Mancherial: 15 రోజుల తేడాతో నవ దంపతుల ఆత్మహత్య!
ABN , Publish Date - Apr 14 , 2025 | 04:36 AM
కులాలు వేరుకావడంతో పెద్దలను కాదని వివాహం చేసుకున్న ఆ యువజంట పెళ్లి ప్రయాణం ఆర్నెల్లలోనే విషాదాంతమైంది. భర్త ఆత్మహత్య చేసుకోగా, 15 రోజుల్లోనే భార్య కూడా బలవన్మరణానికి పాల్పడింది.

ఆర్నెల్ల క్రితం పెళ్లి.. మంచిర్యాల జిల్లాలో ఘటన
కోటపల్లి, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): కులాలు వేరుకావడంతో పెద్దలను కాదని వివాహం చేసుకున్న ఆ యువజంట పెళ్లి ప్రయాణం ఆర్నెల్లలోనే విషాదాంతమైంది. వివాహం జరిగిన ఆరు నెలలకే భర్త ఆత్మహత్య చేసుకోగా, ఆ తర్వాత 15 రోజుల్లోనే భార్య కూడా బలవన్మరణానికి పాల్పడింది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం దేవులవాడ గ్రామంలో ఈ విషాదం జరిగింది. గాదె సృజన (20) లక్షెట్టిపేటలోని ఓ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది. అదే కళాశాలలో సీనియర్ అయిన విష్ణువర్దన్‌తో సృజనకు స్నేహం ఏర్పడి, ప్రేమకు దారి తీసింది. కులాలు వేరు కావడంతో పెళ్లికి ఇరుకుటుంబాల వారు అభ్యంతరం చెప్పారనే ఉద్దేశంతో స్నేహితుల సహకారంతో ఆర్నెల్లక్రితం పెళ్లి చేసుకున్నారు.
లక్షెట్టిపేటలోనే వేరు కాపురం పెట్టారు. అన్యోన్యంగా జీవనం సాగిస్తున్న దశలో ఏం జరిగిందో ఏమో కానీ విష్ణువర్ధన్ మార్చి 24న గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సృజన కుటుంబీకులు అక్కడకు వెళ్లి అంతిమ సంస్కారాలయ్యాక సృజనను దేవులవాడలోని ఇంటికి తీసుకెళ్లారు. ప్రేమ పెళ్లి చేసుకోవడం, అంతలోనే భర్త ఆత్మహత్యకు పాల్పడటంతో సృజన మానసికంగా కుంగిపోయింది. శనివారం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.