Justice Sujay Pal: హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ సుజాయ్ పాల్
ABN, Publish Date - Jan 16 , 2025 | 03:50 AM
తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ సుజాయ్‌పాల్‌ను రాష్ట్రపతి నియమించారు. ఈ నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
రాష్ట్రపతి ఆమోదం.. న్యాయశాఖ ఉత్తర్వులు
హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జిలు
కేంద్రానికి కొలీజియం ప్రతిపాదనలు
న్యూఢిల్లీ, హైదరాబాద్, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ సుజాయ్‌పాల్‌ను రాష్ట్రపతి నియమించారు. ఈ నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీచేసింది. అలోక్ అరాధే.. బాంబే హైకోర్టు సీజేగా బదిలీ అయిన నేపథ్యంలో తదుపరి సీనియర్ జడ్జి అయిన జస్టిస్ సుజాయ్‌పాల్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. మధ్యప్రదేశ్ రాష్ర్టానికి చెందిన జస్టిస్ సుజాయ్ పాల్ 1964లో జన్మించారు. 1990లో మధ్యప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకుని.. సివిల్, పారిశ్రామిక, సర్వీస్, కాన్‌స్టిట్యూషనల్ లా తదితర విభాగాల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2011లో మధ్యప్రదేశ్ హైకోర్టు జబల్‌పూర్ బెంచ్‌లో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2014లో శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. గతేడాది మార్చి 26న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు.
కాగా, తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నలుగురు న్యాయమూర్తులు నియామకం కానున్నారు. సీనియర్ న్యాయాధికారులు రేణుక యార, నందికొండ నర్సింగ్‌రావు, ఈ తిరుమల దేవి, బీఆర్ మధుసూదన్‌రావును హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. వీరి నియామకాలకు రాష్ట్రపతి ఆమోదం లభించగానే వీరు ప్రమాణ స్వీకారం చేస్తారు. రేణుక యార ప్రస్తుతం హైదరాబాద్, సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా, నందికొండ నర్సింగ్‌రావు సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా, ఈ తిరుమలదేవి హైకోర్టు రిజిస్ర్టార్ జనరల్‌గా పనిచేస్తున్నారు. తిరుమలదేవి విజిలెన్స్ రిజిస్ర్టార్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. బీఆర్ మధుసూదన్‌రావు ప్రస్తుతం హైకోర్టు అడ్మినిస్ర్టేటివ్ రిజిస్ర్టార్‌గా పనిచేస్తున్నారు. రిజిస్ర్టార్ ఎంక్వైరీ్‌సగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హైకోర్టులో 42 మంది న్యాయమూర్తులకుగాను ప్రస్తుతం 26మంది ఉన్నారు. నియామకాలు జరిగితే ఆ సంఖ్య 30 అవుతుంది.
విద్యాభ్యాసం హైదరాబాద్‌లోనే..
రేణుక యార ప్రస్తుతం సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1973 జూన్ 14న ఐలయ్య, నాగమణి దంపతులకు హైదరాబాద్‌లో జన్మించారు. విద్యాభ్యాసమంతా హైదరాబాద్‌లోనే పూర్తిచేశారు. 1998లో న్యాయవిద్య పూర్తి చేసి, బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు అయ్యారు. కొన్నాళ్లు ప్రాక్టీస్ చేశాక 2012లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శితో పాటు వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఆమె పనిచేశారు.
విశ్వవిద్యాలయంలో న్యాయవిద్య
మధుసూదన్‌రావు బొబ్బిలి రామయ్య ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రార్‌గా ఉన్నారు. 1969 మే 25న అనసూయ, ఎల్లయ్య దంపతులకు ఖాజీపేటలో జన్మించారు. కాకతీయ వర్సిటీలో న్యాయవిద్య పూర్తి చేశారు. 1998లో న్యాయవాదిగా నమోదై, 2012లో జిల్లా జడ్జి అయ్యారు. నెల్లూరు, చిత్తూరు, మేడ్చల్ మల్కాజిగిరి సహా సీబీఐ కోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. రాష్ట్ర వ్యాట్ అప్పిలేట్ ట్రైబ్యునల్, మేడ్చల్ మల్కాజిగిరి ప్రిన్సిపల్ జడ్జి, రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శిగా పని చేశారు.
సెయింట్ ఆన్స్‌లో చదివి..
ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, రిజిస్ట్రార్ విజిలెన్స్‌గా ఉన్న తిరుమలాదేవి 1964 జూన్ 2న సంగారెడ్డిలో జన్మించారు. లా పూర్తిచేశాక హైకోర్టు, సిటీ కోర్టులలో కొన్నాళ్లు న్యాయవాదిగా పనిచేశారు. 2012లో జిల్లా జడ్జిగా ఎంపికై తొలుత నిజామాబాద్‌లోని ఎస్సీ, ఎస్టీ కోర్టు స్పెషల్ జడ్జిగా విధులు నిర్వహించారు. ఖమ్మం జిల్లా కోర్టు ప్రిన్సిపల్ జడ్జి సహా వరంగల్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్ జడ్జిగా కీలక కేసుల విచారణ చేపట్టారు. హైకోర్టు రిజిస్ట్రార్‌గా, తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు.
జిల్లా జడ్జి నుంచి..
ప్రస్తుతం సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా ఉన్న నర్సింగ్‌రావు నందికొండ.. పెంటయ్య, మణెమ్మ దంపతులకు 1969 మే 3న జన్మించారు. 1995లో న్యాయవిద్య పూర్తి చేశారు. 2012లో జిల్లా జడ్జిగా ఎంపికై విశాఖపట్నం అదనపు జడ్జిగా చేశారు. న్యాయ శాఖ కార్యదర్శిగా, హైకోర్టు రిజిస్ట్రార్‌గా, గుంటూరు, వరంగల్, రంగారెడ్డి కోర్టులు, జ్యుడీషియల్ అకాడమీలలోనూ పనిచేశారు.
Updated Date - Jan 16 , 2025 | 03:50 AM