Dilshukhnagar Blast: దిల్‌సుఖ్‌నగర్ జంటపేలుళ్లు.. దోషులకు ఉరే సరి
ABN , Publish Date - Apr 09 , 2025 | 03:43 AM
దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో దోషులకు మరణశిక్షే సరి అని హైకోర్టు ధ్రువీకరించింది. ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు వీరికి మరణశిక్ష విధిస్తూ 2016లో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ.. దోషుల్లో పరివర్తన వస్తుందనే విశ్వాసం కనిపించడం లేదని, శిక్షను జీవిత ఖైదుగా మార్చడం వృథా ప్రయాసే అవుతుందని వ్యాఖ్యానించింది.

ఖరారు చేసిన హైకోర్టు ధర్మాసనం
ఎన్‌ఐఏ కోర్టు తీర్పునకు సమర్థన.. దోషుల అప్పీల్ డిస్మిస్
దోషుల్లో పరివర్తన వస్తుందనే విశ్వాసం కనిపించడం లేదు
శిక్షను జీవితఖైదుగా మార్చడం వృథా.. హైకోర్టు ధర్మాసనం
45 రోజుల పాటు 157 మంది సాక్షుల విచారణ
ఆ ఘటన నేటికీ వెంటాడుతున్న పీడకల.. బాధితుల ఆవేదన
హైదరాబాద్, హైదరాబాద్ సిటీ, దిల్‌సుఖ్‌నగర్, చాదర్‌ఘాట్, సరూర్‌నగర్, ఎల్‌బీనగర్, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో దోషులకు మరణశిక్షే సరి అని హైకోర్టు ధ్రువీకరించింది. ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు వీరికి మరణశిక్ష విధిస్తూ 2016లో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ.. దోషుల్లో పరివర్తన వస్తుందనే విశ్వాసం కనిపించడం లేదని, శిక్షను జీవిత ఖైదుగా మార్చడం వృథా ప్రయాసే అవుతుందని వ్యాఖ్యానించింది. ఎన్‌ఐఏ కోర్టు తీర్పుపై దోషులు దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేసింది. మరణ శిక్ష పడ్డ ఉగ్రవాదుల్లో అసదుల్లా అక్తర్ అలియాస్ హద్దీ, జియా-ఉర్-రహ్మాన్ అలియాస్ వఘాస్ అలియాస్ నబీల్ అహ్మద్, మహమ్మద్ తహసీన్ అక్తర్ అలియాస్ హసన్ అలియాస్ మోనూ, యాసిన్ భత్కల్ అలియాస్ షారూఖ్, ఎజాజ్ షేక్ అలియాస్ సమర్ అర్మాన్ తుండే అలియాస్ సాగర్ అలియాస్ ఐజాజ్ సయీద్ షేక్ ఉన్నారు. 2013 ఫిబ్రవరి 21న సాయంత్రం 7 గంటల సమయంలో.. సెకన్ల వ్యవధిలో దిల్‌సుఖ్‌నగర్ 107 బస్టాండ్, సమీపంలోని ఏ1-మిర్చీ సెంటర్ వద్ద రెండు భారీ పేలుళ్లు జరిగి, 18 మంది దుర్మరణంపాలయ్యారు. మరో 131 మందికి గాయాలయ్యాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రియాజ్ భత్కల్ ఇప్పటికీ పరారీలో ఉండగా.. ఏ-2 నుంచి ఏ-6 వరకు ఉన్న ఐదుగురికి ఎన్‌ఐఏ కోర్టులో మరణశిక్ష ఖరారైంది. 157 మంది సాక్షులను విచారించాక.. ఎన్‌ఐఏ కోర్టు ఈ తీర్పునిచ్చింది. దాంతో దోషులు ఆ తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తూ.. పిటిషన్ దాఖలు చేశారు. అదే సమయంలో ట్రయల్ కోర్టు కూడా తన తీర్పును హైకోర్టుకు రిఫర్ చేసింది.
ఈ రెండు పిటిషన్లపై జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ శ్రీసుధ ధర్మాసనం 45 రోజులపాటు సుదీర్ఘ విచారణ చేపట్టింది. ‘‘ఈ కేసులో నిందితులకు మరణ శిక్ష విధించడానికి ట్రయల్ కోర్టు అన్ని వాస్తవాలను, పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించాకే.. ముగింపునకు వచ్చింది. ఈ కోర్టు సైతం స్వతంత్రంగా నిందితుల తరఫు వాదనలను, ఆయా సాక్షుల వాంగ్మూలాలను కూలంకషంగా పరిశీలించింది. ప్రతి సాక్షి వాంగ్మూలాన్ని సరైన పద్ధతిలో రికార్డు చేశారు. దోషులకు మరణశిక్షను విధించడానికి సరైన కారణాలను ట్రయల్ కోర్టు ఎలాంటి లోపాలు లేకుండా, కచ్చితంగా రికార్డు చేసింది. ట్రయల్ కోర్టు ఉరిశిక్ష విధించడంలో చూపిన విచక్షణను, నిర్దేశించుకున్న కారణాలను, చేసిన కసరత్తును పరిశీలించిన తర్వాత.. ఆ తీర్పు ఏకపక్షం, అసమంజసం అని చెప్పడానికి వీలులేదన్నది మా అభిప్రాయం. పరిస్థితులను సరైనరీతిలో ఆవిష్కరించడానికి సమగ్రమైన, ఉదారవాద కోణంలో ప్రయత్నం చేశాం. దోషుల్లో పరివర్తనకు సంబంధించి ప్రభుత్వ ఏజెన్సీలతోపాటు మానసిక నిపుణులు ఇచ్చిన నివేదికలను సైతం క్షుణ్ణంగా పరిశీలించాం.
ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేకుండా మరణ శిక్షను ధ్రువీకరించడానికి ఇది సరైన కేసు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సీఆర్‌పీసీ సెక్షన్ 366 ప్రకారం ట్రయల్ కోర్టు గరిష్ఠ శిక్ష అయిన మరణ శిక్షను విధిస్తే.. దాన్ని హైకోర్టు ధ్రువీకరించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే 2016లో ట్రయల్ కోర్టు తన లేఖ ద్వారా ‘మరణ శిక్ష’ను ధ్రువీకరించాలని కోరినట్లు ధర్మాసనం వివరించింది. ‘‘సమగ్ర చర్చ తర్వాత నిందితుల్లో సంస్కరణ తేవడానికి లేదా పునరావాసం కల్పించడానికి ఎక్కడా చిన్న అవకాశం కూడా కనిపిచండం లేదు. ఈ పరిస్థితుల్లో ఉరిశిక్షను జీవితఖైదుగా మారిస్తే ఆ ప్రయాస నిష్ఫలంగా మారితుంది. ట్రయల్ కోర్టు తీర్పులో మేం జోక్యం చేసుకునే విధంగా అప్పీలుదారులు ఒక్క కారణాన్ని కూడా చూపలేకపోయారు. ఇక మరణ శిక్షను ఖరారు చేయడం తప్ప మరో అవకాశం లేకుండాపోయింది. అందుకే.. ఐదుగురికి మరణ శిక్షను ఖరారు చేస్తున్నాం’’ అని వ్యాఖ్యానించింది. దోషులకు ఎలాంటి ఖర్చు లేకుండా ధ్రువీకరించిన తీర్పు కాపీలను అందజేయాలని ఆదేశించింది. 30 రోజుల్లో సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేలా దోషులకు వెసులుబాటు కల్పించింది.
ఏ1 మిర్చీ సెంటర్ వద్ద సంబురాలు
హైకోర్టు తీర్పు నేపథ్యంలో మంగళవారం దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుడు ఘటనా స్థలిలో హడావుడి నెలకొంది. దోషులకు ఏ శిక్ష పడుతుందా? అని అప్పటి వరకు నిరీక్షించిన బాధితులు, నాటి ప్రత్యక్ష సాక్షులు ఉత్కంఠతో ఎదురు చూశారు. మరణ శిక్ష ఖరారవ్వగానే సంబురాలు జరుపుకొన్నారు. మృతుల ఆత్మశాంతికి నివాళులర్పించారు. ఆ తర్వాత.. దోషులకు మరణ శిక్ష సరైందేనంటూ ఏ1 మిర్చీ సెంటర్ వద్ద మిఠాయిలు పంచుకున్నారు. యువజన కాంగ్రెస్ నాయకుడు ప్రవీణ్‌రెడ్డి, కార్యకర్తలు కూడా ఏ1 మిర్చీ పాయింట్ వద్దకు చేరుకుని, మిఠాయిలు పంచిపెడుతూ.. తీర్పుపట్ల హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి క్షమాభిక్ష అంటూ జాప్యం జరుగకుండా తక్షణమే దోషులను ఉరితీయాలని ప్రవీణ్‌రెడ్డి డిమాండ్ చేశారు. కాగా.. ఈ ఘటన జరిగి పన్నెండేళ్లయినా.. ఇంకా ఆ బీభత్సం కళ్లముందే కదలాడుతోందని బాధితులు మీడియాకు చెప్పారు. మృతుల కుటుంబ సభ్యులైతే.. ఆ చేదు జ్ఞాపకాల నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నామన్నారు. కొందరు క్షతగాత్రులకు ఒంటిపై అయిన గాయాలు తగ్గినా.. మానసిక గాయాల నుంచి కోలుకోలేకపోతున్నారు. ఇప్పటికీ అదో పీడకలగా వెంటాడుతోందని చెబుతున్నారు.
