Metro: గుడ్ న్యూస్.. మారనున్న ‘మెట్రో’ ముఖచిత్రం..
ABN, Publish Date - Jan 10 , 2025 | 12:41 PM
హైదరాబాద్ మహానగరానికి ఔటర్ రింగు రోడ్డు మణిహారంగా మారింది. ఔటర్ కేంద్రంగా అభివృద్ధి దూసుకెళ్తోంది. నివాస ప్రాంతాలే కాకుండా వ్యాపార, వాణిజ్య కేంద్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. దీంతో ప్రజా రవాణా వ్యవస్థలు ఔటర్ రింగు రోడ్డుతో అనుసంధానమవుతున్నాయి. తాజాగా మెట్రో కారిడార్ కూడా విస్తరిస్తోంది.
హైదరాబాద్, జనవరి 10: గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ 158 కిలోమీటర్ల మేర ఉన్న ఔటర్‌ను అనుసంధానం చేస్తూ 36 వరకు రోడ్డు మార్గాలు, నాలుగు చోట్ల రైలు మార్గాలు ఉన్నాయి. రోడ్డు, రైలు మార్గాలతో పాటు మెట్రో మార్గం కలిస్తే భవిష్యత్ ప్రజా రవాణా వ్యవస్థ మెరుగ్గా ఉండే అవకాశాలున్నాయి. ఆ దిశగానే సీఎం రేవంత్ రెడ్డి ఉత్తర హైదరాబాద్ వైపు రెండు మెట్రో కారిడార్లు, దక్షిణ హైదరాబాద్ వైపు మరో కారిడార్‌కు డీపీఆర్‌లను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో మెట్రోరైలు సౌకర్యం ఔటర్ రింగు రోడ్డును దాటి నగర శివారు ప్రాంతాలకు అందుబాటులోకి రానుంది.
శామీర్‌పేట టూ ఫోర్త్ సిటీ..
హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు మొదటి దశలోని జేబీఎస్ నుంచి ఎంబీజీఎస్ మార్గంలో 11 కిలోమీటర్లు ప్రస్తుతం నగరవాసులకు అందుబాటులో ఉంది. రెండో దశలో చేపట్టబోయే జేబీఎ్‌స-శామీర్‌పేట (22 కి.మీ), ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ), చాంద్రాయణ గుట్ట నుంచి ఇన్నర్ రింగు రోడ్డు మీదుగా ఆరాంఘర్, శంషాబాద్ టౌన్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు లోపలి వరకు (35 కి.మీ), అదేవిధంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఫోర్త్ సిటీ(ఫ్యూచర్ సిటీ) వరకు (40 కి.మీ).. ఇలా మొత్తం 115 కిలోమీటర్ల మెట్రో మార్గం ఉత్తర దిక్కున ఉన్న శామీర్‌పేట ఔటర్ రింగు రోడ్డు నుంచి దక్షిణ దిక్కున ఉన్న ఫోర్త్ సిటీతో అనుసంధానం అవుతుంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ 158 కిలోమీటర్ల మేర ఉన్న ఔటర్ రింగు రోడ్డుకు ఉత్తరాన ఉన్న శామీర్‌పేట నుంచి సికింద్రాబాద్, ముషీరాబాద్, ఎంజీబీఎస్, చార్మినార్ మీదుగా చాంద్రాయణగుట్ట, శంషాబాద్ విమానాశ్రయం అక్కడి నుంచి ఫోర్త్ సిటీ వరకు మెగా మెట్రో కారిడార్ అవతరించనుంది.
రోడ్డు, రైలు, విమాన మార్గాలతో..
హైదరాబాద్ మహానగరంలో ఉత్తర-దక్షిణ దిక్కులను కలిపే మెగా మెట్రో కారిడార్‌లో ఎంజీబీఎస్, జేబీఎస్ వంటి బస్ స్టేషన్‌లు, ఎంఎంటీఎస్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు రాకపోకలు సాగించే సికింద్రాబాద్, ఫలక్‌నుమా, బుద్వేల్, శంషాబాద్, అల్వాల్, బొల్లారం వంటి రైల్వే స్టేషన్‌లతో అనుసంధానం అవుతుంది. ఇక అత్యంత కీలకమైంది శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం. భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విమానాల నెట్‌వర్క్ కలిగిన విమానాశ్రయంతో కూడా ఈ మెట్రో కారిడార్ కలిస్తే అన్ని రకాల ప్రజా రవాణా వ్యవస్థలు ఒకే మార్గంలో ఉండనున్నాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అధికంగా ఉన్న ప్రాంతాలను కలపడమే కాకుండా నివాస, వ్యాపార వాణిజ్య కేంద్రాలను, ఔటర్ రింగు రోడ్డు ఇంటర్‌చేంజ్ కేంద్రాలను కలిపేలా మెగా మెట్రో మార్గం అందుబాటుకి వస్తే హైదరాబాద్ మహానగరంలో ప్రజా రవాణా వ్యవస్థ ముఖ చిత్రం సమూలంగా మారిపోనుంది.
