Tummala Nageswara Rao: మీ ఆవేదన, ఆక్రోశం దేని కోసం
ABN, Publish Date - Jan 15 , 2025 | 06:05 PM
Turmeric Board in Nizamabad: నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు నేపథ్యంలో తనపై బీజేపీ ఎంపీ దర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాస్తా ఘాటుగా స్పందించారు.
హైదరాబాద్, జనవరి 15: నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తూ.. కేంద్రం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్థానిక బీజేపీ ఎంపీ ధర్మపూరి అరవింద్ స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం స్పందించారు. ఆ క్రమంలో ఎంపీ ధర్మపురి అరవింద్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించిన సందర్భంగా తనపై మీరు చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల మంత్రి తుమ్మల తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.
నిజామాబాద్ రైతుల సుదీర్ఘ పోరాటం, చిరకాల నిరీక్షణ అనంతరం కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగానే కాకుండా.. ఒక రైతుగా తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. ఈ సందర్భంగా.. పార్టీ, ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి తాను ధన్యవాదాలు తెలియజేశానని తెలిపారు.
ఈ సందర్భంగా తన రాజకీయ జీవితం గురించి మీరు చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం...ఆక్షేపణీయంగా ఉన్నాయంటూ ఎంపీ దర్మపురి అరవింద్‌కు తెలియజేశారు. ఈ స్థాయికి దిగజారి మీరు మాట్లాడతారని తాను ఊహించలేదని పేర్కొన్నారు. తన రాజకీయ ప్రస్థానం పట్ల అవగాహన రాహిత్యమో, సమాచార లోపమో తెలియదు కానీ మీ వ్యాఖ్యలు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కానివని స్పష్టం చేశారు.
1983 నుంచి నేటి వరకు తన రాజకీయ జీవితం తెరచిన పుస్తకమన్నారు. పదవుల కోసం, పార్టీ టికెట్ల కోసం ఏ నాడు, ఏ నాయకుడి వద్ద తాను మోకరిల్లింది లేదు... ఆత్మగౌరవాన్ని అమ్ముకున్నదని తెలిపారు. తన 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రతిక్షణం ప్రజాహితమే తప్ప వ్యక్తిగత స్వార్థం లేదు... ఇకపై ఉండబోదు కూడా అని స్పష్టం చేశారు. ఆ నాడు నందమూరి తారక రామారావు లాంటి మహానుభావుడి నుంచి నేడు రేవంత్ రెడ్డి వరకు ఏ కేబినెట్లో పని చేసినా, ఏ హోదాలో విధులు నిర్వర్తించినా రాష్ట్ర అభివృద్ధి, రైతులు సంక్షేమం, పేదల పక్షపాతం తప్ప తనకు మరో ఎజెండా అయితే లేదన్నారు.
చంద్రబాబు నాయుడు కావచ్చు... చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కావచ్చు.. రాజకీయంగా, సిద్ధాంత పరంగా తనతో విభేదించవచ్చు కానీ.. ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల తన కమిట్మెంట్ను ప్రశ్నించ లేదని వివరించారు. నాయకుడు ఎవరైనా, పార్టీ ఏదైనా ప్రజాహితమే తన అభిమతంగా పని చేశానని చెప్పారు. తనను పార్టీలో చేర్చుకోండి, టికెట్ ఇవ్వండి, పదవి ఇవ్వండంటూ ఈ 40 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఏనాడు, ఎవరిని అడిగింది లేదని తెలిపారు. తన వల్ల సమాజానికి మంచి జరగుతుంది, తన పని తీరుతో రాష్ట్రానికి మేలు జరుగుతుందని విశ్వసించి ఆయా పార్టీల నేతలను తనను కోరుకున్నారని గుర్తు చేశారు. ప్రజలు ఆదరించారు తప్ప... తాను ఏ పార్టీ గుమ్మం ముందు, ఏ నాయకుడు వద్ద సాగిలపడింది లేదని స్పష్టం చేశారు.
Also Read: పోలీస్ శాఖలో గ్యాంగ్‌స్టర్.. చివరకు భలే దొరికాడు
ఈ తన రాజకీయ జీవితంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ.. తెలంగాణ రాష్ట్రంలో కానీ.. ఏ మూలకు వెళ్లినా అక్కడ అభివృద్ధి ఆనవాళ్లలో తన గుర్తులు కనిపిస్తాయన్నారు. సాగునీటి ప్రాజెక్టులైనా, జాతీయ రహదారులైనా వాటి నిర్మాణంలో తన పాత్ర, తన శ్రమ ఉంటుందని తెలిపారు. మీరు పుట్టి పెరిగిన నిజామాబాద్ జిల్లాలోనే కౌలాస్ నాలా, సింగీతం కల్యాణి, లక్ష్మీ కెనాల్, శారదా సాగర్, లక్ష్మీ సాగర్, ఇందల్వాయి, గుత్ప లిఫ్ట్ ఇరిగేషన్ రూపకల్పన నుండి పూర్తి చేయడం వరకు ఉమ్మడి రాష్ట్రంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జరిగినవేనని ఈ లేఖలో గుర్తు చేశారు. ఆ సమయంలో మీ నాన్నగారు ఉన్నారు కానీ.. మీరు ఎక్కడ, ఏ పార్టీలో ఉన్నారో కూడా తనకు తెలియదన్నారు. స్వర్గీయ పీవీ నర్సింహారావు హయాంలో వరద కాల్వ మంజూరు చేయించడంలో తన పాత్ర గురించి మీ జిల్లా ప్రజలను, నాయకులను అడిగి తెలుసుకుంటే మంచిదంటూ ఎంపీ దర్మపూరి అరవింద్‌కు హితవు పలికారు.
