Hyderabad: ఉత్తమ బాల నటిగా వైష్ణవి నేదునూరికి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్..
ABN , Publish Date - Feb 13 , 2025 | 09:25 PM
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా నేచర్ ఈజ్ డివైన్ (Nature is Divine) అనే షార్ట్ ఫిల్మ్‌ను శ్రీనివాస్ నేదునూరి నిర్మించారు. ఈ చిత్రంలో వైష్ణవి నేదునూరి ప్రధాన పాత్రలో నటించి అందరి ప్రశంసలు అందుకుంది.

హైదరాబాద్: ఉత్తమ బాల నటిగా వైష్ణవి నేదునూరి (Vaishnavi Nedunuri)కి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ట్యాలెంట్ అవార్డ్స్-2025 (International Film Festival Talent Awards-2025) లభించింది. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా నేచర్ ఈజ్ డివైన్ (Nature is Divine) అనే షార్ట్ ఫిల్మ్‌ను శ్రీనివాస్ నేదునూరి నిర్మించారు. ఈ చిత్రంలో వైష్ణవి నేదునూరి ప్రధాన పాత్రలో నటించి అందరి ప్రశంసలు అందుకుంది. ఆమె నటనకు గానూ ఈ అవార్డ్ చిన్నారిని వరించింది. ప్రకృతిని ఎలా కాపాడుకోవాలనే ప్రధాన ఇతివృత్తంతో నేచర్ ఈజ్ డివైన్ షార్ట్ ఫిల్మ్‌ను నిర్మించారు.
కాగా, సౌమిత్ మీడియా డాక్టర్ వంశీ కృష్ణ, మోర్డ్ ఫౌండేషన్ డాక్టర్ శ్రీనివాస్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ట్యాలెంట్ అవార్డ్స్-2025 కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ నగరంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. అతిరథ మహారథులు, సినీ రంగ ప్రముఖుల మధ్య కార్యక్రమాన్ని గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ అవార్డుల కార్యక్రమంలో షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీ ఫిల్మ్స్, ఫీచర్ ఫిల్మ్స్ కేటగిరీలో నటన, దర్శకత్వం, నిర్మాణ విలువల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి, అలాగే వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు టాలెంట్ అవార్డ్స్ ప్రదానం చేశారు.
రాజకీయ నేత వేణుగోపాలాచారి, లెజెండ్రీ డైరెక్టర్ రేలంగి నరసింహారావు, పుష్ప మూవీ ఫేమ్ నటుడు కేశవ్, శతాధిక చిత్రాల నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రముఖ టీవీ నటుడు రాంబాబు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాధా మనోహర్ దాస్, గాయని, సెన్సార్ బోర్డు మెంబర్ శ్రీమతి అరుణ సుబ్బారావు, ఫిల్మ్ ఫెస్టివల్ బ్రాండ్ అంబాసిడర్ మీనూ సింగ్, ఉప్పల శ్రీనివాస్ గుప్తా(టీఎఫ్‌సీసీ ప్రచార కమిటీ), శతాధిక లఘు చిత్రాల దర్శకుడు పీసీ ఆదిత్య చేతుల మీదుగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ టాలెంట్ అవార్డ్స్-2005ను విజేతలకు అందజేశారు. అవార్డు అందుకున్న వైష్ణవికి ముఖ్య అతిథులు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రేలంగి నరసింహారావు, గుర్రపు విజయ్ కుమార్, ఆధ్యాత్మిక వేత్త రాధా మనోహర్ దాస్, పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.