Share News

karimnagar : ప్రాణాంతకంగా ఆహార కల్తీ

ABN , Publish Date - Apr 14 , 2025 | 12:45 AM

కోల్‌సిటీ, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): రెస్టారెంట్లు... హోటళ్లు... బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు.. టిఫిన్‌ సెంటర్లు... ఇలా ప్రతీ చోట నాణ్యత లేని ఆహార పదార్థాలు విక్రయిస్తుండడంతో ప్రజలకు ప్రాణసంకటంగా మారాయి.

karimnagar : ప్రాణాంతకంగా ఆహార కల్తీ

రెస్టారెంట్ల నుంచి టిఫిన్‌ సెంటర్ల వరకు ఇదే తంతు

కాలం చెల్లిన పదార్థాల వినియోగం

రంగు, రుచికి కెమికల్స్‌

తనిఖీ చేయని ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌, మున్సిపల్‌ యంత్రాంగం

పెరుగుతున్న ఫుడ్‌పాయిజన్‌ కేసులు

కోల్‌సిటీ, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): రెస్టారెంట్లు... హోటళ్లు... బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు.. టిఫిన్‌ సెంటర్లు... ఇలా ప్రతీ చోట నాణ్యత లేని ఆహార పదార్థాలు విక్రయిస్తుండడంతో ప్రజలకు ప్రాణసంకటంగా మారాయి. చిన్న పిల్లలు మొదలు వృద్ధుల వరకు జీర్ణాశయ, కాలేయ, హృదయ, కిడ్నీ సంబంధిత వ్యాధులతో సతమతమవుతున్నారు. కొందరు ప్రాణాలే పోగొట్టుకుంటున్నారు. ఆహార పదార్థాలను నాణ్యతను పరీక్షించాల్సిన ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఆయా మున్సిపాలిటీల హెల్త్‌, శానిటరీ విభాగం అధికారులు తనిఖిలే మరిచిపోయారు. మున్సపాలిటీలు వ్యాపారాలు చేసుకునేందుకు ట్రేడ్‌ లైసెన్స్‌లు ఇచ్చి చేతులెత్తేస్తున్నాయి. తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాల్సిన ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు ఎక్కడా కూడా తనిఖీలు చేసిన పాపాన పోవడం లేదు. దీంతో ఆహార కల్తీ అనేది సాధారణమైపోయింది.

పెద్దపల్లి జిల్లాలో రామగుండం నగరపాలక సంస్థతో పాటు పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌ మున్సిపాలిటీలు ఉన్నాయి. ప్రతీ మండల కేంద్రం నుంచి ప్రతి చిన్న పట్టణాల వరకు డాబాలు, రెస్టారెంట్లు, హోటల్స్‌, బేకరీలు, టిఫిన్‌ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, బార్‌అండ్‌రెస్టారెంట్లు ఉంటున్నాయి. సాధారణంగా మున్సిపాలిటీల పరిధిలో ఇలాంటి ఆహార పదార్థాలు విక్రయించే వ్యాపార సంస్థలకు ట్రేడ్‌ లైసెన్స్‌లు మంజూరు చేసే సమయంలో పారిశుధ్య విభాగం పారిశుధ్య నిర్వహణకు సంబంధించి వసతులను పరిశీలించుకోవాల్సి ఉంటుంది. ఫుడ్‌ఇన్‌స్పెక్టర్లు, మున్సిపల్‌ హెల్త్‌ విభాగం ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. కానీ ఎక్కడా కూడా తనిఖీలు జరుగడం లేదు. పైగా ట్రేడ్‌లైసెన్స్‌లు చెల్లించేందుకు కూడా వ్యాపార సంస్థలు ముందుకు రావడం లేదు.

ఫ నిల్వ పదార్థాల విక్రయం...

