓపికగా విన్న హైకోర్టు రిజిస్ర్టార్‌ అన్ని విషయాలను నోట్‌ చేసుకున్నారు. హైకోర్టు రిజిస్ర్టార్‌ వెళ్లిపోగానే పోలీసులు తిరిగి ఆ ప్రదేశాన్ని చుట్టుముట్టారు.


హెచ్‌సీయూలో కొనసాగిన నిరసనలు

హెచ్‌సీయూలో విద్యార్ధి సంఘాలు గురువారం కూడా ఆందోళనలను కొనసాగించాయి. యూనివర్సిటీ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు నల్లరిబ్బన్లు మెడలో వేసుకొని రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. అఖిలభారత విద్యార్థి పరిషత్‌ ’ఛలో హెచ్‌సీయూ‘కు పిలుపునిచ్చింది. వర్సిటీ చిన్నగేటు నుంచి ఏబీవీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో యూనివర్సిటీలోకి వచ్చారు. హెచ్‌సీయూ భూముల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే అసెంబ్లీని, సీఎం ఇంటిని ముట్టడిస్తామని ఏబీవీపీ నేతలు హెచ్చరించారు. రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థులను, ఏబీవీపీ నేతలను అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీ్‌సస్టేషన్‌కు బస్సుల్లో తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. కాగా, హెచ్‌సీయూ భూముల వేలం నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోకపోతే సెక్రటేరియట్‌ను ముట్టడిస్తామని బీజేవైఎం నేతలు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ మీర్‌పేట్‌ చౌరస్తాలో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు చింతల రాఘవేందర్‌ ముదిరాజ్‌ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. హెచ్‌సీయూ విద్యార్థులు చేపట్టిన నిరసనకు మద్దతు తెలిపేందుకు గురువారం బీజేపీ చలో హెచ్‌సీయూకు పిలుపునిచ్చింది. నాగోల్‌ డివిజన్‌ బీజేపీ అధ్యక్షుడు పంగా శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు హెచ్‌సీయూకి వెళ్లేందుకు సిద్ధమవగా, పోలీసులు వారిని హౌస్‌ అరెస్టు చేసి నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. హెచ్‌సీయు భూముల వ్యవహారంపై వామపక్ష విద్యార్ధి సంఘాలు భగ్గుమన్నాయి. ఎస్‌ఎ్‌ఫఐ. పిడిఎ్‌సయు, ఎఐఎ్‌సఎఫ్‌ తదితర విద్యార్ధి సంఘాల ప్రతినిధులు సచివాలయాన్ని ముట్టడించేందుకు విఫల యత్నం చేశారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య 47మంది విద్యార్ధులను అరెస్టు చేసి సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.


ఎన్‌సీసీ గేట్‌ వద్ద సీఎం దిష్టిబొమ్మ దహనం

హెచ్‌సీయూలో భూముల వేలం ఆపాలని, ఓయూలో ధర్నాలు చేయకూడదని ప్రభుత్వం ఇచ్చిన అప్రజాస్వామిక సర్క్యులర్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఓయూ వామపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఈ క్రమంలో గురువారం ఓయూలోని ఎన్‌సీసీ గేటు వద్ద పలువురు విద్యార్థి నాయకులు సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. బీజేవైఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులపై లాఠీచార్జ్‌ను వ్యతిరేకిస్తూ ట్యాంక్‌బండ్‌పై కాగడాల ప్రదర్శన నిర్వహించారు.


బీఆర్‌ఎస్‌ ఐటీసెల్‌ ఇన్‌చార్జీలపై కేసులు

కంచ-గచ్చిబౌలి భూములపై తప్పుడు వీడియోలు సృష్టించి, వాటిని సోషల్‌ మీడియాలో పోస్టులు చేసి హెచ్‌సీయూ విద్యార్థులను తప్పుదోవ పట్టించారంటూ బీఆర్‌ఎస్‌ ఐటీసెల్‌ ఇన్‌చార్జీలు కొణతం దిలీప్‌, డాక్టర్‌ క్రిశాంక్‌లపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ ఎన్‌ఎ్‌సయుఐ నాయకులు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన గోల్డ్, వెండి ధరలు..

వక్ఫ్‌ బిల్లుకు లోక్‌సభ ఓకే

For More AP News and Telugu News

Updated Date - Apr 04 , 2025 | 04:08 AM