రామగుండం వార్షిక బడ్జెట్‌ రూ.246.47కోట్లు

ABN, Publish Date - Apr 05 , 2025 | 12:01 AM

రామగుండం నగరపాలక సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.246.47కోట్ల వార్షిక బడ్జెట్‌ రూపొందిం చుకుంది. కార్పొరేషన్‌ ప్రత్యేకాధికారి, కలెక్టర్‌ శ్రీహర్ష బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు.

రామగుండం వార్షిక బడ్జెట్‌ రూ.246.47కోట్లు

కోల్‌సిటీ, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): రామగుండం నగరపాలక సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.246.47కోట్ల వార్షిక బడ్జెట్‌ రూపొందిం చుకుంది. కార్పొరేషన్‌ ప్రత్యేకాధికారి, కలెక్టర్‌ శ్రీహర్ష బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. గతేడాది సవరించిన బడ్జెట్‌ రూ.97.62కోట్ల నుంచి ఈసారి అంచనా బడ్జెట్‌ రూ.246.47కోట్లకు పెరిగింది. 2024-25 ఆర్థిక సంత్సరంలో రూ.10కోట్ల మిగులుతో రూ.192.42కోట్ల బడ్జెట్‌ అంచనా వేశారు. కానీ అనుకున్న మేర పన్నులు, ఇతర గ్రాంట్లు రాకపోవడంతో బడ్జెట్‌ను సవ రించి రూ.97.62కోట్లకు కుదించారు. ఈసారి అమృత్‌, టీయూఎఫ్‌ఐడీసీ, 15వ ఆర్థిక సంఘం, పరిశ్రమల సీఎస్‌ఆర్‌లు అంచనా వేసుకుని బడ్జెట్‌ను రూ.246.47కోట్లకు పెంచారు.

రామగుండం నగరపాలక సంస్థ 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.10.46కోట్ల మిగులుతో రూ.196.42కోట్ల వార్షిక బడ్జెట్‌ను రూపొందించు కుంది. ఈ బడ్జెట్‌లో సాధారణ నిధులు, ప్రభుత్వ గ్రాంట్లపై భారీ అంచనాలు పెట్టుకుని రూపొందించింది. ముఖ్యంగా డీఎంఎఫ్‌టీ నుంచి రూ.15కోట్లు వస్తాయని అంచనా వేస్తే రూ.22లక్షల నిధులు వచ్చాయి. ఇక టీయూఎఫ్‌ఐడీసీకి సంబంధించి గతేడాది గ్రాంట్‌ విడుదల కాలేదు. రూ.10కోట్లు పరిశ్రమల నుంచి సీఎస్‌ఆర్‌ నిధులు అంచనా వేయగా రూ.1.16కోట్లు మాత్రమే మాత్రమే వచ్చాయి. ఇక అమృత్‌ రూ.50కోట్ల అంచనా వేస్తే నిధులు విడుదల కాలేదు. అమృత్‌, టీయూఎఫ్‌ఐడీసీ, డీఎంఎఫ్‌టీ, సీఎస్‌ఆర్‌ నిధులు అంచనాల ప్రకారం రాలేదు. కేవలం స్టాంప్‌ డ్యూటీ రాదని ఆశలు వదలుకొని గతేడాది బడ్జెట్‌లో ఆదాయంగా పెట్టుకోలేదు. కానీ రూ.16.5కోట్లు విడుదల అయ్యాయి. గత ఏడాది సాధారణ నిధుల అంచనాల్లోనూ లెక్కలు తప్పాయి. ముఖ్యంగా పన్నుల వసూళ్లకు సంబంధించి సాధారణ పన్నుల వసూళ్లు, ప్రభుత్వ ఆస్తులపై పన్నులు, షాపుల అద్దెల, భవన నిర్మాణాల అనుమతుల విషయంలో అంచనాలు తప్పాయి. ఒక్క ఎల్‌ఆర్‌ఎస్‌ ఆదాయం మాత్రం సవరించిన బడ్జెట్‌లో రూ.2కోట్ల అంచనా వేస్తే రూ.5కోట్ల ఆదాయం వచ్చింది. ఆదాయ మార్గాలు ఆశించిన మేర లేకపోవడంతో సవరించిన బడ్జెట్‌ను రూ.97.62కోట్లకు కుదిరించారు.

