Kaleshwaram Project: సంచలన విషయాలు బయటపెట్టిన ఎల్ అండ్ టీ..
ABN, Publish Date - Jan 24 , 2025 | 02:51 PM
Kaleshwaram Commission: మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు వ్యవహారంలో ఎల్ అండ్ టీ ప్రతినిధులను కాళేశ్వరం కమిషన్ విచారించింది. ఈ విచారణలో సంస్థ ప్రతినిధులు కీలక వివరాలను బహిర్గతం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ గురించి ఎల్ అండ్ టీ ప్రతినిధులు చెప్పిన హాట్ హాట్ నిజాలను ఇప్పుడు తెలుసుకుందాం..

హైదరాబాద్, జనవరి 24: కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలపై కమిషన్ శుక్రవారం చేపట్టిన విచారణ ముగిసింది. విచారణకు హాజరైన ఎల్ అండ్ టీ ప్రతినిధులు కీలక విషయాలను వెల్లడించారు. ఎల్ అండ్ టీ ప్రాజెక్టు డైరెక్టర్ రామకృష్ణ రాజు, వైస్ చైర్మన్ సురేష్, రజినీష్.. కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ప్రాజెక్టు నిర్మాణం, నాణ్యత, బ్లాక్ సెవెన్ కుంగుబాటుపై కమిషన్ వరుస ప్రశ్నలు సంధించగా.. ఎల్ అండ్ టీ ప్రతినిధులు కీలక విషయాలను బహిర్గతం చేశారు. నిర్మాణంలో నాణ్యత పాటించారా అని కమిషన్ ప్రశ్నించగా.. వంద శాతం క్వాలిటీ నిర్మాణం చేశామని ఎల్ అండ్ టి ప్రతినిధులు సమాధానమిచ్చారు. నీటిపారుదల శాఖ ఇచ్చిన డిజైన్స్, డ్రాయింగ్స్ ప్రకారమే మేడిగడ్డ ఆనకట్ట నిర్మించామన్నారు. డిజైన్‌లో అంచనా వేసిన ప్రవాహ వేగం కంటే ఎక్కువగా ఉన్నందునే ఆనకట్ట దిగువన అప్రాన్, సీసీ బ్లాకులు దెబ్బతిన్నాయని ప్రతినిధులు తెలిపారు. ఈ కారణంగానే ప్రాజెక్టు బ్లాకులు కుంగినట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.
నీరు నిల్వ చేసిన మొదటి సీజన్ తరువాతే మేడిగడ్డ ఆనకట్టలో సమస్యలు తలెత్తాయని ఎల్ అండ్ టీ ప్రతినిధులు.. కమిషన్‌కు తెలిపారు. సమస్యలు పరిష్కరించేందుకు తగిన డిజైన్స్ ఇవ్వాలని నీటిపారుదల శాఖను కోరామన్నారు. నాలుగేళ్లు అయినా నీటిపారుదల శాఖ నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. 2019 లోనే లోపాలను పరిష్కరించి ఉంటే మేడిగడ్డ ఆనకట్టకు ఇంత ప్రమాదం వాటిల్లేది కాదని ఎల్ అండ్ ప్రతినిధులు చెప్పారు. ప్రారంభం నుంచి కుంగే వరకు ఆనకట్ట ఎప్పుడూ ఖాళీగా లేదని పేర్కొన్నారు. సమస్యలు కొనసాగుతూనే వచ్చి ఆ ప్రభావం ఏడో బ్లాక్‌పై పడి ఉండవచ్చన్న ఎల్ అండ్ టి ప్రతినిధులు చెప్పారు.
ఇక మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణంలో ఎలాంటి సబ్ కాంట్రాక్టులు ఇవ్వలేదని ఎల్ అండ్ టీ ప్రతినిధులు.. కాళేశ్వరం కమిషన్‌కు తెలిపారు. కాఫర్ డ్యామ్‌కి సంబంధించి ఎలాంటి అనదపు డబ్బులు ప్రభుత్వం చెల్లించలేదన్నారు. ఆనకట్ట పూర్తి అయినట్లు ధృవీకరణ పత్రం కూడా ఇచ్చారని.. డిఫెక్ట్ లయబిలిటీ గడువు కూడా పూర్తి అయ్యిందని ఎల్ అండ్ టీ ప్రతినిధులు తెలిపారు. అయితే, కుంగిన బ్లాక్‌ను రిపేర్ చేయొచ్చా అని కమిషన్ ప్రశ్నించగా.. విభిన్న సమాధానాలు చెప్పారు ఎల్ అండ్ టి ప్రతినిధులు.
Also Read:
ముగిసిన సోదాలు.. ఐటీ ఏం తేల్చిందంటే
వాట్ ఈజ్ దిస్ నాన్సెన్స్.. మంత్రి ఆగ్రహం
For More Telangana News and Telugu News..
Updated Date - Jan 24 , 2025 | 02:51 PM