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు స్వరూపం.. మొదటి దశ (వినియోగంలో ఉంది)..
కారిడార్-1 (ఎల్‌బీనగర్-మియాపూర్) - 29 కి.మీ
కారిడార్-2 (జేబీఎస్-ఎంజీబీఎస్) - 11 కి.మీ
కారిడార్-3 (నాగోల్ - రాయదుర్గం) - 29 కి.మీ
రెండవ దశ- పార్ట్ ఎ (నిర్మాణం చేయాల్సివి)
ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట - 7.5 కి.మీ
నాగోల్-ఎల్‌బీనగర్-చాంద్రాయణగుట్ట- ఆరాంఘర్-శంషాబాద్ - 36.4 కి.మీ
రాయదుర్గం - కోకాపేట నియోపోలిస్ - 11.6 కి.మీ
మియాపూర్ - బీహెచ్‌ఈఎల్- పటాన్‌చెరు - 13.4 కి.మీ
ఎల్‌బీనగర్ - వనస్థలిపురం- హయత్‌నగర్ - 7.1 కి.మీ
శంషాబాద్ ఎయిర్‌పోర్టు - ఓఆర్‌ఆర్ మీదుగా కొంగరకలాన్- ఫోర్త్ సిటీ - 40 కి.మీ
రెండవ దశ- పార్ట్ బి
ప్యారడైజ్- మేడ్చల్ - 23 కి.మీ
జేబీఎస్ - శామీర్‌పేట - 22 కి.మీ
మొదటి దశ మెట్రోతో కొత్తగా అనుసంధానం అయ్యే రెండో దశ మెట్రో మార్గాలు..
కారిడార్-1లోని ఎల్‌బీనగర్-మియాపూర్ మెట్రో మార్గంతో (29 కి.మీ) అనుసంధానం చేస్తూ కొత్తగా నిర్మాణ పనులను చేపట్టనున్నారు. ఇందులో మియాపూర్ నుంచి పటాన్‌చెరు వరకు 13.4 కి.మీ దూరం, ఎల్‌బీనగర్ వైపు హయత్‌నగర్ వరకు 7.1 కి.మీ మేర నిర్మాణం చేపట్టనున్నారు.
కారిడార్-2లో జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు 11 కి.మీ ఉన్న ఈ మెట్రో మార్గానికి సైతం రెండు వైపులా కొత్తగా అనుసంధానం చేస్తూ మెట్రో మార్గాలను ప్రతిపాదించారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ, జేబీఎస్ నుంచి శామీర్‌పేట వరకు 22 కి.మీ మేర మెట్రో మార్గాలను చేపట్టనున్నారు.
కారిడార్-3లో నాగోల్-రాయదుర్గం మెట్రో మార్గం (29 కి.మీ)లో నాగోల్ నుంచి ఎల్‌బీనగర్, చాంద్రాయణగుట్ట, ఆరాంఘర్ మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు 36.4 కి.మీ మేర మెట్రో మార్గాన్ని నిర్మిస్తారు. అదేవిధంగా రాయదుర్గం మెట్రోస్టేషన్ నుంచి కోకాపేట నియోపోలీస్ లేఅవుట్ వరకు 11.6 కి.మీ మేర నిర్మిస్తారు. ఇదే కారిడార్‌లో ప్యారడైజ్ మెట్రోస్టేషన్ నుంచి బోయిన్‌పల్లి, సుచిత్ర మీదుగా నాగ్‌పూర్ జాతీయ రహదారి వెంబడి మేడ్చల్ వరకు మరో 23 కి.మీ మేర కొత్తగా మెట్రో మార్గాన్ని నిర్మించనున్నారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో స్టేషన్ నుంచి ఫోర్త్ సిటీ వరకు నిర్మించే మెట్రో మార్గాన్ని ఔటర్ రింగు రోడ్డు మీదుగా తుక్కుగూడ, కొంగరకలాన్, రంగారెడ్డి కలెక్టరేట్ నుంచి మీర్‌ఖాన్‌పేట వద్ద ప్రతిపాదించిన ఫోర్త్‌సిటీ (ఫార్మా సిటీ) వరకు 40 కి.మీ మేర కొత్తగా మెట్రో మార్గాన్ని నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.
Updated Date - Jan 10 , 2025 | 12:41 PM