Share News

సన్న బియ్యం పంపిణీ చరిత్రాత్మకం

ABN , Publish Date - Apr 01 , 2025 | 11:39 PM

పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తోంది తెలంగాణ రాష్ట్రమేనని, ఈ నిర్ణయం చరిత్రాత్మకమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. కరీంనగర్‌ హౌసింగ్‌ బోర్డు కాలనీలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి మంగళవారం ప్రారంభించారు.

సన్న బియ్యం పంపిణీ చరిత్రాత్మకం
సన్నబియ్యం పంపిణీ చేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌

- మంత్రి పొన్నం ప్రభాకర్‌

సుభాష్‌నగర్‌, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తోంది తెలంగాణ రాష్ట్రమేనని, ఈ నిర్ణయం చరిత్రాత్మకమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. కరీంనగర్‌ హౌసింగ్‌ బోర్డు కాలనీలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేదల కోసం మహత్తరమైన పథాకానికి శ్రీకారం చుట్టారని అన్నారు. రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా సన్నబియ్యాన్ని సరఫరా చేస్తామని, ఈ పథకం పేదల గుండెల్లో నిలుస్తుందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం త్వరలో అర్హులైన పేద ప్రజలందరికి రేషన్‌ కార్డులలతోపాటు, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందని తెలిపారు. జిల్లాలో వానాకాలంలో 72 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్నరకం ధాన్యం ఉత్పత్తి అయిందని, 34 వేల మెట్రిక్‌ టన్నుల సన్నబియ్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇలాంటి ఆలోచన చేయకపోవడం శోచనీయమన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర సహకరించాలన్నారు. బండి సంజయ్‌కుమార్‌, ఈటల రాజేందర్‌, డాక్టర్‌ లక్ష్మన్‌ వంటి కీలక నేతలు తమతో కలిసి రావాలన్నారు. తెలంగాణలో కూడా తమిళనాడు తరహా రాజకీయ స్ఫూర్తి రావాలన్నారు. బుధవారం ఢిల్లీలో నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. హెచ్‌సీయూ భూముల వ్యవహారంలో ఇంకా సమావేశాలు, చర్చలు జరుగుతున్నాయన్నారు.

కరీంనగర్‌లో తాగునీటి సమస్య లేదు

కరీంనగర్‌లో తాగునీటి సమస్య లేదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. కొందరు ప్రజలను కన్ఫ్యూజ్‌ చేసేందుకు తాగినీటి సమస్య ఉందని రాద్ధాంతం చేస్తున్నారన్నారు. వారి మాటలు ప్రజలు నమ్మవద్దని సూచించారు. కరీంనగర్‌లో జూలై వరకు ఎలాంటి తాగునీటి సమస్య ఉండదని, ఒకవేళ ఎక్కడైనా తలెత్తితే అధికారులు ఆ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఎల్‌ఎండీలో ప్రస్తుతం 5.7 టీఎంసీల నీరు ఉందన్నారు. మిడ్‌మానేరు రిజర్వాయర్‌లో ప్రస్తుతం 8.78 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు రావని మంత్రి భరోసా ఇచ్చారు. డీసీసీ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ సన్నబియం పథకం దేశచరిత్రలో విప్లవాత్మకమైందని, ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ లక్ష్మికిరణ్‌, ఆర్డీవో మహేశ్వర్‌, డీఎస్‌వో నర్సింగరావు, సివిల్‌ సప్లయిస్‌ డీఎం రజనీకాంత్‌, అర్బన్‌ బ్యాంకు అసోసియేట్‌ చైర్మెన్‌ గడ్డం విలాస్‌రెడ్డి, డైరెక్టర్‌ ముక్క భాస్కర్‌, మాజీ కార్పొరేటర్లు, నాయకులు ఆకుల పద్మ ప్రకాశ్‌, నేతికుంట యాదయ్య, మల్లిఖార్జున రాజేందర్‌, ఆకారపు భాస్కర్‌రెడ్డి, మాచర్ల ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 01 , 2025 | 11:39 PM