Document Registration: రిజిస్ట్రేషన్లకు.. రేపటి నుంచే స్లాట్ బుకింగ్
ABN , Publish Date - Apr 09 , 2025 | 04:05 AM
డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం ఇకపై దళారులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు.. కార్యాలయానికి వెళ్లి గంటల కొద్దీ పడిగాపులు కాయాల్సిన పని లేదు.

22 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో.. ప్రయోగాత్మకంగా అమలుకు ఏర్పాట్లు
10-15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి
కార్యాలయాల్లో పడిగాపులకు ఇకపై తెర
రోజుకు 48 స్లాట్‌లు అందుబాటులో
డిమాండ్ ఉంటే స్లాట్‌లు పెంచే వీలు
బుకింగ్ లేకుండా వచ్చేవారి కోసం.. రోజుకు 5 రిజిస్ట్రేషన్లకు అనుమతి
హైదరాబాద్, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం ఇకపై దళారులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు.. కార్యాలయానికి వెళ్లి గంటల కొద్దీ పడిగాపులు కాయాల్సిన పని లేదు. మధ్యవర్తుల ద్వారా సబ్ రిజిస్ట్రార్‌ను ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇంటివద్ద నుంచే ఆన్‌లైన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుని, ఇచ్చిన సమయానికి కార్యాలయానికి వెళితే.. 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలో రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఈ స్లాట్ బుకింగ్ విధానాన్ని బుధవారం నుంచే రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి ప్రభుత్వం సన్నద్ధమైంది. రాష్ట్రంలోని 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకుగాను 22 కార్యాలయాల్లో దీనిని అమలు చేయనున్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ చర్యలు చేపడుతోంది. కాగా, ఒకేరోజు ఒకే సమయంలో ఎక్కువ డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ కోసం సమర్పించడం వల్ల జరిగే జాప్యాన్ని నివారించడానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని రోజువారీ పనివేళలను 48 స్లాట్‌లుగా విభజించారు.
ప్రజలు నేరుగా వెబ్ సైట్ ద్వారా తమకు అనుకూలమైన తేదీ, సమయాన్ని ఎంపిక చేసుకుని స్లాట్ బుక్ చేసుకునే వెసులబాటు కల్పించారు. తమకు కేటాయించిన సమయానికి వచ్చి రిజిస్ర్టేషన్ పూర్తి చేసుకుని వెళ్లిపోవచ్చు. స్లాట్ బుక్ చేసుకోలేని వారి కోసం ఏదైనా అత్యవసర సందర్భాల్లో రోజూ సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు 5 వాక్ ఇన్ రిజిస్ర్టేషన్లను అనుమతిస్తారు. నేరుగా కార్యాలయానికి వచ్చిన వారికి ఫస్ట్‌కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతిలో ఈ రిజిస్ర్టేషన్ చేస్తారు. ప్రజలకు సులువుగా, వేగవంతంగా, పారదర్శకంగా, అవినీతి రహితంగా సమర్థవంతమైన సేవలందించేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దుతున్నామని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తొలుత ఈ కేంద్రాల్లోనే..
స్లాట్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్న 22 కేంద్రాలు హైదరాబాద్‌లో ఆజంపుర, చిక్కడపల్లి, సంగారెడ్డి జిల్లా సదాశివపేట, మేడ్చల్ జిల్లాలో కుత్బుల్లాపూర్ వల్లభ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలో శంషాబాద్, సరూర్‌నగర్, చంపాపేట ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో రామగుండం, ఖమ్మం జిల్లాలో కూసుమంచి, ఖమ్మం ఆర్వో, మహబూబ్‌నగర్ ఆర్వో ఉన్నాయి. అలాగే జగిత్యాల, నిర్మల్, వరంగల్ పోర్ట్, వరంగల్ గ్రామీణ, కొత్తగూడెం, ఆర్మూర్, భువనగిరి, చౌటుప్పల్, నాగర్ కర్నూల్ కేంద్రాల్లో ఈ విధానం అందుబాటులోకి రానుంది. ఈ కేంద్రాల్లో స్లాట్ బుకింగ్ లేకుండా రిజిస్ట్రేషన్‌కు వచ్చేవారిని అనుమతించరు. రోజుకు 40కిపైగా రిజిస్ర్టేషన్లు జరిగే కేంద్రాలనే స్లాట్ బుకింగ్ ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు ఎంపిక చేశారు.
ఎక్కువ రిజిస్ర్టేషన్లు అయ్యే సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని సులభతరం చేయడానికి 48 స్లాట్ల కన్నా ఎక్కువ అవసరం ఉంటే.. అలాంటి చోట్ల అదనపు సిబ్బందిని నియమిస్తారు. ఎక్కువ రిజిస్ర్టేషన్లు జరిగే కుత్బుల్లాపూర్ రిజిస్ర్టేషన్ కార్యాలయంలో అదనంగా మరో ఇద్దరు సబ్ రిజిస్టార్లను నియమించారు. తద్వారా ఈ కార్యాలయంలో 144 స్లాట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇక రిజిస్ట్రేషన్‌కు ముందు ఈసీ పరిశీలన తప్పనిసరి చేయడానికి.. రిజిస్ర్టేషన్ చట్టంలో సెక్షన్ 22కు సవరణ చేసి 22(బి) తీసుకురావాలని ప్రతిపాదించారు. ఈ అంశం ప్రస్తుతం న్యాయశాఖ పరిశీలనలో ఉంది. క్యాబినెట్ అనుమతి తరువాత దీనిని అసెంబ్లీ సమావేశాల్లో పెట్టి.. గరవ్నర్ ఆమోదం అనంతరం రాష్ట్రపతి ఆమోదానికి పంపనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
సింహానికి చుక్కలు చూపించిన తేనెటీగలు..
సిట్ కస్టడీకి ‘కల్తీ నెయ్యి’ నిందితులు
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here