2025-26లో రూ.246.47కోట్లతో బడ్జెట్‌

2025-26 ఆర్థిక సంవత్సరంలో రామగుండం నగరపాలక సంస్థ రూ.246.47కోట్లతో వార్షిక బడ్జెట్‌ను రూపొందించింది. ఇందులో సాధారణ పన్నుల ఆదాయాన్ని రూ.5కోట్ల మేర పెంచుతూ అంచనా వేసింది. గతేడాది సవరించిన బడ్జెట్‌ రూ.8.26కోట్లు ఉంటే ఈసారి రూ.12కోట్లకు అంచనా వేశారు. ప్రభుత్వ ఆస్తులపై పన్నులు, కేంద్రప్రభుత్వ ఆస్తులపై పన్నులను రూ.1కోటి మేర పెంచి అంచనా వేశారు. స్టాంప్‌ డ్యూటీ నిధులు గతంలో రూ.16.05కోట్లు విడుదల కాగా ఈసారి రూ.2.5కోట్లు అంచనా వేశారు. షాపింగ్‌ కాంప్లెక్స్‌, కిరాయిలు, ట్రేడ్‌ లైసెన్స్‌కు సం బంధించి రూ.50లక్షలు, భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి రూ.8కోట్లు, ఎల్‌ఆర్‌ఎస్‌ రూ.2.5కోట్లుగా అంచనా వేశారు. మొత్తంగా పన్నులు, ఇతర నాన్‌ ట్యాక్సెస్‌ ఆదాయాన్ని ఈ ఏడాది రూ.40.5కోట్లుగా చూపారు. గతేడాది సవరించిన బడ్జెట్‌లో రూ.46.92కోట్లు ఉంటే ఈ సారి రూ.40.5కోట్లుగా అంచనా వేశారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి గ్రాంట్లపైనే ఎక్కువగా అంచనా పెట్టుకున్నారు. అమృత్‌ రూ.88కోట్లు, 15వ ఆర్థిక సంఘంకు సంబంధించి రూ.10కోట్లు, స్టేట్‌ మ్యాచింగ్‌ గ్రాంట్‌ రూ.2 కోట్లు, పరిశ్రమల సీఎస్‌ఆర్‌ రూ.5కోట్లు, టీయూఎఫ్‌ఐడీసీ రూ.80కోట్లు, నియోజకవర్గ అభివృద్ది నిధులు రూ.10కోట్లు, డీఎంఎఫ్‌టీ రూ.3కోట్లు అంచనా వేస్తున్నారు. గత ఏడాది ముఖ్యమంత్రి మున్సిపల్‌కు రూ.10కోట్ల నిధులు విడుదల చేయగా ఈ సారి దానిపై ఎలాంటి ఆశలు పెట్టుకోలేదు.

రూ.236కోట్ల వ్యయం అంచనా...

రూ.246కోట్ల ఆదాయాన్ని అంచనా వేసుకుంటున్న కార్పొరేషన్‌ రూ.236 కోట్ల వ్యయంతో రూ.10.46కోట్లు మిగులు బడ్జెట్‌ ఉంటుందని లెక్కలు గడుతోంది. వ్యయం విషయంలో కార్మికుల వేతనాలకు సంబంధించి రూ.1.5కోట్లు అంచనాలు పెంచారు. అదే సమయంలో పారిశుధ్య కార్మికుల సౌకర్యాల బడ్జెట్‌ను రూ.25 నుంచి రూ.15లక్షలకు, పారిశుధ్యం బ్లీచింగ్‌, ఇతర కొనుగోళ్లపై కూడా రూ.5లక్షల కోత పెట్టారు. వాహనాల ఇంధనానికి సంబంధించి రూ.2.5కోట్లు, కుక్కలు, కోతులు, పందుల నియంత్రణకు రూ.10లక్షలు, పండుగల నిర్వహణకు రూ.50లక్షలు, వీధి దీపాల చార్జీలకు రూ.1.7కోట్లు, ఈఈఎస్‌ఎల్‌ బకాయిల చెల్లింపులకు రూ.2కోట్లు పెట్టారు. ఈ ఏడాది ఎన్నికలు జరుగుతాయని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల నిర్వ హణకు రూ.1కోటి బడ్జెట్‌లో కేటాయించారు. గ్రీన్‌ బడ్జెట్‌ను రూ.4.55 కోట్లుగా నిర్ణయించారు. వీధిదీపాల విడిభాగాల కొనుగోలుకు రూ.40లక్షలు కేటాయించారు.

Updated Date - Apr 05 , 2025 | 12:01 AM