Supreme Court Orders: హెచ్‌సీయూ భూములపై తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌కు సుప్రీం ఆదేశాలు
ABN, Publish Date - Apr 03 , 2025 | 11:01 AM
Supreme Court Orders: కంచ గచ్చిబౌలి భూములపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌కు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: కంచ గచ్చిబౌలి భూములపై ( Kancha Gachibowli land) సుప్రీం కోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు ( గురువారం ) సాయంత్రం 3.30 గంటలకు నివేదిక ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు (Telangana High Court) రిజిస్ట్రార్‌కు సుప్రీం ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. తుది ఆదేశాల వరకూ కంచ గచ్చిబౌలి భూముల్లో ఎటువంటి పనులను చేపట్టకూడదని స్పష్టం చేసింది. హైకోర్టులో జరిగే విచారణపై తాము ఎలాంటి 'స్టే' ఇవ్వడం లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. మధ్యాహ్నం 3:30 గంటల తర్వాత తదుపరి ఉత్తర్వులు ఇస్తామని.. అంతవరకు అక్కడ చెట్లు నరకవద్దని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. అత్యవసరంగా విచారణ జరపాలని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోరారు. కంచ గచ్చిబౌలి భూముల్లో వన్యప్రాణులు ఉన్న చోట భూములు చదును చేయాలంటే నిపుణుల కమిటీ పర్యటించాలని, అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని, అవన్నీ ఏమీ చేయకుండా పర్యవరణానికి హానీ కలిగించేలా అకస్మాత్తుగా తెలంగాణ సర్కార్ చర్యలు చేపడుతోందని తెలిపారు. గతంలో సుప్రీం ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా అక్కడ అధికారులు వ్యవహరిస్తున్నారని.. కొన్ని రోజులుగా భూముల వద్ద ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయని సుప్రీంకు పిటిషనర్ తెలిపారు. సుప్రీం తీర్పు ప్రకారం అటవీ ప్రాంతాన్ని కొట్టేయాలంటే నిపుణుల కమిటీ వేయాల్సి ఉంటుందని.. కానీ పర్యావరణానికి హానీ కలిగించేలా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పనులపై వెంటనే విచారణ చేపట్టాలని జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ముందు మెన్షన్ చేశారు.
దీనిపై వెంటనే స్పందించిన ధర్మాసనం.. మధ్యాహ్నం 3.45 గంటలకు విచారణ చేపడతామని తెలిపింది. మధ్యాహ్నం 3.30 గంటలలోగా కంచ గచ్చిబౌలి స్థలాన్ని సందర్శించి మధ్యంతర నివేదిక ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)కు సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు చెట్లు నరకకుండా చూడాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు రిజిస్ట్రార్ నివేదిక ఇచ్చాక.. మధ్యాహ్నం 3.45 గంటలకు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఈ వివాదంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోందని సుప్రీంకోర్టుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ తెలిపారు. హైకోర్టులో జరిగే విచారణపై తాము ఎలాంటి 'స్టే' ఇవ్వడం లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
హెచ్‌సీయూలో మరోసారి ఉద్రిక్తత
మరోవైపు హెచ్‌సీయూలో మరోసారి ఏబీవీపీ విద్యార్థులు నిరసనలు చేపట్టారు. యూనివర్సిటీలోకి వెళ్లేందుకు విద్యార్థులు, ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. దీంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నిరసన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భూములు వేలం వేయొద్దంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో యూనివర్సిటీ ఎంట్రెన్స్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గోడలు గేట్లను దూకి ఇప్పటికే ఏబీవీపీ విద్యార్థులు యూనివర్సిటీలోకి ప్రవేశించారు. దీంతో ఘటన స్థలానికి పోలీసులు భారీగా చేరుకుంటున్నారు.
సచివాలయం ముట్టడికి...
అలాగే సచివాలయం ముట్టడికి విద్యార్థి సంఘాలు యత్నించాయి. దీంతో వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేవారు. సచివాలయం ముట్టడికి విద్యార్థి సంఘాల పిలుపు నేపథ్యంలో సచివాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కంచ గచ్చిబౌలి భూముల వేలంపై నిరసనకు దిగారు. ఓయూలో అప్రజాస్వామిక సర్క్యులర్ వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ముట్టడి నేపథ్యంలో సచివాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి
India vs Pakistan Army: ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తే.. ఎవరిది గెలుపు.. బలాబలాలు, బలహీనతలు ఇవే..
Amaravati Capital Construction: అమరావతికి నిధులొచ్చాయ్
Read Latest Telangana News And Telugu News
Updated Date - Apr 03 , 2025 | 12:00 PM