JNTU: జేఎన్‌టీయూలో.. 30 ఏళ్లుగా అరకొర వేతనాలే
ABN, Publish Date - Jan 03 , 2025 | 10:18 AM
జేఎన్‌టీయూ(JNTU)లో 30 ఏళ్లుగా పనిచేస్తున్న తమకు ఇంకా అరకొర వేతనాలే ఇస్తున్నారని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. వారంతా యూనివర్సిటీ ఇన్‌చార్జ్ వీసీ బాలకిష్టారెడ్డి(University in-charge VC Balakishta Reddy)ని కలిసి తమగోడు వెళ్లబోసుకున్నారు.
- పెంచాలంటూ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేడుకోలు
హైదరాబాద్ సిటీ: జేఎన్‌టీయూ(JNTU)లో 30 ఏళ్లుగా పనిచేస్తున్న తమకు ఇంకా అరకొర వేతనాలే ఇస్తున్నారని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. వారంతా యూనివర్సిటీ ఇన్‌చార్జ్ వీసీ బాలకిష్టారెడ్డి(University in-charge VC Balakishta Reddy)ని కలిసి తమగోడు వెళ్లబోసుకున్నారు. 1995 నుంచి ఔట్‌సోర్సింగ్ కింద సుమారు 1,000 మంది ఉద్యోగులు వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారని, ఇందులో ఎక్కువమంది మరో ఐదారేళ్లలో పదవీవిరమణ కూడా చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికీ అటెండరు, డ్రైవర్లకు నెలకు రూ.13వేలలోపే వేతనాలు చేతికి వస్తున్నాయని వీసీ దృష్టికి తెచ్చారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: పండగలకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు..
చాలీచాలని వేతనాలతో కుటుంబ పోషణ దుర్భరంగా మారిందని, 2018 తర్వాత(ఏడేళ్లుగా) తమకు వేతనాలు ఒక్క రూపాయి కూడా పెరగలేదని వాపోయారు. యూనివర్సిటీలో రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నా.. వేతనాల్లో మాత్రం ఎంతో వ్యత్యాసం ఉంటోందని చెప్పారు. ఇప్పటికీ క్లర్కులకు రూ. 17 వేలు, డీపీఓలకు రూ. 20వేలు మాత్రమే చేతికి వస్తోందన్నారు. వేతనాల పెంపుకోసం ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితంలేదని వాపోయారు.
కొత్త సంవత్సరంలోనైనా వేతన పెంపుపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇన్‌చార్జి వీసీ స్పందిస్తూ.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాల పెంపు అంశం ప్రభుత్వ పరిధిలోనిదని చెప్పారు. త్వరలోనే వర్సిటీ ఉన్నతాధికారులతో కమిటీ వేసి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు తగిన విధంగా న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. వీసీని కలిసిన వారిలో మహేశ్, నర్సింగరావు, వేణుగోపాల్ తదితరులున్నారు.
కాంట్రాక్టు అధ్యాపకుల ఆందోళన
జేఎన్‌టీయూలో సేవలందిస్తున్న తమకు ఇతర యూనివర్సిటీల్లో మాదిరిగా వేతనాలను పెంచాలని పలువురు కాంట్రాక్టు అధ్యాపకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జవహర్‌లాల్ నెహ్రూ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. వర్సిటీలోని కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తూ అనారోగ్యంతో మృతిచెందిన కాంట్రాక్టు అధ్యాపకుడు దీపాంకర్ దాస్ కుటుంబానికి పరిహారం అందించాలని జేఎన్‌టీయూ ఇన్‌చార్జి వీసీ బాలకిష్టారెడ్డికి విన్నవించారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుడు మరణిస్తే.. అక్కడి యాజమాన్యం రూ.5లక్షల పరిహారం అందజేసిందని వివరించారు. ఆందోళనలో కాంట్రాక్టు అధ్యాపకులు డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, అశోక్, శరత్, కరుణాకర్‌రెడ్డి, రంజిత్, రాజేశ్, నరేశ్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Formula E Race: ఇదేం ఫార్ములా?
ఈవార్తను కూడా చదవండి: 765 చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్ధారణ
ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ: హరీశ్ రావు
ఈవార్తను కూడా చదవండి: అన్నదాతలకు రేవంత్ సున్నంపెట్టే ప్రయత్నం
Read Latest Telangana News and National News
Updated Date - Jan 03 , 2025 | 10:18 AM