Share News

karimnagar : జగిత్యాల రూరల్‌ మండలం చల్‌గల్‌లో రహదారిపై ఆరబోసిన మక్కలు

ABN , Publish Date - Apr 14 , 2025 | 12:47 AM

జగిత్యాల, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): వరి, మొక్కజొన్న తదితర పంటల ఆరబోతకు రహదారులే కల్లాలుగా మారుతున్నాయి. పంట దిగుబడులను ఆరబోసుకోవడానికి ప్రభుత్వం కల్లాల నిర్మాణానికి గతంలో రాయితీని ప్రకటించగా సరియైన ప్రచారం లేకపోవడం వల్ల రైతులు సద్వినియోగం చేసుకోలేకపోయారు.

karimnagar :  జగిత్యాల రూరల్‌ మండలం చల్‌గల్‌లో రహదారిపై ఆరబోసిన మక్కలు

రహదారులే కల్లాలు..

-ప్రమాదాలకు నెలవుగా రోడ్లు

-వ్యవసాయ ఉత్పత్తుల ఆరబోతతో వాహనదారుల ఇక్కట్లు

-అధికారులు స్పందించాలని వినతి

జగిత్యాల, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): వరి, మొక్కజొన్న తదితర పంటల ఆరబోతకు రహదారులే కల్లాలుగా మారుతున్నాయి. పంట దిగుబడులను ఆరబోసుకోవడానికి ప్రభుత్వం కల్లాల నిర్మాణానికి గతంలో రాయితీని ప్రకటించగా సరియైన ప్రచారం లేకపోవడం వల్ల రైతులు సద్వినియోగం చేసుకోలేకపోయారు. జిల్లాలో ప్రతీ సంవత్సరం వానాకాలం, యాసంగి సీజన్లలో వరి, మొక్కజొన్న, సోయా తదితర పంటలు కోయగానే పలువురు రైతులు వాటిని రోడ్లపై ఆరబెడుతున్నారు. పగలు, రాత్రి రహదారులపైనే కుప్పగా పోసి ఆరబెడుతుండడంతో వాహనాదారులు చీకట్లో గుర్తించలేకపోతున్నారు. దీంతో ప్రతీ సీజన్‌లో పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడడం, ఒకరిద్దరు ప్రాణాలు కోల్పోతున్నారు. కోసిన పంటను ఆరబెట్టుకునేందుకు సిమెంటు కల్లాలు నిర్మించుకునేందుకు గత ప్రభుత్వం అవకాశమిచ్చింది. ఉపాధిహామీ పథకం ద్వారా వీటిని పూర్తి చేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ, ఈజీఎస్‌, పంచాయతీరాజ్‌ శాఖల సమన్వయంతో నిర్వహించారు. కల్లాల పరిమాణాలను బట్టి రూ.60 వేల నుంచి రూ.85 వేల వరకు బిల్లులు ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించారు. రైతులకు ఆసక్తి ఉన్నప్పటికీ గ్రౌండింగ్‌ చేయడంలో నిర్లక్ష్యం, బిల్లులు సకాలంలో చెల్లించడంలో అలసత్వం కారణంగా పనుల్లో ఆశించిన మేరకు పురోగతి రాలేదు. నెలల తరబడి నిరీక్షించలేక రైతులు వాటి జోలికి పోవడం లేదు.

