కాంగ్రెస్ నేతలకు తప్పని నిరీక్షణ
ABN , Publish Date - Apr 13 , 2025 | 01:02 AM
నామినేటెడ్ పదవుల కోసం కాంగ్రెస్ నేతలకు నిరీక్షణ తప్పడం లేదు. పార్టీ అధికారంలోకి వచ్చి యేడాదిన్నర అవుతున్నా నామినేటెడ్ పదవుల నియామకంలో ఇంకా కొన్ని అవకాశాలను భర్తీ చేయడం లేదు. ప్రధానంగా జిల్లా, నియోజకవర్గ స్థాయి పలు పదవులతో పాటు, గ్రంథాలయ సంస్థ చైర్మన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ, ఆలయాల చైర్మన్ల పదవులపై కన్నేసిన నాయకులు నిర్విరామంగా తమ ప్రయత్నాలను కొనసాగిస్తునే ఉన్నారు.

జగిత్యాల, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): నామినేటెడ్ పదవుల కోసం కాంగ్రెస్ నేతలకు నిరీక్షణ తప్పడం లేదు. పార్టీ అధికారంలోకి వచ్చి యేడాదిన్నర అవుతున్నా నామినేటెడ్ పదవుల నియామకంలో ఇంకా కొన్ని అవకాశాలను భర్తీ చేయడం లేదు. ప్రధానంగా జిల్లా, నియోజకవర్గ స్థాయి పలు పదవులతో పాటు, గ్రంథాలయ సంస్థ చైర్మన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ, ఆలయాల చైర్మన్ల పదవులపై కన్నేసిన నాయకులు నిర్విరామంగా తమ ప్రయత్నాలను కొనసాగిస్తునే ఉన్నారు. పార్టీలో సీనియర్లకు పెద్దపీట వేయాలనే ఆలోచనతో పీసీసీ నేతలు ఉండడం, మంత్రివర్గ విస్తరణ తర్వాత నామినేటెడ్ పదువలపై నిర్ణయాలు తీసుకుటామని ఎమ్మెల్యేలకు, పార్టీ ఇన్‌చార్జిలకు తెలియజేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో నామినేటెడ్ పదవుల భర్తీపై ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. ఈ క్రమంలో సంవత్సరాల తరబడి పార్టీలో పనిచేశాం... అయినా సరైనా గుర్తింపు దక్కడం లేదన్న నైరాశ్యం కొంతమంది కాంగ్రెస్ నేతల్లో నెలకొంది.
జిల్లాలో రాజకీయ పరిస్థితి ఇలా...
జిల్లాలో సుమారు ఏడాదిన్నర క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విజయం సాధించి ప్రస్తుతం ప్రభుత్వ విప్‌గా వ్యవహరిస్తున్నారు. జగిత్యాలలో బీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ గెలుపొందినప్పటికీ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా సంజయ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు. అదేవిధంగా కోరుట్లలో బీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గెలుపొందగా, చొప్పదండి, వేములవాడ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు మేడిపల్లి సత్యం, ఆది శ్రీనివాస్ గెలుపొందారు. నామినేటెడ్ పదవుల భర్తీలో ఆయా నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిల పాత్ర కీలకంగా ఉంటుంది. వీరు ప్రతిపాదించిన వారికే నామినేటెడ్ పదవులు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
స్థానిక ఎన్నికల తర్వాతేనా..?
ప్రత్యేకాధికారుల పాలనతో కొనసాగుతున్న గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలకవర్గాలకు ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో గ్రామ, మండల, జిల్లా స్థాయిలో స్థానిక సంస్థల్లోనూ కీలకమైన ఎంపీపీ, జడ్పీటీసీ, జడ్పీ చైర్మన్ పదువులపైనా చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటి నుంచే జోరుగా నమ్మకంతో నేతల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్న వారికి కాకుండా నామినేటెడ్ పదవుల్లో అవకాశం కాకుండా మిగిలిని వారికి ఇచ్చే చాన్స్ ఉందన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. దీనికి తోడు పార్టీలో పదేళ్లు పైబడి పనిచేసినవారికి ముందు ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్ ఇటీవల తెలిపిన అంశం సైతం చర్చల్లోకి వస్తోంది. ఈ పరిణామాలన్నీ కూడా నామినేటెడ్ పదవులను సీనియర్లకే అన్నట్లుగా సుస్పష్టం చేస్తున్నాయి. అంతేకాకుండా పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా పనిచేసిన నేతలకే అవకాశాలు దక్కుతాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
జగిత్యాల కాంగ్రెస్‌లో ప్రత్యేక పరిస్థితి..
జిల్లాలోని జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో ప్రత్యేక పరిస్థితి నెలకొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సీనియర్ నేత తాటిపర్తి జీవన్‌రెడ్డి విజయం సాధించలేకపోయారు. బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ గెలుపొందారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో కండువాను మార్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పనిచేసిన ద్వితీయ శ్రేణి నాయకులకు నామినేటెడ్ పదవులు దక్కాలని, కాంట్రాక్టు పనులు గానీ, ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యం గానీ దక్కాలని జీవన్‌రెడ్డి వర్గీయులు వాదిస్తున్నారు. రాష్ట్ర, జిల్లాస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతినిధులతో, కాంగ్రెస్ నేతలతో చనువుగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వర్గీయులు సైతం పదువులు, పనులు ఆశిస్తున్నారు. దీంతో జగిత్యాల నియోజకవర్గంలో పదువులు, కాంట్రాక్టు పనులు ఎవరు దక్కుతాయోనని సందిగ్ధ పరిస్థితి నెలకొంది.
జిల్లా, నియోజకవర్గ పదవులపై ఆశలు...
నామినేటెడ్ పదవుల్లో రాష్ట్రస్థాయితో పాటు జిల్లా, నియోజకవర్గ స్థాయిలో పలు పదవులున్నాయి. మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు, ఆలయాల కమిటీలు, గ్రంథాలయ కమిటీలతో పాటు మరికొన్ని సైతం ఉన్నాయి. ఇందులో మార్కెట్లు, ఆలయాల కమిటీ, గ్రంథాలయ కమిటీ చైర్మన్ల పదవులకు ఎక్కువగా డిమాండ్ ఉంది. ఈ పదవులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశావహులకు లింక్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో ఇప్పటికే కొన్ని మార్కెట్ కమిటీలు, ఆలయాల కమిటీలు భర్తీ కావడం, మరికొన్ని పెండింగ్‌లో ఉండడం వంటి పరిస్థితులు ఉన్నాయి. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు పాలకవర్గాల నియామకాల ప్రక్రియ ముందుకు వెళ్లడం లేదన్న అభిప్రాయాలున్నాయి. దీనంతటికి మంత్రివర్గ కూర్పు లేకపోవడమే కారణమని, స్థానిక సంస్థల ఎన్నికల ప్రభావం సైతం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. నామినేటెడ్ పదవుల భర్తీ ఎప్పుడు ఉంటుందో...తమను పదవులు ఎప్పుడు వరిస్తాయోనని ద్వితీయ శ్రేణి కాంగ్రెస్ నాయకులు ఎదురుచూపులతో గడుపుతున్నారు.