KC Venugopal: కార్యకర్తలను పట్టించుకోండి!
ABN, Publish Date - Jan 09 , 2025 | 04:43 AM
అధికారం వచ్చి ఏడాది గడిచింది. మీరు పదవులు అనుభవిస్తున్నారు. ఇకనైనా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన కార్యకర్తలకు న్యాయం చేయండి.. వారిని కాపాడుకోండి.
మంత్రుల పనితీరుపై ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్యేల తీరుపై కార్యకర్తలు హ్యాపీగా లేరు
అందరూ పనితీరును మెరుగుపరచుకోవాలి.. సంక్షేమ కార్యక్రమాల అమలు బాగుంది
ప్రచారం ప్రజల్లోకి వెళ్లేలా పీసీసీ చూడాలి.. పీఏసీ భేటీలో కేసీ వేణుగోపాల్ నిర్దేశం
నెలలో కమిటీల నిర్మాణం.. త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి పీఏసీ నిర్ణయం
హైదరాబాద్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): ‘‘అధికారం వచ్చి ఏడాది గడిచింది. మీరు పదవులు అనుభవిస్తున్నారు. ఇకనైనా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన కార్యకర్తలకు న్యాయం చేయండి.. వారిని కాపాడుకోండి. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసి వారికి అవకాశం కల్పించండి’’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేశారు. మంత్రులు తమ పనితీరును మెరుగు పరుచుకోవాలని, వారి పనితీరుకు సంబంధించిన పూర్తి సమాచారం తన వద్ద ఉందని అన్నారు. మంత్రుల పనితీరు పట్ల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల పనితీరు పట్ల పార్టీ కార్యకర్తలూ సంతోషంగా లేరని తెలిపారు. దీనిని సరిదిద్దుకోవాలని సూచించారు. గాంధీభవన్‌లో వారానికోసారి నిర్వహిస్తున్న ‘మంత్రితో ముఖాముఖి’ కార్యక్రమాన్ని జిల్లాల్లోనూ నెలకోసారి నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు, కార్యకర్తలకు దగ్గర కావాలన్నారు.
ఏడాది కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను సీఎం రేవంత్‌రెడ్డి, పీఏసీ సభ్యులు వివరించగా.. వాటి అమలుతీరుపై వేణుగోపాల్ సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన ప్రచారం ప్రజల్లోకి వెళ్లడంలేదని, పార్టీ సోషల్ మీడియా వింగ్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. దీనిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే కార్యాచరణను అమలు చేయాల్సిందిగా పీసీసీకి సూచించారు. ఇక 2025 సంవత్సరాన్ని పార్టీ సంస్థాగత నిర్మాణ సంవత్సరంగా తీసుకోవాలని వేణుగోపాల్ అన్నారు. బ్లాక్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీల నిర్మాణాన్ని త్వరితగతిన ఏర్పాటు చేయాలని సూచించారు.
ఆయన సూచన మేరకు నెల రోజుల్లో ఈ కమిటీలను వేయాలని, త్వరితగతిన నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని పీఏసీ నిర్ణయించింది. ప్రతి నెలా పీఏసీ సమావేశం నిర్వహించాలన్న నిర్ణయమూ జరిగింది. కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లోపే ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని, లేదంటే ఆ ఎన్నికలపై దీని ప్రభావం పడే అవకాశం ఉందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ పీఏసీ సమావేశంలో అభిప్రాయపడ్డారు. కాగా, ఏడాదిపాటు సంవిధాన్ బచావ్ కార్యక్రమాలు తీసుకోవాలని ఇటీవల సీడబ్ల్యూసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని కేసీ వేణుగోపాల్.. పీఏసీలో వివరించారు. దీనికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అయితే ఈ నెల 26 నుంచి 28 మధ్యలో హైదరాబాద్‌లో సంవిధాన్ బచావ్ ర్యాలీని నిర్వహిస్తామని, దానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ సమయం ఇవ్వాలని పీఏసీ సభ్యులు కోరారు. దీనిపై వారిని సంప్రదిస్తానని వేణుగోపాల్ చెప్పారు.
Updated Date - Jan 09 , 2025 | 04:43 AM