BRS Party : బీఆర్ఎస్ ఆధ్వర్యంలో త్వరలో బీసీ సభ
ABN, Publish Date - Feb 09 , 2025 | 06:24 PM
BRS Party : రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల సమయంలో కోతలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. పథకాలు అమల్లో సైతం కోతలు చెబుతోందని ఎద్దేవా చేశారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 09: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో త్వరలో బీసీ సభ నిర్వహిస్తామని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రకటించారు. ఈ బీసీ సభకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారన్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించిన చోటే ఈ సభను నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆ పార్టీలోని బీసీ నేతలతో మాజీ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ బీసీ నేతల సమావేశంలో మాట్లాడి దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు.
కుల గణన మళ్లీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయపడుతోందని తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకై మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రెస్ మీట్లు పెడుతోందన్నారు.
Also Read: గురుమూర్తి రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు.. అందుకే చంపేశాడు
సీఎం రేవంత్‌కి హరీష్ రావు బహిరంగ లేఖ
మరోవైపు సిద్దిపేటలో రైతులకు వెంటనే వడ్ల బోనస్ విడుదల చేయాలని సిఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. అందులోభాగంగా ఈ అంశంపై సీఎం రేవంత్‌కు హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖను విడుదల చేసిన అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. వడ్లకు బోనస్ విషయంలో రైతుల్ని ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు.
Also Read: ప్రైవేట్ ఆసుపత్రులకు హెల్త్ మినిస్టర్ కీలక సూచన
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు గొప్పగా ఉన్నాయి.. కానీ అందుకు తగ్గట్లుగా ఆయన చేతలయితే లేవన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటల మనీషా? లేక మోసపు మనీషా అంటూ హరీష్ రావు సందేహం వ్యక్తం చేశారు. బోనస్ డబ్బుల కోసం కలెక్టరేట్, అధికారుల చుట్టూ రైతులను తిరుగుతున్నారని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా.. రూ. 2 లక్షల రుణ మాఫీ, సన్న వడ్లకు బోనస్ అన్ని మోసాలేనంటూ ఎద్దేవా చేశారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌ను పూర్తిగా విస్మరించారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు.
Also Read: ఢిల్లీ సీఎం అభ్యర్థి ఫిక్స్.. అధిష్టానం చూపు అతడి వైపే
రెండో పంటకు పెట్టుబడి లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రూ. 432 కోట్లు బోనస్ బకాయిలు ఉన్నాయని గుర్తు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు ఉత్తర కుమార ప్రగల్భాలుగా మారాయంటూ హరీష్ రావు వ్యంగ్యంగా అన్నారు. బిఅర్‌ఎస్‌ను ఇష్టమొచ్చినట్లు తిడుతున్నావు.. మాకు తిట్టడం రాదనుకున్నారా? అని ప్రశ్నించారు. కానీ తమకు సంస్కారం ఉంది.. మీకు లేదన్నారు. కందులు కూడా ఎకరానికి మూడు క్వింటాళ్ల మాత్రమే కొంటారని.. ఎన్నికల వేళ హామీల కోతలు.. గెలిచాక అమలులో కోతలు అంటు రేవంత్ సర్కార్‌కు చురకలంటించారు.
Also Read: దండకారణ్యంలో ఎన్‌కౌంటర్.. మావోయిస్టులకు భారీ దెబ్బ
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా రైతు.. ఆయనకు తెలిసే ఇది జరుగుతున్నదా? అంటూ సందేహం వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో కందులకు సైతం రూ. 400 బోనస్ ఇస్తామన్నారని గుర్తు చేశారు. కానీ కందులు రూ.7,550 మద్దతు ధర, ప్రభుత్వం బోనస్‌తో కలిపి రూ.7,950 కి కొనాల్సి ఉందన్నారు. కందులు పండించడం రైతులు చేసిన నేరమా? అని ప్రశ్నించారు. వ్యవసాయ శాఖ అధికారులు క్రాప్ బుకింగ్ చేయక పోతే అ తప్పు రైతులదా? అని సందేహం వ్యక్తం చేశారు. క్రాప్ బుకింగ్‌లో మిస్సింగ్ రైతులకు అనుమతి ఇవ్వాలని అధికారులు కోరితే ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదన్నారు. షరతులు లేకుండా మొత్తం కందులు కొనాలని తాము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.
సన్ ఫ్లవర్ రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. నూనెల వచ్చే పంటలు పండిస్తే.. ప్రభుత్వం వారికి శఠగోపం పెడుతున్నారన్నారు. సన్ ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పోవడంతో రైతులు రూ. 6 వేలకే విక్రయిస్తున్నారని చెప్పారు. విదేశీ మారక నిల్వలను కాపాడుతున్న నూనె రైతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు. ఇది కోతల సర్కారు.. ఎన్నికల ముందు ఆ కోతలు.. ఎన్నికల తరువాత ఈ కోతలంటూ ఎద్దేవా చేశారు. కోతలు, షరతులు లేకుండా రైతులు పండించిన పంట మెత్తం కొనాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
రైతు భరోసాలో సైతం ఈ సర్కారు కోత పెడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల రైతు కనకవ్వకు రూ. 4,650 పడాలి.. కానీ రూ.1,650 మాత్రమే నగదు ఖాతాలో పడిందని.. ఇవేమీ కోతలు అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హరీష్ రావు నిలదీశారు. నవంబర్ 30వ తేదీన సిఎం 2,750 కోట్ల చెక్ మహబూబ్ నగర్‌లో ఇస్తే ఇప్పటి వరకు పైసలు ఎందుకు పడటం లేదని ఈ సర్కార్‌ను ఆయన సూటిగా ప్రశ్నించారు.
సీఎం ఏమైనా డమ్మీ చెక్ ఇచ్చారా? అని వ్యంగ్యంగా అడిగారు. రేవంత్ సర్కారు సిత్రాలు.. చాలా ఉన్నాయన్నారు. ఈ రేవంత్ సర్కారుకు వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ తాను తవ్వుకున్న గోతిలో తనే పడుతున్నదన్నారు. హర్యానా, మహారాష్ట్ర, డిల్లీ ప్రజలు.. కాంగ్రెస్ పార్టీకి మంగళం పాడరని గుర్తు చేశారు. ఇక్కడ కూడా ఎన్నికలు ఎప్పుడూ వస్తాయా? ఎప్పుడూ కాంగ్రెస్‌ను గాల్లో కలుపుదామనా అని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. బిఅర్ఎస్‌ది జగమంతా పాలన అయితే, కాంగ్రెస్‌ది సగమంత పాలన అని అభివర్ణించారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల్లో అసంతృప్తి వచ్చిందని.. ఏ పథకమైన అసంపూర్ణమే అంటూ రేవంత్ సర్కార్‌కు మాజీ మంత్రి హరీష్ రావు చురకలంటించారు.
For Telangana News And Telugu News
Updated Date - Feb 09 , 2025 | 06:54 PM