ప్రస్తుతం రాష్ట్రంలో నిర్మాణమైన, నిర్మాణంలోనున్న ఏ జాతీయ రహదారి తీసుకున్నా.. వాటి మంజూరులో, నిర్మాణంలో తన ప్రయత్నంతోపాటు ప్రమేయం సైతం ఉందని స్పష్టం చేశారు. మీరు పార్టీలో కేంద్ర మంత్రులుగా పని చేసిన, చేస్తున్న శ్రీ నితిన్ గడ్కరి గారిని, శ్రీ కిషన్ రెడ్డి గారిని అడిగితే తన పాత్ర, ప్రమేయం గురించి వారే వివరిస్తారన్నారు. ముఖ్యమంత్రులు ఎవరైనా, వారి సహకారం తీసుకుని రాష్ట్రాభివృద్ధి కోసం పని చేశానని స్పష్టం చేశారు. జైకా నిధులతో ORR ప్రారంభించడం వెనుక తన పాత్ర ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నిర్మించిన అన్ని రహదారులు, నీటిపారుదల ప్రాజెక్టులు (కాళేశ్వరం మినహా) తన ప్రమేయం లేకుండా జరిగింది లేదన్నారు.
Also Read: మరికొద్ది రోజుల్లో బడ్జెట్.. వీటిని గమనించండి
మీరు మొదటి సారి ఎన్నికల్లో నిలబడినప్పుడు, ప్రజలకు రాసిచ్చిన బాండ్ పేపరు గురించి తానిక్కడ ప్రస్తావించ లేదని.. ఎందుకంటే ఆ సమయంలో తాను నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖకు సంబంధం లేదని కుండ బద్దలు కొట్టారు. తాజాగా తాను వ్యవసాయ శాఖ మంత్రి హోదాలో జాతీయ పసుపు బోర్డు సాధించుకోవడం తన బాధ్యతగా భావించి కేంద్రంపై ఒత్తిడి తీసుకు వస్తూ వచ్చానని తెలిపారు. పసుపు బోర్డు ప్రకటించిన సందర్భంగా ప్రధాన మంత్రి గారికి ధన్యవాదాలు తెలిపానని.. దీంట్లో మీకున్న అభ్యంతరం ఏమిటి? మీ ఆవేదన, ఆక్రోశం దేని కోసం? బోర్డు ప్రకటన, ఏర్పాటు విషయంలో మీరు సమాఖ్య స్ఫూర్తిని ప్రదర్శించ లేదు.
Also Read: ఏఐసీసీ కార్యాలయం ప్రారంభం.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
అయినా రైతుల ప్రయోజనాల దృష్ట్యా తాము సంయమనం పాటించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున బోర్డు ఏర్పాటు విషయంలో తగినంత సహకారం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని గతంలోనే కేంద్రానికి తెలియజేశామన్నారు. ఇక బోధన్ చక్కెర కర్మాగారం గురించి సైతం మీరు ప్రస్తావించారని.. ఇది రాష్ట్ర పరిశ్రమల శాఖ పరిధిలోని అంశమని.. అయినా మంత్రివర్గ సభ్యుడిగా తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. సంబంధిత మంత్రితో మాట్లాడి.. ఏం చేయాలి.. ఎలా చేయాలో అది చేస్తామని ఈ లేఖ ద్వారా ఎంపీ దర్మపురి అరవింద్‌కు స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో.. స్థాయి దిగజార్చుకుని మీరు మాట్లాడిన మాటలు సరైనవి కావని తాను భావిస్తున్నానన్నారు. రెండు పర్యాయాలు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైన మీరు ఇంతటి అధమ భాషను వాడటం సభ్యత అనిపించుకోదని ఎంపీ అరవింద్‌కు సూచించారు. పరిపక్వత లేని మాటలు మాట్లడకుండా, కొద్దిగా సహనంతో, రాజకీయ పరిజ్ఙానంతో మాట్లాడితే బాగుంటుందని ఆయనకు హితవు పలుకుతున్నానన్నారు. మీ వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూన్నానని.. వాటిని మీ విజ్ఞతకే వదిలేస్తున్నానంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
For Telangana News And Telugu News
Updated Date - Jan 15 , 2025 | 06:07 PM