Hydra Commissioner Ranganath : పోచారం పరిధిలో హైడ్రా కూల్చివేతలు..
ABN , Publish Date - Jan 25 , 2025 | 02:04 PM
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా కూల్చివేతల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా శనివారం పోచారం మున్సిపాలిటీ పరిధిలో రహదారికి అడ్డుగా నిర్మించిన కాంపౌండ్ వాల్ను హైడ్రా అధికారులు కూల్చివేశారు..

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నారపల్లి దివ్యానగర్‌లో హైడ్రా (Hydra) కూల్చివేతలు చేపట్టింది. ఇక్కడి లే అవుట్స్‌లో నివసిస్తున్న ప్రజల ఫిర్యాదు మేరకు.. శనివారం ఈ చర్యలు తీసుకుంది. పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 200 ఎకరాల్లో లే అవుట్లను నల్ల మల్లా రెడ్డి (ఎన్‌ఎంఆర్) అభివృద్ధి చేసింది. ఇందులో మొత్తం 2200 వరకూ ప్లాట్లు ఉన్నాయి. ఇక్కడ వెయ్యి మందికి పైగా సింగరేణి ఉద్యోగులు ప్లాట్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఎన్‌ఎంఆర్ ‘భద్రత’ పేరుతో అభివృద్ధి చేసిన లే అవుట్ల చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ నిర్మించింది. డెవలప్‌మెంట్ ఫండ్ పేరుతో రూ.10.5 కోట్లు ప్లాట్ల యజమానుల నుంచి వసూలు చేసి ఈ గోడ నిర్మించారని.. NMR అనుచరులు రహదారులను మూసేసి లే అవుట్లలోని ప్రజలను బయటకు వెళ్లకుండా నిర్భంధం చేస్తున్నట్లు స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
పదుల ఎకరాల ప్రభుత్వ భూమిని లాక్కొని ఎన్‌ఎంఆర్ కాంపౌండ్ వాల్ నిర్మించారని స్థానికులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా రంగంలోకి దిగింది. రహదారికి అడ్డుగా నిర్మించిన ప్రహరీ గోడను శనివారం ఉదయం బుల్డోజర్లతో కూల్చివేసింది. చట్టపరమైన నిబంధనలను అనుసరించి వేలాది మంది ప్రజలు స్వేచ్ఛగా, అడ్డంకులు లేకుండా సంచరించేందుకు 12 హెవీ డోజర్ల ద్వారా 4 కిలోమీటర్ల కాంపౌండ్ వాల్‌ను కూల్చివేసింది. ఇతర కాలనీలకు వెళ్లకుండా దివ్యా నగర్ లే అవుట్ చుట్టూ కట్టిన కాంపౌండ్ వాల్ను హైడ్రా కూల్చివేయడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దివ్యానగర్ లేఅవుట్లలో నివసిస్తున్న వారిని బయటికి వెళ్లకుండా రహదారులను మూసివేయడం, స్వేచ్ఛగా ప్లాట్లు అమ్ముకునేందుకు లేకుండా NMR యాజమాన్యం వేధిస్తున్నట్లు ఇక్కడి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి NMR రియల్ ఎస్టేట్ మాఫియాను నిర్వహిస్తోందన్న స్థానికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో హైడ్రా విచారణ చేపట్టింది. స్థానిక రెవెన్యూ, మున్సిపల్ అధికారులు హైడ్రా సమావేశంలో NMR ఆక్రమణల గురించి ధృవీకరించడంతో.. ఈ రోజు రోడ్డుగా అడ్డుగా కట్టిన ఎత్తైన ప్రహరీ గోడను కూలగొట్టింది. దర్యాప్తు పూర్తయిన తర్వాత నిజానిజాల ఆధారంగా సంబంధిత యాజమాన్యంపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని స్థానికులకు హామీ ఇచ్చింది.