ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ పూర్తి చేయాలి
ABN , Publish Date - Apr 15 , 2025 | 11:41 PM
జిల్లాలోని అన్ని మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

కరీంనగర్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలోని అన్ని మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో కొంత మందికి ఇళ్లు మంజూరు చేశామని, మిగిలిన ఇళ్లను గ్రామాలు, మున్సిపల్ వార్డుల వారీగా మంజూరు చేసేందుకు అలాట్‌మెంట్ జాబితా తయారు చేయాలన్నారు. లబ్ధిదారుల ఎంపికలో ఎటువంటి పొరపాట్లు జరగొద్దని, వచ్చిన దరఖాస్తుల్లో అత్యంత నిరుపేదలకు మాత్రమే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మంజూరైన ఇళ్లకు మార్కింగ్ పూర్తి చేయాలన్నారు. లబ్ధిదారులతో చర్చించి ఇళ్ల నిర్మాణం ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌లు లక్ష్మికిరణ్, ప్రపుల్ దేశాయ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేష్, జడ్పీ సీఈవో శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఫ భూభారతిపై ప్రజలకు అవగాహన కల్పించాలి
భూభారతిపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో భూభారతి నూతన రెవెన్యూ చట్టంపై తహసీల్దార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం రూపొందించిన భూభారతి చ్టంపై సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజల అభిప్రాయాల మేరకు సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం భూ భారతి చట్టం రూపొందించిందన్నారు. భూ భారతి చట్టంపై సదస్సుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. 17 నుంచి ప్రతి మండలంలో భూ భారతి నూతన రెవెన్యూ చట్టంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాల నిర్వహణకు షెడ్యూల్ రూపొందాని ఆదేశించారు. ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో ప్రజలకు సలహాలు, సూచనలు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేష్ పాల్గొన్నారు.
ఫ ఓపెన్ స్కూల్ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
జిల్లాలో ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రాస్తున్న వారంతా శ్రద్ధతో చదివి వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్, పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులతో మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో సన్నద్ధత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అనారోగ్యం, వివాహం, కటుంబ పరిస్థితులు వంటి వివిధ కారాణాల చేత చాలా మంది పాఠశాల విద్యను మధ్యలోనే ఆపేస్తున్నారని, వారంతా ఓపెన్ స్కూల్‌లో చేరాలని సూచించారు. ఈనెల 20 నుంచి నిర్వహించనున్న ఓపెన్ స్కూల్ పరీక్షలకు ఫీజు చెల్లించిన విద్యార్థులంతా తప్పక హజరై పరీక్ష రాయాలని సూచించారు. ఓపెన్ స్కూల్ తరగతులు గ్రంథాలయాల్లో నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని విద్యాధికారులను ఆదేశించారు. డీఈవో జనార్దన్‌రావు మాట్లాడుతూ పదో తరగతిలో 4421 మంది, ఇంటర్‌లో 881 మంది పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో క్వాలిటీ కో ఆర్డినేటర్ అశోక్‌రెడ్డి, జిల్లా సైన్స్ ఆఫీసర్ జైపాల్‌రెడ్డి, ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ సీహెచ్ నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.