ఫచేతికి వస్తున్న దిగుబడులు

యాసంగిలో సాగు చేసిన పంటలు ప్రస్తుతం చేతికి వస్తున్నాయి. వరి ధాన్యం, మొక్కజొన్న, సోయా వంటి పంటలను గత్యంతరం లేని పరిస్థితుల్లో రహదారులపై పోస్తున్నారు. ధాన్యం ఆరబెట్టుకోవడానికి సరిపడా సిమెంట్‌ కల్లాలు లేకపోవడంతో రైతులు రోడ్లపై ఆరబెట్టుకుంటున్నారు. మరికొందరు రైతులు కల్లాలు నిర్మించుకున్నప్పటికీ తక్కువ విస్తీర్ణంలో ఉండడంతో దిగుబడులు ఆరబెట్టడానికి అవి సరిపోక మళ్లీ రహదారులపైనే ఆరబోస్తున్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో ఎక్కడ చూసినా రహదారుల ఒక వైపు పంట దిగుబడులు ఆరబోసి కనిపిస్తున్నాయి. వాటి చివర ప్రమాదకరంగా రాళ్లు పెడుతున్నారు. పంట ఉత్పత్తులు ఆరబోసి టార్పాలిన్లు కప్పి ఉంచడంతో రాత్రి వేళ సంబంధిత రహదారి కనపడక తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

ఫకల్లాల బిల్లుల చెల్లింపులు ఇలా..

రైతులు తమ పంట పొలాల వద్ద కల్లాలు నిర్మించుకుంటే గతంలో ప్రభుత్వం ఒక్కో యూనిట్‌కు కొంత డబ్బులను అందజేసింది. 8.33 మీటర్ల పొడవు, 6.0 మీటర్ల వెడల్పుతో నిర్మాణమయ్యే కల్లాలకు ఒక్కో యూనిట్‌కు 56 వేల రూపాయలు అందించింది. 8.0 మీటర్ల పొడవు, 7.5 మీటర్ల వెడల్పుతో నిర్మాణమయ్యే కల్లాలకు ఒక్కో యూనిట్‌కు రూ.68 వేలు, 10 మీటర్ల పొడవు, 7.5 మీటర్ల వెడల్పుతో నిర్మాణమయ్యే కల్లాలకు ఒక్కో యూనిట్‌కు రూ.85 వేలు గతంలో ప్రభుత్వం అందించింది. అయితే కల్లాల నిర్మాణం నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని 2021-22 ఆర్థిక సంవత్సరంలో వాటి నిర్మాణాలను అధికారులు నిలిపివేశారు. దీంతో సిమెంట్‌ కల్లాల నిర్మాణాలు ఆగిపోయాయి. పలువురు నిర్మించుకున్నప్పటికీ బిల్లులు రావడం లేదని రైతులు అంటున్నారు.

ఫముందస్తు జాగ్రత్తలతోనే మేలు..

రైతుల భాగస్వామ్యంతో పలు ప్రభుత్వ శాఖ ఉద్యోగులు సమన్వయంతో వ్యవహరిస్తే ధాన్యం ఆరబోత వల్ల రహదారులపై జరిగే ప్రమాదాలు కొంత వరకు నివారించే అవకాశాలున్నాయి. వ్యవసాయ శాఖ గ్రామాల వారీగా ధాన్యం దిగుబడులపై అంచనా వేసి ఆరబోయడానికి ముందే ప్రణాళికలు రూపొందించాలి. వ్యవసాయ శాఖ అందించిన సమాచారం వల్ల రెవెన్యూ శాఖ ప్రత్యామ్నయ ఏర్పాట్లపై దృష్టి సారించాలి. ఖాళీ స్థలాలను ఎంపిక చేసి చదును చేయించాలి. రైతులు ధాన్యం ఆరబెట్టుకోవడానికి అనువుగా స్థలాలను మార్చాలి. తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్లపై ధాన్యం ఆరబోస్తే కనీసం సూచిక బోర్డులు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలి. రైతులు చీకటి పడిన తదుపరి ధాన్యాన్ని రోడ్డుపై కాకుండా పక్కకు కుప్పగా పోసుకునేలా ప్రోత్సహించాలి. సంచులు, కుప్పలు వాహన చోదకులకు కనిపించేలా రేడియం స్టిక్కర్లను ఏర్పాటు చేయాలి. పలు ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, రైతులు సమన్వయంతో జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకైనా ప్రమాదాలు అరికట్టవచ్చని వాహన చోదకులు అంటున్నారు.

Updated Date - Apr 14 , 2025 | 12:47 AM