High Court: వేళకాని వేళలో సినిమా ప్రదర్శనా?
ABN, Publish Date - Jan 10 , 2025 | 04:57 AM
వేళకాని వేళలో అత్యంత ప్రజాదరణ కలిగిన సినిమాల ప్రదర్శనకు అనుమతివ్వడం ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది.
16 ఏళ్లలోపు పిల్లల పరిస్థితి ఏమిటి?
15 నిమిషాల వ్యవధిలో జనాన్ని ఎలా నియంత్రిస్తారు?
‘గేమ్ చేంజర్’పై పిటిషన్‌లు.. హైకోర్టు ప్రశ్నలు.. నేడూ విచారణ
హైదరాబాద్, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): వేళకాని వేళలో అత్యంత ప్రజాదరణ కలిగిన సినిమాల ప్రదర్శనకు అనుమతివ్వడం ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది. ‘‘తెల్లవారుజామున 4 గంటలకు ప్రదర్శించే సినిమాలకు వెళ్లే 16 ఏళ్లలోపు పిల్లల పరిస్థితి ఏమిటి? వారి ఆరోగ్యంపై చెడు ప్రభావం పడటం ఎంతవరకు సమంజసం?’’ అని నిలదీసింది. 16 ఏళ్ల లోపు పిల్లలను రాత్రివేళ సినిమాలకు రానివ్వకుండా అడ్డుకోవాలని వ్యాఖ్యానించింది. ‘‘రాత్రి సమయాల్లో భారీగా వచ్చే జనాలను అదుపు చేయడం ఎవరి బాధ్యత? పోలీసులపై ఇది అదనపు భారం కాదా?’’ అని ప్రశ్నించింది. ఒక షోకు మరో షోకు మధ్య 15 నిమిషాల వ్యవధి మాత్రమే ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. 15 నిమిషాల వ్యవధిలో వందల మంది వాహనాలను తీసుకుని వెళ్లడం, వందల వాహనాలను పార్కింగ్ చేయడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించింది. ప్రస్తుత పిటిషన్‌లకు ప్రజాప్రయోజన వ్యాజ్య స్వభావం ఉందని, అదనపు షోలు, బెనిఫిట్ షోలు, రేట్లపెంపుపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడింది.
బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని పేర్కొంటూనే గేమ్ ఛేంజర్ సినిమాకు అదనపు షోల ప్రదర్శనకు, టికెట్ల రేట్ల పెంపునకు అనుమతిస్తూ హోంశాఖ ముఖ్యకార్యదర్శి మెమో జారీచేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్‌లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్‌లపై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ల తరఫు న్యాయవాదులు మామిండ్ల మహేశ్, విజయ్‌గోపాల్ తదితరులు వాదిస్తూ తెలంగాణ సినిమా రెగ్యులేషన్ రూల్స్, జీవో 120కి విరుద్ధంగా తెల్లవారుజామున 4 గంటల షోకు అనుమతించడం, లైసెన్సింగ్ అథారిటీలు కాకుండా హోంశాఖ ముఖ్యకార్యదర్శి మెమో జారీచేయడం, టికెట్ల రేట్ల పెంపునకు అంగీకరించడం సరికాదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పుష్ప-2 సినిమా ప్రదర్శన సంఘటనలను ప్రస్తావించారు. షోల ప్రదర్శన మధ్య వ్యవధి లేకపోవడం వల్ల భారీగా వచ్చే జనాలను అదుపు చేయడం కష్టంగా మారుతుందని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. పిల్లల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ పలు ప్రశ్నలు వేసింది. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.
Updated Date - Jan 10 , 2025 | 04:57 AM