రెస్టారెంట్లు, బేకరీలు, ఫాస్‌ఫుడ్‌, బిర్యాణి సెంటర్లలో మూడు నాలుగు రోజుల నిల్వ పదార్థాలను కస్టమర్లకు విక్రయిస్తున్నారు. ప్రతీ రెస్టారెంట్‌లో ఒక ప్రత్యేకమైన రిఫ్రిజిరేటర్‌ను ఏర్పాటు చేసుకుని మిగిలిపోయిన మాంసం, ఇతర ఆహార పదార్థాలను అందులో నిల్వ ఉంచుతున్నారు. కబాబ్‌లు వంటివి మాంసాహార పదార్థాలను రెండు మూడు రోజులు నిల్వ ఉంచి కస్టమర్ల ఆర్డర్ల ప్రకారం వేడిచేసి విక్రయిస్తున్నారు. రంగు కోసం ఆర్టిఫిషియల్‌ కలర్స్‌, రుచి కోసం కెమికల్స్‌ వాడుతున్నారు. రెస్టారెంట్లు, బేకరీల్లో వినియోగించే నూనె, రసాయనాలు, మసాలాలు కల్తీమయంగా ఉంటున్నాయి. ఊరు పేరు లేని నూనెలను ఆహార పదార్థాల తయారీలో వినియోగిస్తుండగా, నాణ్యత లేని మసాలాలను వినియోగిస్తున్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పేరెన్నికగన్న పలు నిల్వ ఉంచిన ఆహార పదార్థాలనే విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్‌టీపీసీలోని ఒక రెస్టారెంట్‌లో ఈ తరహా ఆహారం వడ్డించడంతో కస్టమర్లు రెస్టారెంట్‌ నిర్వాహకుడితో గొడవపడ్డ ఉదంతం వెలుగు చూసింది. రెస్టారెంట్లలో రెండు మూడుసార్లు కాచిన నూనెను టిఫిన్‌ సెంటర్ల నిర్వాహకులకు నామమాత్రపు రేటుపై విక్రయిస్తున్నారు. టిఫిన్‌ సెంటర్లలో నాణ్యత లేని నూనెలను వినియోగిస్తుండడంతో ప్రజలు అనారోగ్యాల భారిన పడుతున్నారు.

ఫ ప్రాణాలతో చెలగాటం..

మేజర్‌ గ్రామాల నుంచి నగరాల వరకు ప్రతి చోట బేకరీలు వెలుస్తున్నాయి. కేక్‌లు, బన్‌లు, ఫఫ్‌లు, బ్రెడ్‌ ఇతర ఆహార పదార్థాలు తయారు చేసి విక్రయిస్తున్నారు. బేకరీలకు అనుబంధంగా నిర్వహించే ఖార్కానాల్లో కల్తీ ఆహార పదార్థాలు, రసాయనాలు వినియోగిస్తున్నారు. ఇటీవల రామగుండం నగర పాలక సంస్థ సిబ్బంది గోదావరిఖనిలోని ఒక బేకరీలో తనిఖీలు చేయగా కాలం చెల్లిన రసాయనాలు, ఇతర పదార్థాలు వినియోగిస్తున్నట్టు గుర్తించి రూ.20వేల అపరాధ రుసుము విధించారు. మార్కండేయకాలనీలోని ఒక రెస్టారెంట్‌లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు విక్రయిస్తుండడంతో ఎనిమిది వేల రూపాయల జరిమానా విధించారు. సాధారణంగా బేకరీల్లో పిల్లలు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. నాణ్యత లేని ముడి సరుకులతో తయారు చేసి ఆహార పదార్థాలు వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

ఫుడ్‌ పాయిజన్‌లతో ఉక్కిరిబిక్కిరి...

కల్తీ, నాణ్యత లేని ఆహార పదార్థాల విక్రయాలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా ఫుడ్‌పాయిజనింగ్‌కు గురవుతున్నారు. బిర్యాణి పాయింట్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, రెస్టారెంట్లు, టిఫిన్‌ సెంటర్లలో కొనుగోలు చేసిన ఆహార పదార్థాలు తినడంతో వారి ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం పడుతోం ది. ఫుడ్‌ పాయిజనింగ్‌కు గురవుతున్న వారిలో ఎక్కువగా చిన్న పిల్లలే ఉంటున్నట్టు వైద్య వర్గాలు పేర్కొంటున్నారు.

తనిఖీల ఊసే లేదు...

ఆహారాన్ని కల్తీ చేస్తే ఊచలు లెక్కబెట్టాల్సిందేనని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా కింది స్థాయి యంత్రాంగాలు మాత్రం కదలడం లేదు. ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు ఉమ్మడి జిల్లాల వారీగా పోస్టులు ఉండడంతో తనిఖీలకు రావడం లేదు. ఇక మున్సిపాలిటీల్లో శానిటరీ, హెల్త్‌ విభాగం అధికారులు, కమిషనర్లు తనిఖీలు చేసిన ఊసే లేదు. జిల్లాలోని మున్సిపాలిటీలకు కలెక్టర్‌, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలే ప్రత్యేక అధికారులుగా ఉన్నారు. అయినా కూడా యంత్రాంగంలో కదలికలు లేవు. అడపాదడప తనిఖీలు చేసి చేతులు దులుపుకుం టున్నారు. కొన్ని మున్సిపాలిటీల్లోనైతే ట్రేడ్‌ లైసెన్స్‌లు ఇచ్చే సమయంలోనే అదనపు వసూళ్లు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Updated Date - Apr 14 , 2025 | 12:45 AM