Minister Ponguleti: ప్రతిపక్ష నేత ఇలాగేనా ఉండేది.. కేసీఆర్‌పై మంత్రి పొంగులేటి ధ్వజం
ABN, Publish Date - Jan 31 , 2025 | 08:04 PM
Minister Ponguleti: ప్రజా తీర్పును మాజీ సీఎం కేసీఆర్ అగౌరవ పరుస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. వర్షాలు వచ్చినా.. వరదలు వచ్చినా కనీసం ప్రజలను కేసీఆర్ పరామర్శించలేదని.. ఫామ్ హౌస్ దాటలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు.

హైదరాబాద్: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేవంత్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ గర్జనలు, గంభీరాలు గమనిస్తున్నామని అన్నారు. ఇంకా ఫామ్ హౌస్‌లోనే ఉండి మాట్లాడతారా.. లేదా అసెంబ్లీకి వస్తారా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. అసెంబ్లీకి రాకుండా ఎక్కడికి పోతాడో చూద్దామని అన్నారు. అసెంబ్లీకి వస్తే అప్పుడు మాట్లాడతామని అన్నారు. ఇవాళ( శుక్రవారం) తెలంగాణ సచివాలయంలో మీడియాతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిట్‌చాట్ చేశారు. 13 నెలల పాటు కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితమై ఇంతకాలం మౌనంగా ఉన్నానని అంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడంటే ప్రజల్లో తిరగాలని చెప్పారు. ప్రజా సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
కేసీఆర్ జీవితమంతా అక్కడే..
వర్షాలు, వరదలు వచ్చినా కనీసం ప్రజలను కేసీఆర్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు సచివాలయానికి కూడా రాలేదని గుర్తుచేశారు. ప్రతిపక్ష నేతగా ఏడాది నుంచి అసెంబ్లీకి ఎందుకు రాలేదని నిలదీశారు. కేసీఆర్ జీవితమంతా ఫామ్‌హౌసే అని విమర్శించారు. ప్రజలు అత్యాశకు పోయి కాంగ్రెస్‌కు ఓటేశారని కేసీఆర్ వ్యాఖ్యలు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలను అవమానించేలా ఉన్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ప్రజా తీర్పును అగౌరవ పరుస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలన్నా.. ప్రజాతీర్పు అన్నా కేసీఆర్‌కు ఏనాడూ గౌరవం లేదని చెప్పారు. పదేళ్లు అధికారం ఇచ్చిన ప్రజలకు ఓడిపోయిన తర్వాత ఈ రోజు వరకు కూడా కనీసం కృతజ్ఞత తెలపలేదని చెప్పారు. ప్రజాతీర్పును శిరసావహిస్తున్నామని కూడా ప్రకటించలేదని మండిపడ్డారు. ఈ ఏడాది కాలంలో నల్గొండ, కరీంనగర్ బీఆర్ఎస్ సభల్లో కూడా.. ఈరోజు మాదిరిగానే గంభీర ప్రకటనలే చేశారు. ఆ తర్వాత ఏమయ్యారో అందరికీ తెలిసిందేనని అన్నారు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ ముఖం చూడని వ్యక్తి తన ఉనికిని చాటుకోవడానికి, తానున్నానని చెప్పుకోవడానికి తుపాకీ రాముడిలా, పిట్టల దొర మాదిరిగా కేసీఆర్ మాట్లాడుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు.
కేసీఆర్ ఆ లెక్కలు తీయిద్దామా..
‘ప్రజలు ఏదో నమ్మి ఓటేశారని అంటున్నావు. వాస్తవాలు గ్రహించి నీ గడీల పాలన వద్దనుకుని ప్రజలు నిన్ను, నీ కుటుంబాన్ని ఛీత్కరించారు. పథకాలు అమలు కాలేదని ఫామ్‌హౌస్‌లో కూర్చొని మాట్లాడటం కాదు. ఇప్పటికైనా ప్రజల్లోకి రావాలనే మేమంటున్నాం. అసెంబ్లీ సమావేశాలకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదే పదే ఆహ్వానించారు. 80 వేల పుస్తకాలు చదివినారన్నారు. మీ అమూల్యమైన సూచనలు, సలహాలు ఇవ్వాలని అసెంబ్లీకి రమ్మంటే ఎందుకు రాలేదు. 2020 రెవెన్యూ చట్టం దేశానికే ఆదర్శమని ప్రకటించిన మీరు భూ భారతి చట్టం ప్రవేశ పెట్టిననాడైన అస్సెంబ్లీకి వస్తారని ఆశించాం. నీ ఫామ్‌హౌస్‌కు కరెంటు కోతలెక్కడివి. లెక్కలు తీద్దామా. ఏ రోజు ఎంత కరెంటు సరఫరా అయింది. ఎంత సరఫరా అవుతుంది. నీ ఫామ్ హౌజ్‌కు నీళ్లెక్కడివి. రైతు భరోసా ఇచ్చిందే మేము. రాష్ట్రంలో ఉచిత కరెంట్ తెచ్చిందే కాంగ్రెస్. చరిత్ర ప్రజలకు తెలియదా. నీవంటున్న గురుకులాలను సందర్శిద్దామా. మాతో వస్తారా. నీవెక్కడికంటే అక్కడికి రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అద్దె గదుల్లో పెట్టి విద్యార్థులను నానా ఇబ్బందులకు గురిచేసిన మీరా మాట్లాడేది. రైతుల రుణమాఫీ కోసం రూ.20 వేల కోట్లు ఇచ్చిన సంగతి కళ్లకు కనిపించడం లేదా..? అభివృద్ధి మీద చర్చకు సిద్ధమా. .? ఏదైనా మాట్లాడితే దానికొక ప్రాతిపదిక ఉండాలి. ముస్లింలను కాంగ్రెస్ వాడుకుంది అంటున్నావు. వాడుకుని వదిలేసే చరిత్ర కేసీఆర్‌ది’’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.
Updated Date - Jan 31 , 2025 | 08:25 PM