BJP MP Laxman: కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం.. ఆ మూడు పార్టీలు ఒక్కటే: ఎంపీ లక్ష్మణ్..
ABN , Publish Date - Apr 05 , 2025 | 05:52 PM
బీజేపీ అన్ని ఎన్నికల్లో విజయం సాధిస్తుంటే తమకు పుట్టగతులు ఉండవని కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఏకమవుతున్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. వారంతా కలిసికట్టుగా వక్ఫ్ బిల్లు అడ్డుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.

హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ ఒక్కటే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తోందని, మిగతా పార్టీలన్నీ కాంగ్రెస్‌తో చేతులు కలిపాయని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. పార్లమెంట్ వేదికగా ఆయా పార్టీల బంధం బయటపడిందని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ బయట తిట్టుకుంటూ ఎంఐఎంతో అంతర్గతంగా కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు లక్ష్మణ్. చెన్నైలో ఆ రెండు పార్టీలూ ఒకే వేదిక పంచుకోవడంతోనే వారి మధ్య బంధం బయటపడిందని విమర్శనాస్త్రాలు సంధించారు. బీజేపీ అన్ని ఎన్నికల్లో విజయం సాధిస్తుండటంతో తమకు పుట్టగతులు ఉండవని కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏకమవుతున్నాయని మండిపడ్డారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే..
గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఇద్దరూ కలిసి కుట్రలు చేశారని సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా పరోక్షంగా మజ్లిస్ గెలిచేందుకు తోడ్పాటు అందించారని మండిపడ్డారు. ఈ మూడు పార్టీల కుట్రా రాజకీయాలను ప్రజలు తిప్పికొడతారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అంశం పెద్దగా ప్రయోజనం ఇవ్వకపోవడంతో భాష పేరుతో వైషమ్యాలు సృష్టిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. దానికి కుట్రదారులుగా సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కేటీఆర్ పనిచేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ-రేసింగ్ విషయంలో ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ఆ అంశాలనే పక్కన పెట్టిందని ధ్వజమెత్తారు.
వక్ఫ్ బిల్లుపై కుట్రలు..
వక్ఫ్ బోర్డు పేరుతో ఏళ్లపాటు పేదల భూములు దోచుకున్నారని ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. అలాంటి వారి వల్ల పస్మంద, షియా, బోరా ముస్లిం సమాజాలు ఇంకా పేదరికంలో మగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని పేదరికం నుంచి బయటపడేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న పనులకు సహకరించాల్సింది పోయి ఆ పార్టీలన్ని కలిసి వ్యతిరేకించాయని మండిపడ్డారు. కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలతో ముస్లిం ప్రజలను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. పార్లమెంట్ పాస్ చేసిన వక్ఫ్ బిల్లుపై పేద ముస్లింలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇదో చారిత్రాత్మకమైన బిల్లన్నారు.
వక్ఫ్ ఆస్తులు దోచుకున్నారు..
తెలంగాణలో 77,538 ఎకరాల వక్ఫ్ భూములు ఉంటే ఇప్పుడు 57 వేల ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయని అధ్యయనంలో తేలిందని చెప్పుకొచ్చారు. ఎంఐఎం నేతలు వక్ఫ్ ఆస్తులను నోటరీ డాక్యుమెంట్లతో లీజులకు ఇచ్చి దోచుకున్నారనే విషయం సైతం బట్టబయలు అయ్యిందని అన్నారు. నూతన చట్టం అమలైన తర్వాత బడాబాబులు వక్ఫ్ ఆస్తులు ఎలా దోచుకున్నారో తెలుస్తుందని హెచ్చరించారు. ఎంత మంది అడ్డుపడినా ప్రధాని మోదీ ఆధ్వర్యంలో చరిత్రాత్మక వక్ఫ్ బిల్లు ఆమోదం పొందిందని ఎంపీ లక్ష్మణ్ చెప్పుకొచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Bus Conductor Problems: అత్యంత ఎత్తైన బస్ కండక్టర్ ఇతనే.. అతని ఇబ్బందులు చూస్తే బాబోయ్..
Weather Report: దంచికొట్టుడే.. ఉరుములు, మెరుపులతో వర్షాలు.. ఎప్పట్నుంచి అంటే..