ఇప్పటికీ ప్రభుత్వ సాయం అందలేదు
బాంబు పేలుడు జరిగిన రోజు ఛాయ్ వడబోసే బట్టను కొనేందుకు దిల్‌సుఖ్‌నగర్ వెళ్లాను. అప్పుడే బాంబు పేలి.. నా మోకాళ్ల కింది భాగంలో ఏడు గాయాలయ్యాయి. కుక్కర్ ముక్కలు లోనికి చొచ్చుకుపోయాయి. అప్పట్లో ప్రభుత్వం రూ.50 వేలు ఇచ్చింది. కానీ, వైద్యానికి రెండింతల ఖర్చయింది. ఆ తర్వాత బాధితులకు సాయం ప్రకటించినా.. ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా అందలేదు. అసలు మా పరిస్థితి ఎలా ఉందని పట్టించుకున్న నాథుడు లేడు. ఇప్పటికీ కాళ్ల నొప్పులతో హోటల్ నడుపుకొంటున్నా.
- బాధితుడు అజ్మతుల్లా, మలక్‌పేట్
దర్యాప్తులో ఆధారాల సేకరణ.. ఫలితం
పేలుడు జరిగిన నిమిషాల వ్యవధిలోనే ఘటనాస్థలానికి చేరుకున్నా. రక్తపుమడుగులో కొందరు విగతజీవులుగా పడి ఉం టే.. మరికొందరు హాహాకారాలు చేయడం కలచివేసింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, వెంటనే దర్యాప్తు ప్రారంభించాం. సాంకేతిక ఆధారాలను సేకరించాం. అయితే.. ఇది ఉగ్రచర్య కావడంతో.. కేసును ఎన్‌ఐఏకి బదిలీ చేశాం. ప్రాథమిక దర్యాప్తులో సేకరించిన సాక్ష్యాధారాలు దోషులకు శిక్ష పడడానికి దోహదపడింది.
- అర్కపల్లి ఆంజనేయులు, కేసు మొదటి విచారణ అధికారి(ప్రస్తుతం ఇన్‌స్పెక్టర్)
ఇప్పటికీ చెవులు వినబడడం లేదు
దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుడు సమయంలో అక్కడే ఉన్నాను. పేలుడు శబ్దానికి వినికిడి శక్తిని కోల్పోయాను. వారం రోజులు ఆస్పత్రిలో చికిత్స చేశారు. ఆ తర్వాత పరిస్థితి కొంత మెరుగైనా.. ఇప్పటికీ చెవులు సరిగా వినబడడం లేదు. ఆ రోజు జరిగిన పేలుడును తలచుకుంటే.. ఇప్పటికీ భయం వేస్తుంది. ఆ దారుణం వల్ల ఆరోగ్యం దెబ్బతిని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా.
- బక్కారెడ్డి, క్షతగాత్రుడు
వెంటనే ఉరితీయాలి
2007లో జరిగిన గోకుల్ చాట్ బాంబు పేలుడులో గాయపడ్డాను. అప్పట్లో ఎందరో నేతలు హామీలిచ్చారు. ప్రభుత్వ పెద్దలు ప్రకటనలు చేశారు. ఇప్పటికీ పూర్తిస్థాయిలో సహాయం అందలేదు. దిల్‌సుఖ్‌నగర్ కేసులో దోషులు సుప్రీంకోర్టుకు వెళ్లక ముందే.. వారిని ఉరితీయాలి.
- రహీం, గోకుల్ చాట్ పేలుడు బాధితుడు
ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
18 మంది మరణానికి కారణమైన వారికి ఉరిశిక్షే సరైంది. 2016లోనే ఎన్‌ఐఏ కోర్టు మరణశిక్ష విధించింది. హైకోర్టు ఇప్పుడు తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు.. రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌తో ఇంకా ఆలస్యమవుతుంది. దోషులు చట్టంలోని వెసులుబాట్లను వాడుకుంటున్నారు. బాధితుల గోడును మాత్రం ఇప్పటి వరకూ ప్రభుత్వం పట్టించుకోలేదు. అప్పట్లో గాయపడ్డ నన్ను ఆస్పత్రిలో చేర్పించి, చికిత్స చేయించి.. ఇంటికి పంపారు. మళ్లీ మావైపు కన్నెత్తి చూడలేదు.
- బాధితుడు యాదయ్యగౌడ్, బడంగ్‌పేట్
అదో పీడ కల
దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల ఘటనను నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేను. అదో పీడ కలగా నన్ను వెంటాడుతోంది. పేలుడు ధాటికి తీవ్రంగా గాయపడ్డా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాకు ఎలాంటి సహాయం చేయలేదు. ఇప్పటికీ సర్కారు సాయం కోసం ఎదురుచూస్తున్నా.
- దుర్గాప్రసాద్, చింతూరు, అల్లూరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఇవి కూడా చదవండి..
సింహానికి చుక్కలు చూపించిన తేనెటీగలు..
సిట్ కస్టడీకి ‘కల్తీ నెయ్యి’ నిందితులు
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here